విశాఖపట్నం: యువగళం ముగింపు సభ విఫలం అవ్వాలని కంకణం కట్టుకున్న వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో తిరుగుబాటు వస్తే జగన్ అడ్డుకోలేడని నవశకం సభ నిరూపించిందన్నారు. ఉత్తరాంధ్ర చరిత్రలోనే అతి పెద్ద సభ యువగళం ముగింపు సభ అని అన్నారు. సభ సక్సెస్ చేసిన టీడీపీ – జనసేన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు వచ్చినట్లుగా నవశకం సభకు ప్రజలు తరలి వచ్చారన్నారు. రేపు జరిగే ఎన్నికలు జగన్కు టీడీపీకి మధ్య కాదని.. జగన్కు జనసేన మధ్య కాదని.. జగన్కు ప్రజలకు మధ్య పోటీ అని అన్నారు. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సభ జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో మూడు చోట్ల ఇదే తరహాలో సభలు నిర్వహిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.