నారా చంద్రబాబు నాయుడు అనగానే ఐటీ అభివృద్ధి, ఈ-గవర్నెన్స్, సంస్కరణల గురించే కాదు... రైతు సంక్షేమం కోసం వ్యవసాయరంగంలో ఆయన తీసుకొచ్చిన మార్పుల గురించి కూడా చెప్పుకోవాలి.
వ్యవసాయానికి నీరే ప్రాణం. అటువంటి నీటిపారుదల రంగంలో సాగునీటి సంఘాల ఏర్పాటు విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. నీటిపారుదల వ్యవస్థపై రైతులకే అధికారాన్ని, బాధ్యతలను అప్పగించిన వినూత్న ప్రయోగమే ఇది. సాగునీటిని సమర్థవంతంగా, సమానంగా పంపిణీ చేయడం, నీటి వనరులను రైతులే పద్దతి ప్రకారం అభివృద్ధి చేసుకోవడం లక్ష్యంగా ఈ సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసారు. రైతుల నీటిపారుదల నిర్వహణా చట్టాన్ని తీసుకువచ్చి... సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి... 10,292 సాగునీటి సంఘాలను జూన్ 1997 నుంచి పనిచేయించారు చంద్రబాబు. ఈ సంఘాలకే చెరువుల మరమ్మతు పనులు అప్పగించారు.
అలాగే కరవును పారదోలి బంజరు, బీడు భూములను ససైశ్యామలంగా మార్చేందుకు నీటి నిల్వ (వాటర్ షెడ్) కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రబాబు. ఆనాడు రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసిన వాటర్ షెడ్ కార్యక్రమంతో అటు గ్రామీణులకు ఉపాథి అవకాశాలు పెరిగాయి, ఇటు 100 లక్షల హెక్టార్ల భూమి అభివృద్ధిలోకి వచ్చింది. ఇక సుస్థిర జల సంరక్షణ, సమర్థ నీటి వినియోగం లక్ష్యంగా చేపట్టిన 'నీరు-మీరు' కార్యక్రమ ప్రభావంతో భూగర్భజలాలు పెరిగాయి.
ఇక ఆనాడు చంద్రబాబు రూ.8865 కోట్లతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఫలితంగా 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటి కల్పన జరిగింది. మరో 18 లక్షల ఎకరాలు స్థిరీకరించబడ్డాయి. శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ, శ్రీరామ్ సాగర్ మొదటి రెండు దశలు, తెలుగు గంగ, ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ, ప్రియదర్శిని జూరాల, వెలిగొండ, గాలేరు నగరి, హంద్రీనీవా, నెట్టెంపాడు వంటి 18 మధ్య తరహా, 85 చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. 136 ఎత్తిపోతల పథకాలు చేపట్టి 1,93,800 ఎకరాలను సాగు కిందికి తెచ్చారు. తెలంగాణలో సూక్ష్మ సాగు సత్ఫలితాలను ఇచ్చింది.
ఇక గ్రామ గ్రామాన 2,02,473 రైతుమిత్ర సంఘాలను ఏర్పాటు చేసి సుమారు మూడు లక్షల మంది రైతులకు శిక్షణను ఇప్పించారు. టీవీలలో సైతం రైతు మిత్ర కార్యక్రమాలను ప్రసారం చేసి అన్నదాతలకు సాగుపై అవగాహాన పెంచడంతో పంట ఉత్పత్తి పెరిగింది.
రైతుబంధు పథకం కింద అన్నదాత తాను కష్టపడి పండించిన పంటకు తగిన ధర పలికే వరకు గోదాముల్లో నిల్వచేసుకోవచ్చు. పైగా పంట విలువలో 75 శాతం ఋణం తీసుకోవచ్చు. ఈ రుణానికి 90 రోజుల వరకు వడ్డీ కట్టక్కర లేదు.
రైతు బజార్లు అంటేనే చంద్రబాబు గుర్తొస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 58 పురపాలక సంస్థలు, 7 నగరపాలక సంస్థల పరిధిలో 107 రైతు బజార్లను ఏర్పాటు చేసారు. దళారులు లేకుండా తమ ఉత్పత్తులను వినియోగ దారునికి నేరుగా అమ్ముకునే విధంగా రైతు కోసం ఏర్పాటు చేసిన ఈ రైతు బజార్ల మూలంగా రైతుకు 20 శాతం ఎక్కువ ఆదాయం వచ్చేది. అలాగే వినియోగదారునికి 20 శాతం తక్కువకి ఉత్పత్తులు దొరికేవి.
ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు హైద్రాబాదు, రెడ్ హిల్స్ ప్రాంతంలో ఉద్యాన సాగు శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు చంద్రబాబు. తద్వారా హైద్రాబాదులో ద్రాక్ష పంటను బాగా ప్రోత్సహించారు. అలాగే బిందు సేద్యం, సూక్ష్మ సాగు పద్దతులను ప్రోత్సహించి రైతుకు అండగా నిలిచారు చంద్రబాబు
ప్రతిపక్షంలో ఉన్నా రైతు సంక్షేమ ధ్యాసే...
2004 తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రైతు కోసం పోరాటాలు ఎన్నో చేసారు నారా చంద్రబాబు నాయుడు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా 2008 ఫిబ్రవరి 27న న్యూఢిల్లీలో జాతీయ నాయకులతో కలిసి కిసాన్ ర్యాలీలో పాల్గొన్నారు చంద్రబాబు
2010లో తెలుగు రైతు కోసం మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణంపై చంద్రబాబు నిరసన చేపట్టి అరెస్ట్ అయ్యారు. రైతు కోసం మొదటిసారిగా జైలుకు వెళ్లారు చంద్రబాబు
రాష్ట్రంలో రైతుకు గిట్టుబాటు ధర దక్కక నష్టాలతో అప్పులపాలవుతున్న అన్నదాత కోసం 2010 డిసెంబర్ లో 8 రోజుల నిరాహార దీక్ష చేసారు
అలాగే అన్నదాతకు అండగా నిలిచి 2011 డిసెంబర్ లో 17 జిల్లాల్లో రైతు పోరుబాట యాత్ర చేబట్టారు
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా...
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రకు ఎన్నెన్నో సమస్యలు. ఖజానాలో డబ్బు లేదు. పైగా లోటు బడ్జెట్. సంపాదించిపెట్టే సంస్థలు లేవు. అయినా అన్నదాతకు తాను ఇచ్చిన హామీకి కట్టుబడి.... ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేదికపైనే రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేసారు నారా చంద్రబాబు నాయుడు. దేశంలో అంతకు ముందెప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో 2014 డిసెంబర్ 10వ తేదీన చారిత్రక రైతు రుణమాఫీ పథకం అమలు చేసారు. రూ.50 వేల లోపు రుణాలున్న 27 లక్షల మంది రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేసారు.
మొత్తంగా అన్నదాతలకు మూడు విడతలుగా రూ.15,147 కోట్లు చెల్లించారు. కౌలు రైతులకు కూడా రుణమాఫీ కింద రూ.3,098 కోట్లు ఇవ్వడం దేశంలోనే ఒక చరిత్ర. అలాగే ఉద్యాన రైతులకు రూ.385 కోట్లు చెల్లించారు. రుణమాఫీ 4, 5 విడతల కింద కూడా మరో రూ.7,960 కోట్లు కేటాయించినప్పటికీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేసింది.
వ్యవసాయ రంగ అభివృద్ధికి చంద్రబాబు సర్కారు తీసుకున్న చొరవతో ఎన్నో సమస్యల పరిష్కారంతో పాటు వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానహబ్‌గా మార్చే ప్రణాళికలు అమలుచేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీరు తెచ్చి కృష్ణా డెల్టాలో మాగాణి భూములకు ప్రాణం పోశారు. తద్వారా మిగులు కృష్ణా జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలించేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
రైతురథం పథకం కింద ఒక్కో ట్రాక్టర్‌పై రూ.2 లక్షల వరకు రాయితీతో 21,500 ట్రాక్టర్ల పంపిణీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం ముందుకు రాకపోయినా రాష్ట్రమే సొంతంగా ‘మార్కెట్ జోక్యం’ కింద పొగాకు, మిరప, పసుపు, కందులు, ఉల్లి తదితర ఉత్పత్తుల కొనుగోలు చేపట్టింది.
సూక్ష్మసేద్యానికి 90 శాతం రాయితీ ఇచ్చింది.
అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద... కౌలు రైతులతో సహా ఐదెకరాల లోపు రైతు కుటుంబాలకు రూ.15 వేలు ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టారు. ఏడాదికి రూ.10 వేల కోట్లు పైనే ఖర్చు చేసేందుకు ప్రణాళికలు వేశారు.
ఇక ఐదేళ్ళలో రూ.63,373 కోట్లు ఖర్చు చేసి 62 ప్రాజెక్టులు చేపట్టి 23 ప్రాజెక్టులు పూర్తిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2018 సెప్టెంబర్ ఒక్క నెలలోనే 12 ప్రాజెక్టులను ప్రారంభించారంటే రైతు కోసం నారా చంద్రబాబు నాయుడు సంకల్పం ఎలాంటిదో ఊహించండి. పోలవరం 73 శాతం పనులు పూర్తిచేయడం ఒక సంకల్పం.
చంద్రబాబు పాలించిన ఐదేళ్ళలో... ఎన్నడూ ఎరువుల కోసం, విత్తనాల కోసం రైతులు బారులు తీరలేదు. కరెంటు కోసం ఎదురుచూపులు లేవు. అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రైతులకు చాలా మేలు చేసింది. ఉద్యమంలా చేపట్టిన పంట కుంటల తవ్వకం అద్భుత ఫలితాలు ఇచ్చింది. ఎన్టీఆర్ జలసిరి, నీరు-చెట్టు, భూసార కార్డులు, పొలం పిలుస్తోంది, చంద్రన్న రైతు క్షేత్రాలు, సూక్ష్మ పోషకాలకు రాయితీలు, జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం వంటి ఎన్నో పథకాలు రైతు లోగిళ్ళలో సిరులను కురిపించాయి. అన్నదాత మోములో సంతోషాన్ని చూపించాయి. రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు పాలన అసలైన రైతు ప్రభుత్వం అనిపించుకుంది