అమరావతి: అక్రమ కేసులతో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఆత్మస్దైర్యాన్ని జగన్ రెడ్డి దెబ్బతీయలేరని టీడీపీ నేతలు ఉద్ఘాటించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకి హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయటంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మిఠాయిలు పంచి, టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరమన్నారు. న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతోనే ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాడాం. తప్పుడు కేసులు న్యాయాస్థానాల ముందు నిలబడవని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి. జగన్ రెడ్డి అక్రమ కేసులు చంద్రబాబు నాయుడి ఆత్మస్దైర్యాన్ని దెబ్బతీయలేవు. సంబంధం లేని ప్రతిదానికీ చంద్రబాబును బాధ్యుడిని చేయలేరు. ఈ కేసులో ఆయన పాత్రపై కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవని కోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు బాబుని అక్రమంగా అరెస్ట్ చేసి ఇన్ని రోజులు గడచినా ఒక్క ఆధారమూ చూపలేకపోయారు. కోర్టు తీర్పుతోనైనా జగన్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి. వైసీపీ అరాచక పాలన పట్ల ప్రజలు విసుగు చెందారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిరచి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మరియు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.