- సమగ్ర ప్రణాళికతో పేదరికం రూపుమాపుతాం
- ఏఐ రోజుల్లో డోలీ మోతలు బాధాకరం, పరిస్థితి మారుస్తాం
- గిరిజన విద్యార్థుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలో స్టడీ సర్కిళ్లు
- గిరిజనుల అభివృద్ధి కోసం ఇకపై చైతన్యం 2.0 కార్యక్రమం
- 2,191 గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ కల్పిస్తాం
- రూ.2,373 కోట్లతో ప్రతి గిరిజన కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు
- కూటమి ప్రభుత్వంలో వివక్ష ఉండదు…కక్ష సాధింపులుండవు
- గత పాలకులు దోచిన ప్రజల సొమ్మును కక్కించి పేదలకే ఖర్చు చేస్తాం
- అరకు కాఫీతో పాటు ఆర్గానిక్ ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం
- పాడేరులో మెడికల్ కాలేజీని రూ.500 కోట్లతో పూర్తి చేస్తాం
- లంబసింగిలో స్వాతంత్య్ర సమరయోధుల కోసం మ్యూజియం
- ప్రపంచ ఆదివాసీ దినోత్సంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు
- గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం, అడవి తల్లికి చీర సమర్పించిన సీఎం
అమరావతి(చైతన్యరథం): అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సమగ్ర ప్రణాళికతో గిరిజనుల్లో పేదరికాన్ని రూపుమాపుతామన్నారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవత సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆదివాసీలు పండిరచిన ఉత్పత్తులు, తయారు చేసిన కళాకృతులను పరిశీలించారు. అరకు కాఫీని ఆస్వాదించారు. స్వాతంత్రోద్యమంలో ఆదివాసీల పాత్ర, చరిత్రను తెలియజేసేలా రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అడవి తల్లికి ఆదివాసీ చీరను సమర్పించారు. అనంతరం ఆదివాసీలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలోనే చనిపోతున్నారు. పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. ఏ పని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆదివాసీల్లో పేదరికం ఎక్కువగా ఉంది…వారిని అన్ని విధాలా పైకి తీసుకొచ్చేందుకు నేను శ్రద్ధ తీసుకుంటాను. రాబోయే ఐదేళ్లలో నిర్దిష్ట ప్రణాళికతో పేదరికాన్ని తగ్గిస్తాం. పేరుకు పథకాలు ఇవ్వడం కాదు…వాటి ఫలితాలు ఇచ్చేలా ఉండాలి. గిరిజనుల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకొస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో కూడా డోలీ మోతలు కనబడటం చాలా బాధగా ఉంది. నేను రాజకీయ వివక్ష చూపించను…కక్ష సాధింపులకు పాల్పడను. కానీ రాష్ట్ర ప్రజల ఖజానాను, ఆస్తులను దోచిన వారిని శిక్షిస్తా. దోచిన సొమ్మును రికవరీ చేసి పేదలకు ఖర్చు పెడతా. గిరిజనుల జీవితాల్లో వెలుగులు రావాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
గిరిజన అభ్యర్థుల కోసం డీఎస్సీ శిక్షణా కేంద్రాలు
ఇటీవల 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాం. డీఎస్సీకి పోటీ పడే గిరిజన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తాం. గిరిజన విద్యార్థుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తాం. ఆదివాసీల్లో అనేక కళలున్నాయి. అరకు గిరిజన నృత్యం దేశంలోనే ప్రత్యేకమైంది. అనేక కళలున్న ఆదివాసీలు చాలా రంగాల్లో వెనకబడి ఉన్నారు. ప్రతి యేడాది ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాలని నాడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జీఓ నెంబర్ 123ను విడుదల చేసి నిర్వహించాం. కానీ గత ప్రభుత్వం ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం మానేసింది. మన దేశానికి రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ఉన్నారు, ఆమెను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.
పాఠశాలలో ఉపాధ్యాయిరాలిగా పని చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి అయ్యారంటే అదీ ఆదివాసీల్లో ఉండే ప్రతిభ. ఆదివాసీలు శౌర్యం, ప్రతిభ, నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రకృతిని ఆరాధిస్తారు. ఎగ్జిబిషన్ లో ఏకలవ్యుడి ఫోటోలు చూశాను. గిరిజన కుటుంబంలో పుట్టాడు. విలువిద్యను అందించేందుకు గురువులు నిరాకరిస్తే పట్టుదలతో విద్యనభ్యసించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాంటి వ్యక్తి గిరజనుల్లో పుట్టుడం అదృష్టం. వ్యవసాయం, హస్తకళలు, నృత్యం, సంప్రదాయ ఆహారాలను గిరిజనులు పాటిస్తున్నారు. వాటిద్వారా అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్వాతంత్య్రం పోరాటంలో ఆదివాసీలు పెద్దఎత్తున పాల్గొన్నారు. బిర్సాముండా, తాత్వాబిల్, మన తెలుగువారైన కొమరం భీం లాంటి వాళ్లు బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అల్లూరి సీతారామరాజు మీ అండతోనే బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని అంతం చేయడానికి పోరాడి ప్రాణత్యాగం చేశారు. అందుకే దేశానికే ముద్దబిడ్డగా మిగిలారు. మీ త్యాగాలు, మీ మద్దతు జాతి మరవదు. దేశంలో 10.42 కోట్ల మంది గిరిజనులున్నారు. రాష్ట్రంలో 5.56 శాతం మంది ఉన్నారని సీఎం చంద్రబాబు వివరించారు.
ఆదివాసీల వెనకబాటుతనంపై సమగ్ర అధ్యయనం
మీలో అనేక కట్టుబాట్లు ఉన్నాయి. మైదానంలో ఉండే గిరిజనుల జీవన ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి. ఏజన్సీలో ఉండే వారికి కనీసం రోడ్లు కూడా సరిగా లేవు. సమైఖ్య రాష్ట్రంలో చైతన్యం అనే కార్యక్రమం పెట్టి పెనుమార్పులకు శ్రీకారం చుట్టాం. మైదాన ప్రాంతాల్లో ఉండేవారి కంటే ఏజన్సీలో ఉండేవారికి వనరులు ఎక్కువ అందుబాటులో ఉంటాయి. అరకు కాఫీని ప్రమోట్ చేశాం. అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను అందింపుచ్చుకున్నాం. చాలామంది అర్గానిక్ ఆహార ఉత్పత్తులను పండిస్తున్నారు. ఎక్కడా దొరకని తేనె మన ప్రాంతాల్లో దొరుకుతోంది. కాఫీకి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా వ్యాపారంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు సాగును ప్రోత్సహించాం. ప్యారిస్ లో కూడా ప్రస్తుతం అరకు కాఫీ అమ్ముతున్నారు. కొన్ని పెద్ద పత్రికలు కూడా అరకు కాఫీ గురించి రాస్తున్నాయి. వ్యవసాయంలో అరకు కాఫీ కూడా భాగమని కథనాలు రాస్తున్నాయి.
ప్రధాని నరేంద్రమోదీ కూడా గతంలో అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఆదివాసీల మహిళలు డ్వాక్రా సంఘాల్లో కూడా ఉన్నారు. పేద మహిళలను సంఘటిత శక్తిగా మార్చాలని నాడు ఆలోచించాను. మారుమూల ప్రాంతాల్లోని ఆడబిడ్డలు చేసే కుల, చేతివృత్తులను ప్రోత్సహించాం. మల్టీ గ్రెయిన్ బిస్కెట్ల తయారీని ప్రోత్సహించాం. ఏ పని చేసినా అనునిత్యం సాధన చేస్తూ నైపుణ్యం పెంచుకుంటే ఆదాయం వస్తుంది. కానీ ప్రభుత్వం నుండి ఆధారం లేకపోవడంతో దెబ్బతిన్నారు. ఆదివాసీలు ఎందుకు వెనకబడి ఉన్నారో అధ్యయనం చేస్తున్నాను. ఈ రోజు నుండి చైతన్యం 2.0 ప్రారంభమైంది. దీని ప్రకారం ఎక్కడ పేదవారుంటే అక్కడికొచ్చి కావాల్సిన వనరులు అందించి పేదరికం నుండి బయటకు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
గత ప్రభుత్వం 16 సంక్షేమ పథకాలు రద్దు చేసింది
స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లైంది. చాలా వర్గాలు అభివృద్ధి చెంది ముందుకెళ్తున్నాయి. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఆదివాసీల్లో పుట్టిన పిల్లలతో పాటు తల్లులు కూడా చనిపోతున్నారు. ఈ సంఖ్యను తగ్గించాలి. పిల్లల సంఖ్య తగ్గితే వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. మన పిల్లలే మనకు ఆస్తి. వారిని బాగా చదివిస్తే మనం కష్టంలో ఉన్నప్పుడు చూసుకుంటారు. దేశంలో తలసరి ఆదాయం రూ.1.72 లక్షలు ఉంటే ఏపీలో రూ. 2.20 లక్షలు ఉంది. కానీ ఆదివాసీల్లో రూ.1.20 లక్షలే ఉంది. పేదల జీవన ప్రమాణాలపై శ్రద్ధ పెడతాం. అన్ని విధాలా పైకి తీసుకొస్తాం. తెలుగుదేశం పార్టీ హయాంలో గిరిజనుల కోసం 16 పథకాలు తీసుకొచ్చాం. 199 గురుకులాలు తీసుకొచ్చాం. 2,705 విద్యాసంస్థల్లో ప్రస్తుతం 2,45,380 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆదివాసీల్లో విద్యాభ్యాసం తక్కువగా ఉందని ఆలోచించిన ఎన్టీఆర్ ఏ ఊరిలో స్కూలు కావాలంటే ఆ ఊరిలోనే స్కూలు నిర్మించారు.
గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే ఉపాధ్యాయులుగా ఉండాలని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. మీ పిల్లల విద్య కోసం 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.450 కోట్లు ఖర్చు చేస్తే గత ప్రభుత్వం అందులో సగం కూడా ఖర్చు చేయలేదు. గిరిజన పిల్లలు అటవీ ప్రాంతాలకు పరిమితం కాకూడదని ఐఏఎస్, ఐఐఎంలలో చదవాలని శ్రద్ధ పెట్టాం. సివిల్ సర్వీస్ కోచింగ్ కు వెళ్లేందుకు 1000 మందికి రూ.13 కోట్లు ఖర్చు చేశాం. కానీ గత ప్రభుత్వం రూ.3 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి ముగ్గురికే ట్రైనింగ్ ఇచ్చింది. గిరిజనుల్లో ప్రతిభ ఉంది…దాన్ని సానబెట్టి బయటకు తీయాలి. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విదేశాల్లో చదువుకునేందుకు రూ.15 లక్షల చొప్పున సాయం అందించి 55 మందిని విదేశాలకు పంపాం. దీనికోసం రూ.7.5 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ గత ప్రభుత్వం అంబేద్కర్ పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకుని ఒక్కరికి మాత్రమే విదేశీ విద్యను అందించింది.
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లలో చదువించుకునేవారి కోసం ప్రభుత్వం నుండి ఫీజులు చెల్లించాం. గిరిపుత్రిక పథకం కింద 9,222 మంది గిరిజన యువతులకు రూ.56 కోట్లు పెళ్లికానుక అందించాం. దాన్ని కూడా గత ప్రభుత్వం నీరుగార్చింది. గిరిజనులు చనిపోతే బీమా ద్వారా రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించాం. రహదారి సదుపాయం లేని ప్రాంతాల నుండి ఆసుపత్రులకు డోలీల్లో వెళ్తున్నారని గుర్తించి ఫీడర్ అంబులెన్సులు తీసుకొచ్చాం. కానీ గత ప్రభుత్వం వాటిని కూడా నిర్వీర్యం చేయడంతో మళ్లీ డోలీల్లో మొసుకొచ్చే పరిస్థితి వచ్చింది. గర్భిణులను డోలీల్లో తీసుకొస్తుంటే అందులోనే ప్రసవిస్తున్నారు.
ఆధునిక యుగంలో ఉన్నాం…అయినా డోలీల్లో తీసుకొస్తున్నారంటే అందరూ బాధపడాలి. ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగితే మాతా, శిశు మరణాలు తగ్గుతాయి. సరైన పౌష్టికాహారం అందించేందుకు బాలింతలు, పిల్లలకు ఫుడ్ బాస్కెట్ ప్రవేశపెట్టాం. దోమల బెడద నుండి తప్పించుకోవడానికి దోమ తెరలు అందించాం. ట్రైకార్ ద్వారా ఉపాధి, భూమి కొనుగోలుకు రూ.685 కోట్లు ఖర్చు చేశాం. గిరిజన ప్రాంతాల్లో మొబైల్ టవర్లు ఏర్పాటు చేశాం. మేము ఉచితంగా కరెంట్ ఇస్తే దాన్ని కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. బాక్సైట్ తవ్వకాలు నిలిపేస్తే లేట్ రైట్ పేరుతో దొంగదారిలో తవ్వకాలు చేశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
లంబసింగిలో మ్యూజియం
ఆరోగ్యం, ఆర్థికంతో పాటు కుటుంబానికి కావాల్సిన వసతులపై సమగ్ర విధానం తీసుకొస్తాం. ఇంకా విద్యుత్తు, మరుగుదొడ్లతో పాటు తాగునీరు లేని గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో ప్రతి ఇంటికీ కనీస అవసరాలు కల్పిస్తాం. గిరిజన వాడల్లో రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. పాఠశాలకు పిల్లలందరూ వెళ్తున్నారో లేదో కూడా సమీక్ష చేస్తాం. గ్రామంలోని వనరులు ఉపయోగించి ఆదాయం పెంచే మార్గం చూపిస్తాం. ట్రైకార్ ద్వారా రుణాలు ఇస్తాం. 2014-19 మధ్య ఇచ్చినట్లుగానే ఇన్నోవా కార్లు అందిస్తాం. గతంలో 80 స్కూళ్లను రెసిడెన్సియల్ స్కూళ్లుగా మార్చాం…వాటి కోసం కొత్త భవనాలు నిర్మిస్తాం. గిరిజనుల్లోని సమరయోధుల త్యాగాలను తెలియజేసేందుకు లంబసింగిలో మ్యూజియం ఏర్పాటు చేస్తాం. గ్రామ సచివాలయాల్లో పని చేసే ఏఎన్‌ఎంలను ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో పెట్టి పిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించేలా చేస్తాం.
దేశంతో పాటు, ప్రపంచంలోని ముఖ్య నగరాల్లో అరకు కాఫీని ప్రమోట్ చేసి మరింత గుర్తింపు తీసుకొస్తాం. అరకు కాఫీ నాణ్యతను పెంపొందిస్తాం. వాణిజ్య పంటల కంటే కాఫీ పంటకు ఆదాయం అధికంగా వచ్చేలా చేస్తాం. మీరు పండిరచే ఆర్గానిక్ పంటల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పిస్తాం. తయారు చేసే వస్తువులను ఓఎన్డీసీ ప్లాట్ ఫాం ద్వారా వినియోగదారులకు నేరుగా వినియోగించేలా చేస్తాం. జీవో నంబర్ 3 నాకు బాగా గుర్తు ఉంది…నేనే తీసుకొచ్చా. విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉపఎన్నికలు ఉండటం వల్ల మాట్లాడలేకపోతున్నా…మీ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలో అదంతా చేస్తా. సీతంపేట ఐటీడీఏలో రూ.7 కోట్లతో సమగ్ర పసుపు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్ అడ్వంచర్ పార్క్ ను రూ.2.54 కోట్లతో అభివృద్ధి చేస్తాం. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాబేసు గ్రామాల మధ్య నాగావళి నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తాం.
చింతూరు ఐటీడీఏ పరిధిలో 11 ఎత్తిపోతల పథకాలను రూ.2.5 కోట్లతో నిర్మిస్తాం. పాడేరులో మెడికల్ కళాశాలను రూ.500 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేస్తాం. 418 ఏకోపాధ్యాయ పాఠశాలలకు రూ.50 కోట్లతో భవనాల నిర్మాణం పూర్తి చేస్తాం. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో ప్రధాన కేంద్రంలో మూడు ప్రధాన రహదారుల కారిడార్ ను రూ.50 కోట్లతో పూర్తి చేస్తాం. పాడేరు ఏజన్సీలో రూ.10 కోట్లతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. 2,191 గిరిజన గ్రామాలకు త్వరలో రోడ్డు మార్గాలు నిర్మిస్తాం. 16,816 గిరిజన నివాస ప్రాంతాలకు తాగునీరు లేదు, ఆ ప్రాంతాలకు కుళాయి ద్వారా నీళ్లు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీల వర్షం కురిపించారు.
భూములు దోచుకునేందుకు గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేశాం
‘ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలపడమే కాదు…నిర్దిష్ట ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. అరకు పార్లమెంట్ పరిధిలోని 5 స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించారు. మంచి పనులు జరగాలంటే ఆలోచనా విధానం కూడా మారాలి. మొన్నటి ఎన్నికల్లో సుడిగాలి వచ్చింది…ఆ సుడిగాలిలో తిరిగి రానంతగా జగన్ కొట్టుకుపోయారు. దీనికి కారణం అవినీతి, దోపిడీ, పేదల పొట్టకొట్టే పాలకులు ఉండటమే. గత ప్రభుత్వంలో ఎవరికీ న్యాయం జరిగలేదు. గిరిజనులకు రుణాలు ఇవ్వలేదు. మీ పిల్లల భవిష్యత్తు ను నిర్వీర్యం చేశారు. గిరిజనులపై దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టారు. అందుకే నిశ్వబ్ద విప్లవం వచ్చి ఎవరూ ఊహించని విధంగా 93 శాతం స్థానాలు కూటమికి వచ్చాయి. వైసీపీ పాలనలో గిరిజనులు అనేక కష్టాలు అనుభవించారు. వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసింది..వాటికి ప్రతి నెలా వడ్దీలు కట్టాలి.
అయినప్పటికీ ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించాం. ఎన్నికల ముందు చెప్పిన విధంగానే పింఛను రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచి పెద్దకొడుకుగా ఉన్నా. ఎన్నికల సమయంలో వాలంటీర్ల లేకుంటే పింఛన్లు ఇవ్వలేరని చెప్పి 35 మంది వృద్ధుల ప్రాణాలు తీశారు. కానీ మనం వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతోనే పంపిణీ చేపట్టి ఒక్కరోజులోనే 97 శాతం మందికి పింఛన్లు అందించాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ నెల 15న అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండలాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ద్వారా మీ భూములను దోచుకోవాలని చూశారు. అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.