- కొంతమంది అధికారులు ఐఏఎస్, ఐపీఎస్ ప్రతిష్ట దిగజారుస్తున్నారు
- వాలంటీర్లను వైసీపీ నేతలు బానిసల్లా చూస్తున్నారు
- జగన్ గులకరాయి డ్రామా ప్రజలకు తెలిసిపోయింది: వర్ల రామయ్య
అమరావతి (చైతన్యరథం): ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేష్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విలేకురులతో మాట్లాడుతూ…..ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఇంకా కొంతమంది అధికారులు జగన్ సేవలోనే తరిస్తున్నారన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థకు ఒకప్పుడు సమాజంలో గౌరవం ఉండేది. కానీ నేడు కొంతమంది అధికారుల వల్ల ఆ వ్యవస్థ ప్రతిష్ట దిగజారుతోంది. విద్యాశాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్.. జగన్ దగ్గర మోకాళ్లపై కూర్చుని మాట్లాడతారు. ఆయన ఎన్నికల సమయంలో విద్యార్థుల తల్లితండ్రులతో సమావేశాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని అడ్డుకుంది. మళ్లీ ఈ నెల 23న విద్యార్థుల తల్లితండ్రులతో సమావేశం నిర్వహిస్తారంట. ఈ సమయంలో విద్యార్దుల తల్లితండ్రులతో సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏంటి? విద్యార్థుల తల్లితండ్రులకు వైసీపీకి ఓటేయమని ప్రవీణ్ ప్రకాశ్ చెబుతారా? మరి లేకుంటే సమావేశం దేనికి నిర్వహిస్తున్నారని వర్ల ప్రశ్నించారు.
మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు, కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాలంటీర్లతో సమావేశం నిర్వహించి వారందరినీ రాజీనామా చేయమంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రజలకు సేవ చేసేందుకు కాకుండా పార్టీకి సేవ చేసేందుకే పెట్టారని వైసీపీ నేతలే చెబుతున్నారు. వాలంటీర్లను వైసీపీ నేతలు బానిసల్లా చూస్తున్నారు. వాలంటీర్లకు ఆత్మగౌరవం ఉండదా అని వర్ల నిలదీశారు.
జగన్ నాటకాలు జనానికి తెలిసిపోయాయి…
జగన్ గులకరాయి డ్రామా ప్రజలకు తెలిసిపోయింది, సీఎంని గులకరాయితో ఎవరైనా చంపగలరా? నాడు కోడికత్తి డ్రామా ఆడారు, నేడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. దాడి జరిగిన రోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వైసీపీ నేతలు రోడ్లపై ధర్నాలు ఎలా చేస్తారు? చట్టం, రాజ్యాంగం అంటే వైసీపీ నేతలకు గౌరవం ఉండదా? వాళ్లు ధర్నా చేస్తుంటే విజయవాడ ఏసీపీ, సీఐ కళ్లప్పగించి చూస్తున్నారు. అలాంటి అధికారులకు ఎన్నికలు సక్రమంగా నిర్వహించే సామర్థ్యం ఉందా? వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని సీఈవోను కోరాం. వీటిపై ఆయన సానులకూంగా స్పందించారు. జగన్ పై రాయి ఎవరూ విసరలేదు, గజమాలకు ఉన్న వెదురుబొంగులు తగిలి ఆయనకు గాయమైంది. కానీ ఎవరో రాయి విసిరి ఆయనపై హత్యయత్నానికి పాల్పడ్డట్టుగా సృష్టించి ప్రజల్లో సానుభూతి కోసం నాటకాలాడుతున్నారు. జగన్ డ్రామాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయి. జగన్ ఇకనైనా మాయామశ్చీంద్రుడులా వ్యవహరించడం మానుకోవాలని వర్ల రామయ్య హితవు పలికారు. ఈసీని కలిసిన వారిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, టీడీపీ నేత మన్నవ సుబ్బారావు, తదితరులు ఉన్నారు.