అమరావతి(చైతన్యరథం): వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న రాష్ట్రవాసులు ఈ నెల 13న ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. మే 13వ తేదీన పోలింగ్‌కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు లేఖ రాశారు. ఆర్టీసీ బస్సులు పెంచడం ద్వారా ప్రయాణ సౌకర్యంతో ఓటింగ్ శాతం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
లేఖలోని అంశాలు
- మే 13వ తేదీన ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు వస్తారు.
- ఇప్పటికే హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుండి ఓటు వేసేందుకు ఏపీలోని తమ ఊళ్లకు ప్రజలు ప్రయాణమవుతున్నారు.
- ఇలాంటి సమయంలో సొంత ప్రాంతానికి వెళ్లడానికి ఆర్టీసీ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.
- ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది.
- అవసరమైనన్ని బస్సులు అందుబాటులో లేక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్ స్టేషన్లలో నిరీక్షిస్తున్నారు.
- ఈ రెండుమూడు రోజులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేయాలి.
- రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం వల్ల ఓటింగ్ శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది… అని చంద్రబాబు తన లేఖలో వివరించారు.