- తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీం ఆదేశం
- సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా..: సీఎం చంద్రబాబు
ఢిల్లీ: తిరుమలలోని దేవదేవుడి లడ్డూ మహాప్రసాదానికి కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణల అంశంపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం కేసును సుదీర్ఘంగా విచారించింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సీబీఐనుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరపున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. స్వతంత్ర సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని పేర్కొంది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. ‘లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు. అయితే స్వతంత్ర విచారణ కోరుకుంటున్నారు కాబట్టి.. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణవుంటే మరింత విశ్వాసం పెరుగుతుంది’’ అని మెహతా కోర్టుకు విన్నవించారు.
వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై ఆగ్రహం
పిటిషనర్లలో ఒకరైన వైకాపా ఎంపీ, తితిదే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనపై విజిలెన్స్ విచారణ అంశాన్ని దాచిపెట్టారు. విజిలెన్స్ విభాగం నుంచి వచ్చిన నోటీసులు.. దానిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టుకు ఆయన నివేదించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఈ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని గట్టిగా సూచించింది. కోర్టులను రాజకీయ వేదికలు చేయవద్దని కూడా వ్యాఖ్యానించింది. అంతేకాదు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటుకూ ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది.
కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ.. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, భక్తుడు విక్రమ సంపత్, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై సోమవారమే విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే (సిట్) కొనసాగించాలా? లేదంటే ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా? అన్న అంశంపై కేంద్రం తరపున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. అనంతరం విచారణను గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేసింది. అయితే, గురువారమే ధర్మాసనం ముందు హాజరైన తుషార్ మెహతా.. తాను నాలుగో కోర్టులో మరో కేసు విచారణలో ఉన్నందున.. ప్రస్తుత కేసు విచారణను శుక్రవారం ఉదయం 10.30కి తీసుకోవాలని ధర్మాసనానికి విన్నవించారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ బీఆర్ గవాయి.. కల్తీ నెయ్యి వివాదం కేసును శుక్రవారం మొదటి నంబర్ కింద విచారించడానికి అంగీకరిస్తూ వాయిదా వేశారు. నేడు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఆదేశించింది.
సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: సీఎం చంద్రబాబు
తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు. ఎక్స్‌లో పోస్టు పెడుతూ.. ‘తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సీబీఐ, ఏపీ పోలీస్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం. ‘సత్యమేవ జయతే’, ‘ఓం నమో వేంకటేశాయ’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కోర్టు హెచ్చరిక జగన్‌కే వర్తిస్తుంది
న్యాయ స్థానాలను రాజకీయ వేదికలు చేయవద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు జగన్‌కే వర్తిస్తాయని దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐదేళ్లపాటు ఏపీలో హిందూత్వంపై, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినపుడు అప్పటి సీఎం జగన్ నోరు మెదపకపోవడమే కాకుండా చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. రివర్స్ టెండర్ల పేరుతో నాసిరకం నెయ్యి సరఫరా అవుతున్న విషయం అప్పటి ఈవోకి తెలిసే మౌనంగా వున్నారా? అని ప్రశ్నించారు. సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యలంటూ తిరిగి తప్పుడు ప్రచారానికి దిగడం జగన్ చేస్తోన్న పెద్ద తప్పు అని హితవు పలికారు. నాసిరకం పదార్థాలు సరఫరా చేసే సంస్థల ఎంపికలో కాసులకు కక్కుర్తిపడిన అప్పటి అధికారులను జగన్ రక్షించే ప్రయత్నం చేయడం ఇంకో తప్పని మంత్రి ఆనం హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ప్రజలకు జవాబుదారీ కనుకే.. లడ్డు కల్తీని వెలుగులోకి తెచ్చి అప్పటి జగన్ గుతేదార్లు, గంగిరెద్దుల్లా తలూపిన టీటీడీ ఈవోలు చేసిన నిర్వాకంవల్ల, టీటీడీ శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిన వైనాన్ని వెలుగులోకి తెచ్చారన్నారు. సుప్రీమ్ కోర్ట్ వేస్తున్న స్వతంత్ర సిట్ అన్ని విషయాలను వెలుగులోకి తెస్తుందని, అప్పుడు జగన్ ఏంచెబుతాడో చూడాలని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు.
సుప్రీం నిర్ణయం దర్యాప్తునకు మరింత బలం
తిరుమల మహాప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని ఐటీ మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ వేదికపై స్పందించారు. స్వతంత్ర సిట్ దర్యాప్తు చేయాలన్న సుప్రీం నిర్ణయం.. ప్రస్తుతం నడుస్తున్న దర్యాప్తును మరింత బలోపేతం చేసినట్టేనన్నారు. సిట్ దర్యాప్తులో జాతీయ ఏజెన్సీలైన సీబీఐ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలు భాగస్వాములుగా ఉండటం, దోషుల నిగ్గు తేల్చేందుకు దర్యాప్తును బలోపేతం చేసినట్టయ్యిందన్నారు. సత్యమే గెలుస్తుందని ఈ సందర్భంగా లోకేష్ తన పోస్టులో పేర్కొన్నారు.
కల్తీ జరిగిందనే నమ్ముతున్నాం: కేంద్రమంత్రి
తిరుమల లడ్డూ కల్తీపై విచారణకు సుప్రీంకోర్టు ఐదుగురితో కమిటీ వేయడం.. దోషుల నిగ్గు తేల్చేందుకేనని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు. కల్తీ జరిగిందనే నమ్ముతున్నామని, సుప్రీం వేసిన స్వతంత్ర సిట్ దర్యాప్తుతో వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. ‘జగన్ హయాంలో హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. రథం తగులబెట్టినా.. రాముడి విగ్రహం తల తొలగించినా చర్యలు లేవు. తిరుమలలోని నిబంధనలను జగనే తుంగలో తొక్కారు. దంపతులే స్వామివారికి పట్టువస్త్రాలు ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. సతీమణి లేకుండా శాస్త్రం, ధర్మానికి వ్యతిరేకంగా జగన్ ఒక్కరే పట్టువస్త్రాలు సమర్పించారు. జగన్ హయాంలో లడ్డూలో కల్తీ జరిగిందని నమ్ముతున్నాం’ అని కేంద్రమంత్రి అన్నారు.
స్వతంత్ర సిట్ శుభపరిణామం: అనిత
తిరుమల మహాప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం అంశంపై సుప్రీంకోర్టు తీర్పు శుభపరిణామమని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. సుప్రీం నిర్ణయం మేరకు జాతీయ దర్యాప్తు ఏజెన్సీలను కలిపి స్వతంత్ర సిట్ ఏర్పాటుతో వాస్తవాలన్నీ బహిర్గతమవుతాయని అన్నారు. విజిలెన్స్ విచారణ అంటే సుబ్బారెడ్డికి ఎందుకు భయం అని ప్రశ్నిస్తూనే.. తప్పు చేయనివారు భయపడరని అనిత వ్యాఖ్యానించారు.