- రేపు మీ ఇళ్లపైకి రారన్న గ్యారంటీ ఉందా?
- అప్పుడు కూడా ఇలాగే చూస్తూ ఉంటారా?
- కేడర్‌కు మనోధైర్యం కలిగించాల్సిన బాధ్యతలేదా?
అమరావతి: విజయవాడలో పార్టీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై వైసిపి ముష్కరమూకలు దాడిచేస్తే సీనియర్ నేతలంతా నిర్లక్ష్యం వహించారు..ఈరోజు గాంధీకి జరిగిందే రేపు మీకు జరగొచ్చు.. ఇలా ఉంటే రేపు మీకోసం ఎవరైనా వస్తారా.. ఏమిటీ నిర్లక్ష్యం? పార్టీ కేడర్ కు మనోధైర్యం కలిగించాల్సిన బాధ్యత సీనియర్ నేతలుగా మీపై లేదా అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, పార్లమెంటు పార్టీ అధ్యక్షులతో చంద్రబాబునాయుడు బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాల యంలో సమావేశం నిర్వహించారు. చెన్నుపాటి గాంధీ పై దాడి ఘటనపై నేతలు సరిగా స్పందించలేదని చంద్ర బాబునాయుడు తీవ్రఅసంతృప్తి,ఆగ్రహం వ్యక్తం చేశారు.. సంఘటన జరిగిన వెంటనే నేతలంతా ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఇటీవల గుడివాడలో మాజీమంత్రి కొడాలి నాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినపుడు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారని అన్నారు. పలు ఘటనల్లో జిల్లా నేతల నుంచి తగినంత స్పందన ఉండటం లేదన్నారు. తాజా పరిస్థితులను గమనిస్తే నాయకుల మధ్య సమన్వయం లోపించినట్లుగా కన్పి స్తోందని అన్నారు. భవిష్యత్తులో పద్ధతి మార్చుకోకుండా ఇలాగే ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విదేశాల్లో ఉన్నందున దేవినేని ఉమ, డిల్లీలో ఉండ టంతో ఎంపి కేశినేని నాని, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఈ సమవేశానికి హాజరుకాలేక పోయారు.