కాకినాడ (చైతన్యరథం): దళితుడిని హత్య చేసిన వ్యక్తికి జగన్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ, అఖిలపక్ష నేతలు విరుచుకుపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొంటున్న సమావేశాల్లో కూడా అనంతబాబుకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులపై కాకినాడలో తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. హంతకుడు అనంతబాబుపై దళితా గ్రహభేరి పేరిట నిర్వహించిన సమావేశంలో వివిధ రాజ కీయ పక్షాలు, దళిత నేతలు పాల్గొన్నారు. దళిత డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుపై చర్యలులేవని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. తొలుత జగన్ డైరెక్షన్లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారని.. టీడీపీ ఆందోళన చేయడం మొదలు పెట్టాక అనంతబాబును విచారించారని గుర్తు చేశారు. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు ఒక్కరే కాదని..ఇంకా ఎంతమంది ఉన్నారో వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దారుణంగా చంపి సాక్షాధారాలు లేకుండా చేశారని ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తికి బెయిలుపై అభ్యంతరాలు చెప్పకుండా ప్రభుత్వం పూర్తిగా సహ కరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతబాబు అకృత్యాలు రంపచోడవరం నియోజకవర్గంలో తాను స్వయంగా చూశానన్నారు. మన్యంలో గంజాయి సరఫరాకు అనంతబాబు ప్రధాన సూత్రధారి అని దుయ్యబట్టారు. దళితుడ్ని హత్య చేసిన వ్యక్తికి రెడ్ కార్పెట్ ఎవరైనా వేస్తారా? అని ప్రశ్నించారు. అంతే కాకుండా సీఎం నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి అనంతబాబు హాజరయ్యారంటే ఈ ప్రభుత్వం హంతకుల పట్ల ఎలా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మాట్లాడితే దళితుల మేనమామ అని చెప్పుకునే జగన్..అదే దళితుడిని చంపిన హంతకుడు అనంతబాబుతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు.