- హైకోర్టు వ్యాఖ్యలతో జగన్ రెడ్డి మైండ్ బ్లాక్
- దొంగ ఓట్లపై టీడీపీ ఢిల్లీ స్థాయిలో పోరాటం
- ఈ అంశాలనుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే సజ్జల అబద్ధాల ప్రెస్ మీట్
అమరావతి(చైతన్యరథం): టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి వస్తున్న స్పందనతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందనే భయంతో వైసీపీ నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ, ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి అసత్య ఆరోపణలపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసిందని, విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం సహజంగా జరుగుతున్నదనేనన్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ధిక్కరించేలా, దురుద్దేశాలు ఆపాదించే విధంగా మాట్లాడటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని, చంద్రబాబు బెయిల్‌ని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. టీడీపీపై సజ్జల లేనిపోని అభాండాలు వేస్తున్నారన్నారని మంగళవారం ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని సజ్జల బాధపడుతున్నారా లేక వారు చేసే దొంగ పనులకు భంగం కలుగుతోందని బాధపడుతున్నారా అని ప్రశ్నించారు. రకరకాల యాప్‌ల ద్వారా సమాచారాన్ని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ సేకరిస్తున్న విషయం వాస్తవం కాదా అని అడిగారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్లతో గడపగడపకు వెళ్లి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నది వాస్తవం కాదా?
చివరికి అక్రమ సంబంధాలు ఉన్నాయా అని కూడా వివరాలు సేకరించడం ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసే కుట్రతో కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైసీపీ వ్యక్తిగత సమాచార సేకరణ ద్వారా రాష్ట్రంలో మహిళల అదృశ్యం కేసులు పెరిగిపోయాయని అన్నారు. ఒకే డోర్ నెంబర్‌తో పదులు, వందల సంఖ్యలో ఓట్లు నమోదు చేసుకుంటున్న నీచమైన చరిత్ర జగన్ రెడ్డిది. దొంగ ఓట్లలో జగన్ రెడ్డి పీహెచ్‌డీ సాధించాడు. దొంగ ఓట్లతో తిరుపతి, కుప్పం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన జగన్ రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే పద్ధతిని అవలంబించేందుకు ప్రయత్నిస్తున్నారు. గడపగడపకూ అంటూ జగన్ రెడ్డి ముఠా ఇళ్లకు వెళ్తే.. ప్రజలు చీపుర్లతో చీత్కరించారు..కానీ, అదే సమయంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్న టీడీపీ నేతలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు.
టీడీపీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే..
జగన్ రెడ్డి పాలనలో ప్రజలపై పడుతున్న భారాలను, సామాజిక భద్రత కరువైన వైనాన్ని ప్రజలకు బాబు ష్యూరిటీ`భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే డేటా చౌర్యం అంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారానికి తెరలేపారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడం లేదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరిస్తోంది. ఓటు ఉందో లేదో పరిశీలించుకోమని తెలుగుదేశం పార్టీ ప్రజల్ని అప్రమత్తం చేస్తుంటే.. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని తొలగిస్తున్న వైసీపీ నేతలు ప్రజల హక్కులను దిగమింగుతున్న విషయం వాస్తవం కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
120 సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి రద్దు చేయటం వాస్తవం కాదా?
తెలుగుదేశం పార్టీ చేపట్టే ఓటర్ వెరిఫికేషన్‌పై ఎందుకు అంతలా ఉలిక్కి పడుతున్నారు. మీరు నమోదు చేయించిన దొంగ ఓట్ల బాగోతం బయటపడుతుందనా అని ప్రశ్నించారు. అందుకే ఇటువంటి చర్యలపై ప్రజల్ని అప్రమత్తం చేసేందుకే ఓటర్ జాబితాను పరిశీస్తున్నామని, డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టో వెబ్‌సైట్ నుండి తొలగించామని చెప్పడం పచ్చి అబద్ధం. ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో మేనిఫెస్టో ఉంది. కళ్లుండి చూడలేని వైసీపీ నేతలకు అది కనబడదు అని అర్ధమవుతోంది. 2014-19 మధ్య తెలుగుదేశం అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయంలో ఇచ్చిన హామీల కంటే అధికంగా అమలు చేసింది. తెలుగుదేశం అమలు చేసిన 120 సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి రద్దు చేయడం వాస్తవం కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
మేనిఫెస్టోలో జగన్‌రెడ్డి అమలుచేసింది 15 శాతమే
2019 ఎన్నికల్లో ఇచ్చిన వైసీపీ మేనిఫెస్టోలో జగన్ రెడ్డి అమలు చేసింది 15 శాతమే. ఎగనామం పెట్టింది, మాట తప్పింది, మడమ తిప్పింది 85 శాతం. నవరత్నాలు నవమోసాలయ్యాయి. మద్యనిషేధం, ప్రత్యేక హోదా, జాబ్ క్యాలెండర్, సీపీఎస్ రద్దు, పెన్షన్ల పెంపు వంటి ప్రతి హామీపైనా మాట తప్పి మడమ తిప్పి ప్రజల్ని దగా చేయడం వాస్తవం కాదా. బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పి, మద్య నిషేధం హామీ అమలు చేయకుండా పవిత్ర గ్రంథాలకు అపచారం చేశాడు. మద్యం ఆదాయాన్ని 15 ఏళ్లు తాకట్టు పెట్టి రూ.38 వేల కోట్లు అప్పు తెచ్చి, మహిళల మాంగల్యాలు తెంపుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక, ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందో చెప్పడం నేరమా? మేం చెప్పేది చేస్తాం.. చేసేదే చెప్తాం అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.