- సామాజిక సాధికార బస్సుయాత్ర దళితవాడల్లో చేసే దమ్ముందా జగన్?
- దళిత న్యాయవాది విజయ్ కుమార్ కు న్యాయం చేయాలి
- డాక్టర్ సుధాకర్ ని చంపినప్పుడే దళితుల్లో జగన్ జీరో అయ్యారు
అమరావతి: వై ఏపీ నీడ్స్ జగన్ అని వైసీపీ నాయకులు అంటుంటే..ఏపీ దళితులు మాత్రం వియ్ హేట్ జగన్ అని నినదిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ దళితులకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయంపై ధ్వజమెత్తారు. నంద్యాలజిల్లా, కొలిమిగుండ్లలో దళిత న్యాయవాది మంద విజయ్ కుమార్, ఆయన తల్లిపై వైసీపీ గూండాలు, రౌడీలు చేసిన దాడిని రామయ్య తీవ్రంగా ఖండిరచారు. దళితులు నా మేనమామలు అంటున్న జగన్ దళితులపై గత నాలుగున్నరేళ్లుగా జరుగుతున్న అఘాయిత్యాల్లో ఒక్క ఘటనపై కూడా స్పందించకపోవడం దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి కపటప్రేమ చూపుతున్నారని దళితులందరికీ అర్ధమైంది. జగన్ ను దళితులంతా అసహ్యించుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి మరోసారి ముఖ్యమంత్రి కావాలని దళితులు ఎలా కోరుకుంటారో జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తమ ఓట్లతో సీఎం అయ్యాక తమపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా పట్టనట్టు జగన్ వ్యవహరిస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి దళితుల్లో స్థానం లేదని, దళితులు తమతో ఉన్నారని పగటి కలలు కనడం హాస్యాస్పదమేనని వర్ల అన్నారు.
దళితవాడల్లో బస్సుయాత్ర చేయగలరా..
వైసీపీ చేస్తున్న సామాజిక సాధికార బస్సుయాత్ర దళితవాడల్లో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో మాత్రమే చేస్తున్నారని వర్ల అన్నారు. దళితులకు తామేమి చేశామో చెప్పే దమ్ములేకే దళితులకు ముఖం చూపించలేక మంత్రులు తప్పించుకుని బస్సుల్లో తిరుగుతున్నారని స్పష్టం చేశారు. దళితులకు వైసీపీ ప్రభుత్వం న్యాయం చేస్తే దళితవాడల్లో బస్సుయాత్ర చేయాలని వర్ల సవాల్ విసిరారు. దళితవాడల్లో బస్సుయాత్ర చేస్తే వైసీపీ మంత్రులను దళితులు తరిమికొట్టడం ఖాయం అన్నారు.
వైసీపీలో ఉపముఖ్యమంత్రికి విలువ ఉందా..
వైసీపీ ప్రభుత్వంలో దళిత ఉపముఖ్యమంత్రికి, మంత్రులకు గౌరవం ఉందా అని రామయ్య నిలదీశారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన మంత్రులు కుర్చీల్లో కూర్చుంటే దళిత ఉపముఖ్యమంత్రి మాత్రం చేతులు కట్టుకుని నిలబడాల్సిన దుస్థితి, కుల దురహంకారం వైసీపీలో ఉందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చుని దళిత మంత్రి విశ్వరూప్ ను మోకాళ్లపై కూర్చోబెట్టి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉపముఖ్యమంత్రి సైతం దళితుల ఆత్మగౌరవాన్ని జగన్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టి అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్ సుధాకర్ ని చంపినప్పుడే దళితుల్లో జగన్ జీరో అయ్యారు
మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపినప్పుడే దళితుల్లో జగన్మోహన్ రెడ్డి జీరో అయ్యాడని వర్ల రామయ్య గుర్తు చేశారు. ఆ తర్వాత దళిత మహిళపై పోలీస్ స్టేషన్ వెనుక 3రోజులు అత్యాచారం చేసి స్టేషన్ ముందు పడేసిన ఘటన, ఇసుక అక్రమ రవాణాపై నిలదీసిన వరప్రసాద్ కు పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేయించిన ఘటన, చీరాలలో కిరణ్ ను కొట్టి చంపిన ఘటన, కల్తీ మద్యంపై నిలదీసిన ఓం ప్రతాప్ ను చంపేసిన ఘటన, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసి డోర్ డెలివరీ చేసిన ఘటనలతో దళితులంతా జగన్మోహన్ రెడ్డిని ఛీ కొడుతున్నారని అన్నారు. దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, చేతులకు బేడీలు వేసి దళితులను జగన్ అవమానించారని తెలిపారు. దళితులను హింసించిన కేసుల్లో ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క కేసులో అయినా చార్జిషీటు వేశారా అని జగన్ ను నిలదీశారు. దళితులను చంపుతున్నందుకు జగన్మోహన్ రెడ్డి మరోసారి కావాలి అని దళితులు ఎవరైనా కోరుకుంటారా అని వర్ల ప్రశ్నించారు.
దళితులకు చంద్రబాబు ఏం చేశారో జూపూడి చెబుతాడు
దళితులకు గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏం చేశారో తన చంకలో ఉన్న జూపూడి ప్రభాకర్ ని జగన్ అడిగితే పూర్తి వివరాలు చెబుతాడని వర్ల అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని వేల మందికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించారు? ఎన్ని ఇన్నోవాలు ఇచ్చారు? భూమి కొనుగోలు పథకం ద్వారా ఎన్ని ఎకరాలు దళితులకు ఇచ్చారు? అనే అంశాలను జూపూడి ని అడిగి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. అలాగే వైసీపీ పాలనలో దళితులకు ఏం చేశారో కూడా జూపూడిని అడిగితే ఏమీ చేయలేదని కూడా చెబుతాడన్నారు. వైసీపీ పాలనలో మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడంతో పాటు ఎస్సీ సబ్ ప్లాన్ నినధులు రూ.33వేల కోట్లు దారిమళ్ళించారని విమర్శించారు. అంబేద్కర్ విదేశీవిద్య పథకంలో అంబేద్కర్ పేరు తీసేసి జగనన్న అనే పేరు పెట్టుకుని దళితులను జగన్ అవమానించారని తెలిపారు. జగన్ పాలనలో దళితుల నుండి 14లక్షల ఎకరాల అసైన్డ్ భూములను వైసీపీ వాళ్లు లాక్కున్నారని తెలిపారు. ఈ ఘటనలపై విచారణ చేసే దమ్ము నీకు ఉందా? అని జగన్ ను వర్ల సూటిగా ప్రశ్నించారు. భూమి కొనుగోలు పథకంలో జూపూడి విచారణ ఎదుర్కొంటున్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక జూపూడిని జైలుకు పంపడం తప్పదన్నారు.
వైసీపీ పాంప్లెట్ కలర్ ఫుల్, సబ్జెక్ట్ నిల్..
వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో రూ.40కోట్లు ఖర్చుపెట్టి జగన్మోహన్ రెడ్డి రంగురంగుల పాంప్లెట్లు వేశారని వర్ల అన్నారు. ఈ పాంప్లెట్లలో దళితులకు ఏం చేశారో చెప్పే సబ్జెక్ట్ మాత్రం ఏమీ లేదని ఎద్దేవా చేశారు? దళితులకు జరిగిన అన్యాయం, వాటిపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఒక్క అంశం కూడా పాంప్లెట్ లో పేర్కొనకపోవడం డొల్లతనానికి నిదర్శనమని విమర్శించారు. దళితులకు సంబంధించిన సంక్షేమ పథకాల రద్దుకు సంబంధించిన అంశాలేవీ పాంప్లెట్ లో ఎందుకు పేర్కొనలేదో ఏపీ దళితులకు సమాధానం చెప్పే దమ్ముందా అని జగన్ కు వర్ల సవాల్ విసిరారు.