అమరావతి: ప్రస్తుతం ఏ-2 విజయసాయి రెడ్డి పరిస్థితి శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డ మాదిరిగా ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) క్రమశిక్షణా చర్యలకు సిద్ధపడితే విజయసాయిరెడ్డి ఎందుకు తేలుకుట్టిన దొంగలా దాక్కుంటున్నాడని మంగళవారం ఒక ప్రకటనలో బొండా ప్రశ్నించారు. ప్రతి రోజూ, ప్రతి పూటా ట్విట్టర్లో రెట్టలు వేస్తూ చంకలు గుద్దుకునే విజయసాయి అక్టోబర్ 23న ఐసీఏఐ జారీ చేసిన నోటీసులపై ఎందుకు నోరు మెదపటం లేదు. గతంలో అరబిందో, హెటిరో, రాంకీ, దాల్మియా సిమెంట్స్‌తో క్విడ్ ప్రో కో ద్వారా జగన్‌రెడ్డికి చెందిన జగతి సంస్థలోకి వేల కోట్ల రూపాయల ముడుపులు మళ్లించి జైల్లో కూర్చున్నావు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా చేసిన ఉల్లంఘనల నుండి ఎంతగా దారి మళ్లించే ప్రయత్నం చేసినా..విజయసాయిరెడ్డి బండారం మొత్తం ఐసీఏఐ డిసిప్లినరీ డైరెక్టరేట్ బట్టబయలు చేసింది. వీటితో పాటు జగతి పబ్లికేషన్స్ విలువ మదింపుపై డెల్లాయిట్ ఇచ్చిన నివేదికలోనూ నీ చేతివాటం బయటపెట్టింది. మరోవైపు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వ్యాపారాలు చేసుకోవాలంటే జగతిలో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టాలని జయలక్ష్మి టెక్స్టైల్స్ అధినేత కన్నన్‌పై, ఎన్నారై మాదవ్ రామచంద్రపై తెచ్చిన ఒత్తిడులపైనా నీ ప్రమేయం గురించి ప్రస్తావించింది. చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉంటూ ఆ వృత్తికి అన్యాయం చేశావు. పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఆ హోదాను దుర్వినియోగం చేస్తున్నావు. అయినా ఇంకా నీతులు వల్లించడం, సుద్దులు చెప్పడం ఏదైతే ఉందో అని న:భూతో న: భవష్యతి. ప్రతి విషయంపైనా ట్విట్టర్లో రెట్టలు వేసే విజయసాయిరెడ్డి.. ఈ వ్యవహారంపై కూడా స్పందించాలి. కోర్టుల్లో స్టేలు తెచ్చుకోకుండా, విచారణకు హాజరై నిజాయితీ నిరూపించుకోవాలని బొండా సవాల్ చేశారు.