ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రతిపక్షంలోనైనా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా? అంటే అదీ లేదు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం మీద అబద్ధాల సాక్షిలో విషం చిమ్మడం వినా జగన్‌రెడ్డికి మరో పనిలేకుండా పోయిందన్నది కళ్లముందు కనిపిస్తున్న వాస్తవం. గడచిన ఐదేళ్లలో వైద్యరంగాన్ని సర్వనాశనం చేసింది జగన్‌రెడ్డే. సమాజానికి అత్యంత ప్రాధాన్యమైన వైద్య విద్య ప్రమాణాలను నాశిరకానికి దిగజార్చిన చరిత్ర అతనిది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చానంటూ అరచేతిలో వైకుంఠం చూపించి.. వాటి నిర్మాణాలను గాలికొదిలేశాడు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ మోసపూరిత మాటలు చెబుతూ ఆచరణలో వారందరికీ వైద్య విద్యను దూరం చేశాడు. కొత్త మెడికల్ కాలేజీలు వస్తే డాక్టర్ కల నెరవేరుతుందనుకున్న బడుగు, బలహీనవర్గాల ఆశలను చిదిమేశాడు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సర్కారీ కాలేజీల్లో మెడికల్ సీట్లను అమ్మకానికి పెట్టి ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలకు తేడా లేకుండా చేసిన ఘనతా జగన్‌రెడ్డే దక్కించుకున్నాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను కన్వీనర్ కోటాలోనే ఇన్నాళ్లూ భర్తీ చేస్తూ వచ్చారు. మెరిట్ ఆధారంగానే విద్యార్థులు ఆయా కాలేజీల్లో సీట్లు పొందేవారు. కానీ జగన్‌రెడ్డి ధనదాహంతో పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేశాడు. వైద్య విద్యను అంగట్లో సరుకులా అమ్ముకున్నాడు. చేసిందంతా చేసి ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంపై నెపం నెట్టడం జగన్ భ్రష్ట రాజకీయానికి పరాకాష్ట. జగన్‌రెడ్డి నాశనం చేసిన విద్యారంగాన్ని, మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే.. అబద్ధపు ప్రచారాలు, బూటకపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేయడం జగన్‌రెడ్డికి బడుగుల వైద్య విద్యపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే ఏపీకి రెండు మెడకిల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేసిన విషయం జగన్‌రెడ్డికి కనిపించడంలేదా?
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేటు భాస్వామ్యంలో నిర్వహించేందుకు గుజరాత్ మోడల్‌ను అధ్యయనం చేయమని కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచిస్తే.. అదేదో నేరమన్నట్టు జగన్మోహన్‌రెడ్డి హడావుడి చేస్తున్నాడు. అలాగే తాను ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చానని, చంద్రబాబు మాత్రం మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం కాకుండా అడ్డుపడుతున్నారని, ప్రయివేట్‌కు కట్టబెట్టేందుకు సిద్ధపడ్డారని సాక్షిలో తప్పుడు వార్తలు వండుతున్నారు. 2023-24లో అనుమతి పొందిన విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు అయిష్టంగానే ఓకే చెప్పిన జాతీయ వైద్యమండలి.. ఈసారి ప్రవేశాలను తిరస్కరించింది. పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల్లో కళాశాలల నిర్మాణాలను పరిశీలించిన బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. మెడికల్ కాలేజీలు తెచ్చేస్తున్నామంటూ జగన్‌రెడ్డి ప్రచారార్భాటమైతే చేశారు కానీ కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. వైద్య సిబ్బంది నియామకాలపై దృష్టి పెట్టలేదు. కాంట్రాక్టర్లకు రూ.200 కోట్లకు పైగా బకాయిలు పెట్టడంతో వారు మధ్యలోనే నిర్మాణాలు వదిలి వెళ్లిపోయారు. ఈ వైఫల్యాలు బయటపడకుండా ఎన్డీయే ప్రభుత్వంపై ఎదురు నెపం నెట్టేందుకు యత్నించడం జగన్‌రెడ్డి కుటిల రాజకీయాన్ని తేటతెల్లం చేస్తోంది.
వైద్య విద్యకు పట్టంగట్టిన ఎన్టీఆర్, చంద్రబాబు
అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో 1986లో విజయవాడకు హెల్త్ యూనివర్సిటీ తెచ్చారు. అలాగే అమెరికా నుంచి ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావును స్వదేశానికి రప్పించి హైదరాబాద్ నిమ్స్‌కు డైరెక్టర్‌ను చేసి ఆ ఆస్పత్రిని తీర్చిదిద్దారు. జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 22 మెడికల్ కాలేజీలతోపాటు కేంద్రంతో మాట్లాడి మంగళిగిరిలో ఎయిమ్స్, తిరుపతిలో బర్డ్ ఆస్పత్రి, టాటా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ తెచ్చిన ఘనత చంద్రన్నదే. 2015లో కేంద్రంనుంచి చంద్రబాబు ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చి మంగళగిరిలో 197 ఎకరాల భూమి కేటాయించారు. చంద్రబాబు ముందుచూపుతో తీసుకొచ్చిన ఎయిమ్స్‌కు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. కానీ జగన్‌రెడ్డి అదే ఎయిమ్స్‌కు గుక్కెడు నీరివ్వకపోగా, ఆస్పత్రి రహదారి నిర్మాణం పూర్తికాకుండా ఆటంకాలు సృష్టించాడు. ఇప్పుడేమో మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరమంటూ దుష్ప్రచారం చేస్తున్నాడు. జగన్‌రెడ్డి భ్రష్టుపట్టించిన వైద్యరంగాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు పేదలకు మెరుగైన ఉచితవైద్యాన్ని అందిస్తూ మరోవైపు బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు డాక్టర్ కల నిజం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం అభినందనీయం.
`భారతి సూరపనేని