- త్వరలో సమగ్ర సర్వేకు ముఖ్యమంత్రి ఆదేశాలు
- ఆక్రమణల తొలగింపునకు చట్టప్రకారం చర్యలు
- కాలువల ఆధునికీకరణ ప్రతిపాదనలపై ఇప్పటికే ఆదేశాలు
- రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడి
విజయవాడ(చైతన్యరథం): గత రెండు శతాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు, కృష్ణానదికి పోటెత్తిన వరద, బుడమేరుకు పడిన గండ్లు.. వీటి కారణంగా విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని.. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలో ఇరిగేషన్ కాలువల సమగ్ర సర్వేను చేపట్టనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. విజయవాడ వరదల నేపథ్యంలో కాలువలు, డ్రైన్ల ప్రక్షాళనకు పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. అదేవిధంగా కాలువలు, డ్రెయిన్ల ఆధునికీకరణకు చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించామని తెలిపారు. ఆక్రమణల తొలగింపునకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. తగిన చర్యలు తీసుకునేందుకు ఇప్పుడున్న చట్టం సరిపోతుందని..అవసరమైతే కొత్త చట్టం చేసేందుకు సిద్ధమన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాలను పత్యేక బృందాలు అంచనా వేస్తున్నాయని.. అవసరమైతే మరిన్ని బృందాలను పెట్టి త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఒకవేళ ఎవరైనా ఇళ్ల వద్ద లేకపోతే వారు తిరిగి వచ్చిన తర్వాత ఎన్యూమరేషన్ చేస్తారన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని మంత్రి నారాయణ తెలిపారు.
ఎన్నడూ లేని వరద
పది రోజుల క్రితం విజయవాడ, పరిసర గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. నగరంలోని 64 డివిజన్ల లో 32 డివిజన్లు ముంపునకు గురయ్యాయి. కొన్ని డివిజన్లలో 10 అడుగులు, 8 అడుగులు, ఆరడుగులు, నాలుగు అడుగుల వరకు నీళ్లు వచ్చాయి. 200 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత వర్షం రావడం, కృష్ణానదికి 11.43 లక్షల క్యూ సెక్కుల నీళ్లు రావడం, బుడమేరు గండ్ల ద్వారా వచ్చిన నీళ్లతో నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ కార్యాలయంలోనే ఉండి సహాయక చర్యలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సహాయక చర్యల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేశారు. సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాన్ని పర్యటించినప్పుడు ప్రజలు ఇబ్బందులను గమనించి నగరం మళ్లీ సాధారణ స్థితికి చేరేవరకు విజయవాడ కలెక్టరేట్లోనే ఉంటానని చెప్పి.. రాత్రింబవళ్లు పనిచేశారు. 32 డివిజన్లలో ఇప్పటికే 26 డివిజన్లు ముంపు నుంచి పూర్తిగా బయటపడ్డాయి. ఇంకా ఆరు డివిజన్లలో కొంతమేర నీళ్లు ఉన్నాయి. ఈ డివిజన్లలో బుధవారం ఉదయం కల్లా నీళ్లు పూర్తిగా పోయేలా అధికారులు, సిబ్బంది స్పెషల్ డ్రైవ్ కింద కృషి చేస్తున్నారని మంత్రి నారాయణ చెప్పారు.
10 వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 7,500 మంది శానిటేషన్ వర్కర్స్, నగరంలో 3,000 మంది మొత్తం కలిపి 10,000 మంది పారిశుద్ద్యం మెరుగుపర్చేందుకు రేయింబవళ్ళు పనిచేస్తున్నారు. అంత వరద నీరు వచ్చినా ప్రభుత్వం ప్రత్యేక చర్యలతో నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగింది. రోజుకు 12 లక్షల ఆహార ప్యాకెట్లు బాధితులకు అందించాం. ఒక్కో రోజు 8 లక్షలు, ఇంకో రోజు 6 లక్షలు, సోమవారం కూడా 3 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ అందించాం. మొదట్లో 30 లక్షల వాటర్ బాటిళ్ళు, ఇంకో రోజు 26 లక్షలు, 20 లక్షలు, సోమవారం 10 లక్షలు అందించాం. బిస్కెట్ ప్యాకెట్స్ మొదట్లో 12 లక్షలు, 10 లక్షలు, 8 లక్షలు, సోమవారం 3 లక్షలు అందించాం. విద్యుత్తు, మంచినీటి సరఫరాను పునరుద్ధరించాం. సోమవారం ఇచ్చిన వాటర్ కనెక్షన్లకు సంబంధించి మాత్రం ఈ నెల 12వ తేదీ వరకు ఆ నీటిని తాగడానికి, వంటకు ఉపయోగించవద్దని మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యమంత్రి ఐవీఆర్‌ఎస్ ద్వారా, ఫిజికల్ మార్గాల ద్వారా, స్వయంగా సమాచారం తెప్పించుకుని, సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించేలా క్షేత్రస్థాయిలో అధికారులకు, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తున్నారని మంత్రి నారాయణ చెప్పారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటన
నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగూరు నారాయణ మంగళవారం పర్యటించారు. కుందావారి కండ్రిక, నున్న నూజివీడు రోడ్డులో ఇప్పటికీ వరద ప్రవాహం కొనసాగుతోంది. రోడ్లు, ఇళ్ల మధ్య ఉన్న నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించే పనులను మంత్రి పరిశీలించారు. పొక్లెయిన్లు, భారీ యంత్రాలతో వరద నీటి తరలింపునకు చేపట్టిన పనులను మంత్రి దగ్గరుండి పర్యవేక్షించారు. కండ్రిక చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నీరు నిల్వ ఉందని, సాయంత్రంలోపు పూర్తిగా బయటకు తరలించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడిరచారు. సోమవారం రాత్రి నుంచి తనతోపాటు అధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారని చెప్పారు. సాయంత్రానికి వరద పూర్తిగా తగ్గుతుందన్నారు. అనంతరం పారిశుద్ధ్య పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే వరద నష్టంపై అంచనాలను రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందని.. దీనిపై నివేదిక సిద్ధం కాగానే ఎవరెవరికి ఎంత పరిహారం ఇవ్వాలనే దానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇప్పటివరకూ 1.75 లక్షల మందికి నిత్యావసర సరకులు అందించామని మంత్రి తెలిపారు.