- ఇకపై సచివాలయాల్లోనూ బుకింగ్ సదుపాయం
- రవాణా ఛార్జీలూ అక్కడే చెల్లించొచ్చు
- ఇసుక అక్రమాలపై సీబీసీఐడీ దర్యాప్తు చేయిస్తాం
- కలెక్టర్ల సదస్సులో సీపం చంద్రబాబు వెల్లడి
అమరావతి (చైతన్య రథం): ఇసుక కావాల్సిన వినియోగదారులు తమ ప్రాంతంలోని సచివాలయంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో గనుల శాఖ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. ఇసుక ప్రకృతి ప్రసాదించిన సహజ వనరు. అది సామాన్యుడి హక్కు. దాన్ని ఎవరికి వారు ఇష్టానుసారం దోచుకోవడాన్ని ప్రభుత్వం సహించదు. సామాన్యులందరికీ ఇసుక ఉచితంగా లభించేలా పూర్తి పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
రీచ్‌నుంచి ట్రక్కులో ఇసుక వినియోగదారుడి ఇంటికి చేరిన తరువాత, వినియోగదారుడు తనకు ఇసుక చేరిందని చెప్పిన తరువాతే ఆ రవాణా ఖర్చులు ట్రక్కు యజమానికి విడుదలయ్యే విధానం తెస్తామన్నారు. ఇసుక తీసుకెళ్లడానికి ఉపయోగించే ట్రక్కులన్నీ ప్రీపెయిడ్ టాక్సీల తరహాలో ఊబరైజేషన్ చేస్తామన్నారు. రేట్లు కూడా నిర్ణీత పద్ధతిలో ఉండేలా చూస్తామన్నారు. పేదలకు, సామాన్యులకు చెందాల్సిన ఇసుక పక్కదారి పట్టించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇసుకలో ఉదాసీనంగా వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని అధికారులకు సూచించారు.
తప్పుచేసినోళ్లు తప్పించుకోలేరు
గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు యథేచ్ఛగా జరిగాయని చివరకు సుప్రీం కోర్టుకు చెప్పినా సరే భయపడని స్థితికి వచ్చారన్నారు. తప్పు చేసినవాళ్లు ఎవరూ తప్పించుకోలేరని, టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తామని సీఎం హెచ్చరించారు. అధికారులు కూడా సుప్రీం కోర్టు అడిగిన దానికి ఎలాంటి దాపరికాలు లేకుండా నిష్పక్షపాతంగా నిజాలు తెలియజేయాలని సూచించారు. ఇసుక అక్రమాలపై సీబీసీఐడీ దర్యాప్తు చేయిస్తామన్నారు. ఖనిజ సంపద ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరు అని, అందులో అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఉచిత ఇసుకకు విస్తృత ప్రచారం
రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో గనుల శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ పలు సూచనలు చేశారు. ఇసుక తవ్వకాలు ప్రభుత్వానికి సవాల్‌గా మారిందంటూనే, ఉచిత విధాన నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇసుక రవాణకు అవుతున్న అదనపు ఖర్చు నామమాత్రమేనన్నారు. ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, స్టాక్ యార్డుల్లో దాదాపు 33 లక్షల టన్నుల ఇసుక లభ్యత ఉందన్నారు. ఇసుక కోసం వస్తున్నవారి వాస్తవ అవసరాలనూ ఆరా తీయాలని సూచించారు.
గత నాలుగేళ్లలో అక్రమ తవ్వకాలు
గడచిన నాలుగేళ్లలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్చగా సాగాయని ముఖేష్‌కుమార్ మీనా అన్నారు. చివరకు తవ్వకాల విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టుకూ తప్పుడు నివేదికలిచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని, ఇటీవలే ఒక అధికారిని సస్పెండ్ చేశామన్నారు. కలెక్టర్లు కూడా ఇసుక అక్రమాలపై దృష్టిసారించి అక్రమ కఠినంగా వ్యవహరించాలన్నారు. ఏఏ ప్రాంతాల్లో ఖనిజాల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనేది గుర్తించామని, దాని ప్రకారం సత్వర చర్యలకు ఉపక్రమించాలని ముఖేష్‌కుమార్ మీనా అధికారులకు సూచించారు.