కర్నూలు (చైతన్య రథం): పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా రెండు నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సాయం అందిస్తానని మాటిచ్చారు. మరుసటి రోజుకే ఇచ్చిన హామీని పూర్తి చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పుచ్చకాయలమడ గ్రామానికి చెందిన తలారి గంగమ్మ కుమారుడు అశోక్ కుమార్‌కు ఎలక్ట్రికల్ ఆటో అందింది. కవిత భర్త వైద్యం ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పేదల కష్టాలు నేరుగా చూసి అండగా ఉండడానికే ‘పేదల సేవలో’ కార్యక్రమం తెచ్చినట్టు మంగళవారం పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ప్రకటించడం తెలిసిందే. పింఛన్ల పంపిణీలో భాగంగా మంగళవారం పుచ్చకాయలమడ గ్రామంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు. తలారి గంగమ్మ ఇంటికి వెళ్లిన సందర్భంలో చిన్న కుమారుడు అశోక్ పదో తరగతి చదివి అద్దె ఆటో నడుపుతున్నాడని, ఎలక్ట్రికల్ ఆటో కావాలని గంగమ్మ ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి స్పందించి రేపే ఎలక్ట్రికల్ ఆటో అందచేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాను ఆదేశించారు.
అదే గ్రామానికి చెందిన కవిత తన భర్త రాముడుకి కర్నూలు నగరంలోని అమీలియో ఆసుపత్రిలో నరాలవ్యాధికి సంబంధించి ఆపరేషన్ చేస్తున్నారని ఆర్థికంగా సాయం చేయాలని సీఎంను కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు.. కవిత భర్త వైద్య సేవల నిమిత్తం లక్ష రూపాయల చెక్కును ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు బుధవారం కలెక్టరేట్లో అశోక్‌కుమార్‌కు రూ.3.8 లక్షల విలువ కలిగిన ఎలక్ట్రికల్ ఆటోను, కవితకు లక్ష రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే శ్యాంబాబు, జిల్లా కలెక్టర్ బాషాకు అశోక్. కవిత కృతజ్ఞతలు తెలిపారు.
గంటల వ్యవధిలో ఎలక్ట్రిక్ ఆటో సమకూర్చడం నమ్మలేకపోతున్నానని అశోక్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఆటో పంపించడం మాటల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతోందని అశోక్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు రుణం తీర్చుకోలేమని.. తన కష్టాన్ని తీర్చి ముఖ్యమంత్రి తన కుటుంబాన్ని ఆదుకున్నారని, ఆయన చేసిన మేలును తమ కుటుంబం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుందని కవిత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
అశోక్ కుమార్‌కి ఇచ్చిన పియోగియో అపే కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ ఆటోలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్బాబులు ప్రయాణం చేసి, ఆటో డ్రైవర్ అశోక్ కుమార్‌కి బోణీగా డబ్బును అదించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎపుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే శ్యాంబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో డిఆర్ఓ చిరంజీవి, కర్నూల్ ఆర్డీవో శేషి రెడ్డి, పత్తికొండ ఆర్డిఓ రామలక్ష్మి, పుచ్చకాయలమాడ గ్రామ పెద్ద సాంబశివారెడ్డి, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.