- పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద బారులు తీరిన వృద్దులు
- దివ్యాంగులు మండుటెండల్లో పడిగాపులు అయినప్పటికీ అందని పింఛన్లు
అమరావతి,చైతన్యరథం: సచివాలయాల, రెవిన్యూ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా రాజకీయ లబ్ది కోసం జగన్‌రెడ్డి పన్నిన పన్నాగంలో పండుటాకులు విలవిలలాడిపోయారు. గత నెల అందరికీ సచివాలయాల్లోనే నేరుగా నగదు రూపంలో ఫించన్లు పంపిణీ చేయగా ఈ నెల మాత్రం మొత్తం 65 లక్షల మందికి గాను 48 లక్షల మందికి బ్యాంకు ఖాతాలకు నగదును బదిలీ చేశారు. వాలంటీర్లు లేని కారణంగానే పెన్షన్ల పంపిణీ వ్యవస్థ స్తంభించిపోయిందని, దీనికి ప్రతిపక్ష నేత చంద్రబాబే కారణమని విష ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ది పొందేందుకు గాను జగన్‌రెడ్డి పన్నిన కుట్రను సీఎస్ జవహార్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు అమలు చేయడంతో అవ్వతాతలు మండుటెండల్లో నానా ఇబ్బందులు పడ్డారు.
ఉదయాన్నే పెన్షన్ తీసుకుందామని సచివాలయాల వద్దకు వెళ్లిన వృద్ధులు, వికాలాంగులు, వితంతవులకు మీకు బ్యాంకులో వేశాం అక్కడి వెళ్లి తీసుకోండని సచివాలయ ఉద్యోగులు పంపించేశారు. దీంతో చేసేది లేక మండుటెండల్లో గ్రామాల నుండి మండల కేంద్రానికి వెళ్లి అక్కడ బ్యాంకుల్లో పెన్షన్ సొమ్ము తీసుకుందామనుకున్న అవ్వాతాతలకు నిరాశే ఎదురయ్యింది. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల వద్దకు బారీ సంఖ్యలో వృద్ధులు చేరుకున్నారు. బ్యాంకుల్లో ఖాళీ లేక బయటనే గంటల తరబడి ఎండలో ఎదురు చూడాల్సి వచ్చింది. చాలా బ్యాంకుల్లో ఇప్పుడే ఇవ్వలేమని, వారం తర్వాత ఇస్తామని అధికారులు తిప్పి పంపారు. ఈ వారం రోజుల పాటు మందులకు, తిండికి ఏం చేయాలంటూ అవ్వతాతలు తల్లడిల్లిపోయారు. ఎండ దెబ్బకు తాళలేక కొందరు సొమ్మసిల్లి పడిపోయారు.
బ్యాంకు ఖాతాల్లో కిరికిరి
వృద్దులకు చాలా మందికి పేరుకే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి కానీ అవి ఆపరేషన్‌లో లేవు. పెన్షన్ల కోసం అంటూ బ్యాంకు వెళితే డబ్బులివ్వాలంటే ఈ కేవైసీ కావాలని, ఆధార్ అనుసంధానం కావాలని, వేలిముద్రలు సరిగ్గా పడడం లేదంటూ వెనక్కి పంపించేశారు. ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఇవ్వడం ఎలా సాధ్యమౌతుందని అవ్వాతాతలు ప్రశ్నించారు. ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ దురుద్దేశ్యంతో తమను ఇబ్బంది పెడుతున్న జగన్‌రెడ్డిపై దుమ్మెత్తి పోశారు. కాగా దాదాపు 75 వేల ఖాతాలకు మొబైల్ నెంబర్ అనుసంధానం కాలేదు. వీరందరికీ శనివారం నుండి సచివాలయాల్లోనే పంపిణీ చేయనున్నారు. కాగా గత నెల మాదిరే ఈసారి సచివాయాల్లోనే పెన్షన్లు పంపిణీ ఎందుకు చేయలేదని వృద్ధులు ప్రశ్నిస్తున్నారు.
పెన్షన్లు తీసుకోవడానికి పది నుండి ఇరవై కిలో మీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుల వద్దకు ఎలా రాగలమని 70 ఏళ్ల పైన వయస్సు ఉన్న వృద్దులు అడుగుతున్నారు. తాము వచ్చి అడిగినా వెంటనే బ్యాంకు అధికారులు పెన్షన్ ఇవ్వడం లేదని, మళ్లీ రమ్మంటున్నారని, పదే పదే తిరగడానికే పెన్షన్ డబ్బులు ఖర్చయిపోతున్నాయిని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉండాలంటూ 500 రూపాయలు కట్ చేసుకొని 2,500 రూపాయలే ఇస్తున్నారని మరికొంతమంది వృద్ధులు చెప్పారు. మొత్తంగా జగన్‌రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం పండుటాకులను నానా యాతలకు గురి చేస్తున్నాడు. వీరంతా ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పనున్నారు.