అమరావతి: సాధారణంగా నేరప్రవృత్తిగల కొందరు వ్యక్తులు దొంగతనాలు, మోసాలకు పాల్పడటం ఇప్పటివరకు మనం చూశాం. వివిధమోసాలకు పాల్పడి లక్షకోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి 16నెలలు జైలుజీవితం అనుభవించిన నేరప్రవృత్తి గల నేత, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏకంగా ప్రభుత్వమే వివిధ వర్గాలకు చెందిన నిధులను దొంగిలించింది. వివిధ వర్గాలు, సంస్థలకు చెందిన నిధులను వారికి తెలియకుండా ఒక ప్రభుత్వమే దొంగిలించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే ప్రథమం. అందుకే మేమంటున్నాం ఇది జగన్మోసపురెడ్డి ప్రభుత్వమని. కాదని చెప్పగలిగే దమ్ము ప్రభుత్వానికి ఉందా?
మాయమైన ఉద్యోగుల జిపిఎఫ్ నిధులు
కంచే చేనుమేసిన చందంగా రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా వివిధ ఖాతాలనుంచి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం నిధులు దొంగిలిస్తుండటంతో ఆయావర్గాలు హడలిపోతున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని సుమారు 80వేల మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలనుంచి 800కోట్లరూపాయల నిధులను ప్రభుత్వం దొంగిలించింది. గత నెల 28వతేదీన ఉద్యోగుల సంఘ నేత సూర్యనారాయణ ఆందోళనగా మీడియా ముందుకు వచ్చారు. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నగదు డెబిట్ అయ్యిందని, మా నగదు ఎవరు తీసుకున్నారో తెలియడంలేదన్నారు. తన ఖాతా నుంచి రూ.83 వేలు విత్ డ్రా చేశారని ఆయన వాపోయారు. 90 వేల మంది జిపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్లు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మరుసటిరోజు ఆర్థికశాఖ అధికారులను కలిసిన తర్వాత మళ్లీ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థికశాఖ అధికారులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని, ఇది క్రిమినల్ చర్యగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దీనిపై బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ స్పందిస్తూ ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వమే సొమ్ము దొంగతనం చేసిందని అన్నారు. ఇదిలావుండగా ఉద్యోగులకు సంబంధించిన సుమారు 6వేలకోట్ల రూపాయల డిఎ ఎరియర్స్‌పై కూడా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.
పంచాయితీల నిధుల స్వాహా!
ఇదిలావుండగా రాష్ట్రంలోని 12,918 పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14,15 ఫైనాన్స్ కమిషన్ నిధులు 7,660 కోట్ల రూపాయల నిధులను జగన్ రెడ్డి ప్రభుత్వం ఆయా పంచాయితీలకు తెలియకుండానే ఖాతాలనుంచి దొంగిలించింది. దీనిపై రాష్ట్ర పంచాయితీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైవిబి రాజేంద్రప్రసాద్ డీజీపీ కార్యాలయంలో కూడా ఫిర్యాదుచేశారు. చట్టబద్ధంగా ఎన్నికైన గ్రామ పంచాయితీల పాలకవర్గాల అనుమతిలేకుండా కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రప్రభుత్వం ఏవిధంగా తీసుకుంటుందని ఆయన అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. దీనిపై గత మూడునెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతు న్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. పంచాయితీలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులను కూడా ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులు దారిమళ్లించడం దారుణమని పంచాయితీరాజ్ చాంబర్ నేత వైవిబి రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయితీలకు మైనింగ్ సెస్సు, ఇసుక సీనరేజి, పర్ కాపిటా గ్రాంటు రూపంలో సుమారు 4వేల కోట్లవరకు ప్రభుత్వం వసూలుచేసుకొని తమకు ఇవ్వకుండా పెండిరగ్ పెట్టిందని తెలిపారు. నిధులు విడుదల చేసేవరకు ప్రభుత్వచేసిన దొంగతనాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ పోరాడుతూనే ఉంటామని ఆయన చెప్పారు.
అభయ హస్తం నిధులనూ మింగేసిన వైసిపి ప్రభుత్వం
రాష్ట్రంలో డ్వాక్రామహిళలు అభయ హస్తం పథకం కింద ఎల్ ఐసిలో దాచుకున్న రూ. 2118 కోట్ల నిధులను కూడా గత ఏడాది జగన్మోసపు రెడ్డి ప్రభుత్వం దొంగిలించింది. డ్వాక్రా సంఘాల మహిళలకు చెందిన సొమ్మును వారి నుంచి అంగీకారం తీసుకోకుండా ప్రభుత్వం స్వాహాచేసింది. ఇక నుంచి సంబంధిత పథకంతో తమకు సంబంధం లేదని ఎల్‌ఐసి సంస్థ పత్రికాప్రకటన ఇచ్చేవరకు ఈ విషయాన్ని ప్రభుత్వం దాచిపెట్టింది. నిరుపేదలైన డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా చేయడం ఆడబిడ్డలను మోసగించడం కాదా? తమ బిడ్డల చదువుతోపాటు వృద్ధాప్యంలో అండగా ఉంటుందనే ఉద్దేశంతో అభయహస్తం పధకం కింద డ్వాక్రా సంఘాల్లోని పేద మహిళలు రోజుకో రూపాయి చొప్పున దాచుకోగా, ఆ నిధులను జగన్ రెడ్డి సర్కారు మింగేసింది. మహిళా సంక్షేమం, మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పే వైసీపీ ప్రభుత్వం ఈవిధంగా దొంగతనానికి పాల్పడటం హేయం.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధుల స్వాహా!
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన 400 కోట్ల రూపాయల కార్పస్ నిధులను గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం లాగేసింది. వివిధ జాతీయ బ్యాంకుల్లో ఎఫ్ డిలుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో లాగేసింది. హెల్త్ యూనివర్సిటీకి జగన్ రెడ్డి ప్రభుత్వం ఏడాదికి విదుల్చుతున్నది కేవలం 5కోట్ల రూపాయలు కాగా, 450 కోట్ల రూపాయల ఎఫ్ డిలపై 40 కోట్లరూపాయలవరకు వడ్డీ వచ్చేది. అయితే జీతభత్యాలు, అనుబంధ కాలేజిల్లో మౌలిక సదుపాయాలకు ఏడాది 68 కోట్లరూపాయలు ఖర్చవుతోంది. ఎఫ్ డిలపై వడ్డీ, ఫీజుల రూపంలో వచ్చే మొత్తం కలిపి 70 కోట్లతో బొటాబొటిగా నెట్టుకొస్తున్న హెల్త్ యూనివర్సిటీ నిధులను కాజేసి ఆ సంస్థ మనుగడనే జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసింది. గ్రాంట్ పెంచాలని యూనివర్సిటీ పాలకవర్గం చేసిన విజ్జప్తులను పట్టించుకోకపోగా, ఆ సంస్థ కార్పస్ నిధులను సైతం ప్రభుత్వం లాగేయడం దుర్మార్గం. మొత్తమ్మీద రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక ప్రభుత్వమే వివిధ సంస్థలు, వర్గాల నిధులు దొంగతనం చేయడంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి పనిచేస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసుపెడతారు. అయితే ఏకంగా ప్రభుత్వమే దొంగతనం చేస్తే ఎవరికి చెప్పుకోవాలన్న సరికొత్త సమస్య ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ వర్గాల మెదళ్లలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా తయారైంది.