అమరావతి,చైతన్యరథం: రాష్ట్రాన్ని పాడుపడ్డ కొంపలా తయారు చేసిన హీన చరిత్ర సీఎం జగన్ రెడ్డిదేనని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…. ‘‘వైసీపీ పాలనలో మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి, హోంమంత్రి ఎప్పుడైనా వీటిపై సమీక్ష చేశారా? ఎవరికైనా న్యాయం చేశారా? కల్తీ మద్యం, ల్యాండ్ కబ్జాలు, అప్పులు, అత్యాచారాల్లో ఏపీ నెం.1 స్ధానంలో ఉంటే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటంలో అధమ స్ధానంలో ఉంది. ఎస్సీ,ఎస్టీ మహిళలపై 223 అత్యాచారాలు జరిగినా ఏం చర్యలు తీసుకోలేదని కేంద్రానికి స్వయంగా సాంఘిక సంక్షేమశాఖ నివేదిక ఇవ్వటం సిగ్గుచేటు. సిగ్గు అనే పదం వైసీపీ బ్లడ్ లోనే లేదు. టీడీపీ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు, డ్వాక్రా, విద్య, వైద్యం అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేశాం. చంద్రబాబు హయాంలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఓ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు భయంతో ఉరి వేసుకున్నాడు. లా అండ్ ఆర్డర్ అంటే అలా ఉండాలి. వైసీపీ ప్రభుత్వం అంటే ఎవరికి భయం లేదు, నమ్మకం లేదు. మహిళా సంక్షేమం అన్న జగన్ రెడ్డి మహిళా సంహారం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి గంటకు ఒక లైంగిక వేధింపు, ప్రతి 3 గంటలకు ఒక హత్య, ప్రతి 8 గంట ఒక రేప్ ప్రతి 12 గంటకు ఒక కిడ్నాప్ జరుగుతున్నాయి. రోజుకు 9 మంది బాలికలు, 20 మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. వీటిపై ఏం సమీక్ష చేశారు, ఏం న్యాయం చేశారు. 55 నెలల వైసీపీ పాలనలో 1 లక్షా 48 వేల నేరాలు మహిళలపై జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు? విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ కి గురైన బాధితురాలిని పరామర్శించడానికి చంద్రబాబు వెళ్తే వాసిరెడ్డి పద్మ చంద్రబాబును విమర్శించటం సిగ్గుచేటు. హెల్త్ మినిస్టర్ గా ఉన్న విడదల రజనీ ఏమైనా మాట్లాడిరదా? వారికి పైరవీలు చేసి అడ్డంగా ఎలా సంపాదించాలన్నదే పని. పరిపాలన గాలికొదిలి పందికొక్కులా అక్రమ సంపాదన చేస్తున్నారు. భాధితులకు న్యాయం చేయలేని పదవులు ఉంటే ఎంత లేకుంటే ఎంత? జగన్ రెడ్డికి ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపై ఉన్న శద్ర పాలనపై లేదు. గుంటూరులో రమ్య, నరసరావు పేటలో బీటెక్ విద్యార్ది అనూష, పులివెందులలో నాగమ్మపై ఇలా ఎన్నో అత్యాచారాలు జరిగాయి. వీటిపై సమాధానం చెప్పకుండా దిశ చట్టం తెచ్చామంటున్నారు. దిశ చట్టం ఎక్కడైనా అమలవుతుందా? చంద్రబాబు తెచ్చిన చట్టానికి దిశ అని పేరు మార్చుకుని పోలీస్ స్టేషన్లకు రంగులు వేసుకున్నారు. రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ముందే అత్యాచారం జరిగింది. దీనిపై ప్రశ్నించిన ఎమ్మెల్యే భవానిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం తప్ప బాధిత మహిళకు ఏం న్యాయం చేశారు? కమీషన్ల కోసం కల్తీమద్యంతో మహిళల పుస్తెలు తెంచుతున్నారు. ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్ వంటి బ్రాండ్లు అమ్ముతున్నారు. మంత్రి రోజాకు నిభంధనలకు విరుద్దంగా రుషికొండలో సీఎంకి ఇల్లు కేటాయించటంపై ఉన్న శ్రద్ద మహిళలపై లేదా? మహిళల సమస్యలపై రోజా ఎందుకు నోరు మెదపటం లేదు. వచ్చే ఎన్నికల్లో మొట్ట మొదట ఓడిపోయేది రోజానే. నాలుగున్నరేళ్లు నియోజకవర్గాన్ని దోచుకున్న వారిని పక్క నియోజకవర్గాలకు మార్చితే ఓట్లేయడానికి ప్రజలు అమాయకులా? వాలంటీర్లతో దొంగ ఓట్లు నమోదు చేయించారు. మీరెంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చినా 150 సీట్లలో డిపాజిట్లు కూడా రావనేది పచ్చి నిజం. ఐపిసి 367,498 (ఏ) 354, 509 వంటి రేప్, మహిళలపై వేధింపుల కేసులున్న గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, బెల్లాన చంద్రశేఖర్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటి వారికి సీట్లిచ్చి ఉద్దరించిన అసమర్ద నాయకుడు జగన్ రెడ్డి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఎలక్షన్ అంటే గ్యాంబ్లింగ్ గా వైసీపీ భావిస్తోంది. కల్తీ మద్యం, దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు. రైతుల పంట నష్టంపై మాట్లాడలేని మంత్రి బొత్స చెరువులు మింగేసి కాలేజీలు కట్టారు, ఊరి మీద మేనల్లుడిని ఆంబోతులా వదిలేశారు. ఆయన కూడా చంద్రబాబుపై విమర్శలు చేయటం సిగ్గుచేటు. వచ్చే ఎన్నికల్లో మహిళలంతా టీడీపీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారు. వైసీపీకి డిపాజిట్లు కూడా రావు’’ అని అనురాధ అన్నారు.