- విడదల రజని బంధువునని చెప్పుకుంటూ స్కూల్ బిల్లులు తినేశారు
- పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో అక్రమాలు
- ఇళ్ల బిల్లులు మంజూరు చేయకుండా అడ్డుకున్నారు
- గత పాలకుల దుర్మార్గాలకు బలైపోయాం
- మంత్రి కొల్లు రవీంద్రకు బాధితుల మొర
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్‌కు తరలివచ్చిన అర్జీదారులు
అమరావతి (చైతన్యరథం): సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు.. అనే నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తూ.. ప్రజల కోసం నిరంతరం పరితపిస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు. ప్రజల సంతోషమే చంద్రబాబు లక్ష్యం. పేదలు, సామాన్య ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని.. వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకే ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేసింది. నేడు ఇది మంచి ప్రభుత్వమని ప్రజలే మెచ్చుకుంటున్నారు. ప్రజల సమస్యలన్నీ పరిష్కరించి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ.. ఇది ప్రజా ప్రభుత్వమని మరింత మంచి పేరు తెచ్చుకునేలా పనిచేస్తామని మంత్రి రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, పార్టీ నాయకులు గొట్టుముక్కల రఘురామకృష్ణరాజు, దేవినేని చందుతో కలిసి ప్రజల నుండి మంత్రి రవీంద్ర వినతులు స్వీకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు విన్నవించుకుంటూ అర్జీలు ఇచ్చారు.
కృష్ణా జిల్లా పెడనకు చెందిన మామిడి సత్యనారాయణ అనే వ్యక్తి గ్రీవెన్స్‌లో అర్జీ ఇస్తూ.. అప్పటి మంత్రి జోగి రమేష్ అండతో కటకం ప్రసాద్, తమ్మన వెంకట సుబ్బారావు, కొల్లూరి సత్యనారాయణ, వన్నెం రామారావు, వానీఫ్ ఖాన్, మామిడి రామ సత్యప్రసాద్, మామిడి రామానంద నరసింహరావు, మామిడి రామకృష్ణ, మామిడి ఉదయ వెంకట నాగ శివసాయిలు తమను కటకం ప్రసాద్ ఇంట్లో నిర్బంధించి ఇష్టానుసారంగా కొట్టి చంపుతామని బెదిరించి తమచేత సంతకాలు చేయించుకుని తమ ఆస్తిని కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై నాడు పెడన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని. దీనిపై తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ సిబ్బంది గ్రీవెన్స్‌లో అర్జీ ఇస్తూ.. మాజీ మంత్రి విడదల రజని బంధువునని చెప్పుకుంటూ.. పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయురాలు నవబోతు అరుణకుమారి, మాజీ ఇంగ్లీష్ టీచర్ వడ్లాన వీరయ్యలు నాడు` నేడు పనుల పేరుతో పాఠశాలలో సక్రమంగా పనులు చేయకుండా రూ.కోటి 10 లక్షల వరకు డబ్బులు డ్రా చేసి.. దాన్ని కప్పి పుచ్చుకునేందుకు పిల్లలనుండి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కమిటీ వేయగా.. నాడు`నేడు నిధులు పక్కదారి పట్టినట్లు కూడా వెల్లడయిందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట మండలం బడికాయలపల్లె గ్రామానికి చెందిన పసుపులేటి అశోక్ కుమార్ విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యాజమాన్య కమిటీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తెలిపారు. వైసీపీ నేతలతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుమ్మక్కై కొంతమంది కమిటీ సభ్యులను తరగతి గదిలో రాత్రి 8 గంటల వరకు నిర్బంధించి, బెదిరించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ఎకగ్రీవం చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గత ప్రభుత్వంలో ఇళ్లు మంజూరయినా.. తాము టీడీపీ సానుభూతిపరులమనే కారణంతో తమకు బిల్లులు మంజూరు చేయకుండా అడ్డుకున్నారని.. దయచేసి ఇళ్ల బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్‌తో పాటు పలువురు బాధితులు గ్రీవెన్స్‌లో అర్జీలు ఇచ్చి వేడుకున్నారు.
గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే వల్ల తన పొలం మరొకరి పేరుమీద ఆన్‌లైన్ అయిందని.. దాన్ని సరిచేయాలని ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని, పొలం తమదే అని అన్ని ఆధారాలు ఉన్నా సమస్యను పరిష్కరించడం లేదని.. తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం వడ్డెపాలెంకు చెందిన గురవయ్య విజ్ఞప్తి చేశారు.
కోర్టు ద్వారా తాము ఆస్తిని పొందినా.. తమ ఇంటిని కబ్జా చేయాలని యత్నిస్తూ.. తాము ఇంట్లో లేని సమయంలో ఇంటికి తాళం వేస్తూ ఇబ్బంది పెడుతున్నారని.. దొంగ కరెంట్ బిల్లు సృష్టించి ఇంటిని కొట్టేయాలని చూస్తున్న కుట్రదారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని తిరుపతికి చెందిన ఎస్. నగీనా గ్రీవెన్స్‌లో టీడీపీ నేతలకు అర్జీ ఇచ్చి విన్నవించారు.
తమకు వరద సాయం అందలేదని.. విజయవాడ నుండి పెద్ద ఎత్తున వచ్చిన వరద బాధితులు వాపోయారు. నష్టం నమోదు చేసిన సిబ్బంది నిర్లక్ష్య ధోరణి వల్ల తమకు వరద సాయం అందలేదని తెలిపారు. పరిహారం లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు నమోదు చేయలేదని, పేర్లు ఎందుకు రాయలేదని అడుగుతుంటే పొంతన లేకుండా మాట్లాడుతున్నారని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై నేతలు స్పందిస్తూ..ఎవరూ నష్టపోకుండా బాధితులందరికీ న్యాయం జరిగేలా మూడోసారి వెరిఫికేషన్‌కు వస్తున్నారని.. పేర్లు నమోదు చేసుకుని పరిహారం పొందాలని బాధితులకు సూచించారు.
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలకొండ గ్రామానికి చెందిన తిరివీధి అనిత తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. గత ప్రభుత్వంలో అన్యాయంగా తనను ఉద్యోగం నుండి తొలగించారని తెలిపారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి పోషణకు ఎటువంటి ఉపాధి లేదని, తనకు ఏదైనా ఉపాధి కల్పించాలని ఆమె వేడుకున్నారు.
దివ్యాంగులమైన తాము అనేక ఇబ్బందుల్లో ఉన్నామని, ఇంటికోసం బ్యాంకులో తెచ్చిన రుణం కట్టుకోలేక కష్టాలు పడుతున్నామని, తమకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని విజయవాడకు చెందిన భార్యాభర్తలు పంతాడి జనార్థనరావు, లక్ష్మీదుర్గ వాపోయారు. వారి ఆవేదనను విన్న నేతలు తక్షణ సాయంగా కొంత ఆర్థిక సాయం అందించి, తప్పకుండా ఆదుకుంటామని భరోసా కల్పించారు. దీంతో నేతలకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో ప్రస్తుతం పనిచేస్తున్న 309 మంది పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టులు మినహాయించి ఇవ్వాలని ఏపీ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్షరర్స్ అసోసియేషన్ సభ్యులు గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
అనారోగ్య సమస్యల కారణంగా సీఎంఆర్‌ఎఫ్ అందించి ఆదుకోవాలని పలువురు, అన్ని పత్రాలు ఉన్నా తమ పొలం ఆన్‌లైన్‌లో ఎక్కలేదని వాటిని సరిచేయాలని మరికొందరు వేడుకోగా, గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసిందని.. ఇళ్ల కోసం కట్టిన డబ్బులు కూడా ఇవ్వలేదని.. దయచేసి తమకు ఇళ్లు మంజూరు చేయాలని పలువురు బాధితులు వేడుకున్నారు. అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు విజ్ఞప్తి చేశారు.