.ఆస్తిలో సమానహక్కు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్
.పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే ఎన్టీఆర్ మహిళా సాధికారిత కోసం కృషిచేశారని తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు టిడిపి జనార్దన్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం నుంచి రాష్ట్రస్థాయి మహిళా సాధికారిత సదస్సులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో టిడిపి జనార్దన్ మాట్లాడుతూ… మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి యావత్ మహిళాలోకానికి అన్న ఎన్టీఆర్ తోబుట్టువుగా నిలిచారని తెలిపారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మహిళల అభ్యున్నతి కోసం గత 40ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఎనలేని కృషిచేసిందని తెలిపారు. టిడిపి హెచ్ ఆర్ డి విభాగం చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ… తెలుగు మహిళా సైన్యం తన శక్తి ఏంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. అవకాశాలు ప్రతిసారీ రావు. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతశిఖరాలను అధిరోహించాలని కోరారు. టిడిపి జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి మాల్యాద్రి మాట్లాడుతూ… మహిళా సాధికారత, మహిళాభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమైంది. కష్టపడి పనిచేస వారికి తప్పకుండా పార్టీలో అవకాశాలు వస్తాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మోసాలు, విషపు పాలనను, విషపూరిత మద్యంపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రతి తెలుగుమహిళ కృషిచేయాలని కోరారు. ప్రముఖ పాత్రికేయులు రాజేంద్ర మాట్లాడుతూ ఏపీలో మహిళలపై అమానుషాలు నిత్యకృత్యమైపోయాయి. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా ఉండటంలేదు. ఎన్ని దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారే కానీ చర్యలు తీసుకోవడంలేదన్నారు. అమరావతిలో మహిళలపై జరిగిన దాడిపై జాతీయ మహిళా కమిషన్ ఏం చేసింది? రాజధానిలో పరిశీలించిన బృందం ఏం తేల్చిందని ప్రశ్నించారు. మహిళలకు లక్ష్య సాధనలో పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని ఎదొర్కొనే ధైర్యం ఉంటేనే మహిళలు రాజకీయాల్లోకి రావాలని అన్నారు. టిడిపి ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్ వెంకటపతి రాజు మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఇంతటి వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఆశావాద దృక్పదంతో ఎలా ముందుకు వెళ్లాలో చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఏ కష్టమొచ్చినా తెలుగుమహిళా విభాగం పోరాడుతోందని అన్నారు. తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ…. తెలుగు మహిళాశక్తి ఏంటో తాడేపల్లి ప్యాలెస్‌కు వినపడాలి. అరాచకపాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.