అమరావతి,చైతన్యరథం: పన్ను ఎగవేతదారులను అరికట్టి, సక్రమంగా పన్ను కట్టే వారిని ప్రొత్సహించేలా అధికారులు వ్యవహరించాలని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. పన్నుల విధానం చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను ప్రొత్సహించేలా ఉండాలని, అదే సమయంలో వ్యాపారస్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. బుధవారం ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ వాణిజ్య పన్నుల శాఖ కమిషనరేట్‌కు వెళ్లి ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వస్తువుల అమ్మకం, వినిమయం పెరిగేట్లు చూడాలన్నారు. హైకోర్టులో ప్రత్యేక ట్యాక్స్ బెంచ్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. రాబోయే వంద రోజుల్లో చేయాల్సిన పనులను నిర్ధేశించారు. ఈ సమీక్షలో చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, స్పెషల్ కమిషనర్ ఆనంద్, కమిషనర్లు రమేష్, రవి శంకర్ పాల్గొన్నారు.