అమరావతి: రాష్ట్రంలోని బీసీలను అణచివేయడమే ధ్యేయంగా జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఆర్దిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శంచారు . రెండు రోజుల క్రితం జరిగిన మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి గళమెత్తినందుకు ఇంటి గోడలు కూల్చడం సిగ్గుచేటు అని అన్నారు. అక్రమ కట్టడం అంటూ పోలీసులు, ఇతర అధికారులు చెప్పడం దుర్మార్గమన్నారు. అక్రమ కట్టడం అయితే నోటీసులు ఇవ్వకుండా.. గోడ కూల్చేసిన తర్వాత ముసుగు వేసుకుని ఒక వ్యక్తిని పంపించి ఇంటి లోపల నోటీసు పత్రాలను ఎందుకు విసిరి వెళ్లారని ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన తాడేపల్లిలోని తుగ్లక్ కు మాత్రమే వస్తాయని మరోసారి నిరూపితమైందని ఎద్దేవా చేశారు. అక్రమ కట్టడమైతే.. తెల్లవారు జామున 4 గంటలకు ఆర్డీవో, ఎస్పీ సహా వందలాది మందితో రావాల్సిన అవసరం ఏమిటి.? జగన్ రెడ్డి పాలనలో మగ్గిపోతున్న ఆంధ్రప్రదేశ్ కు స్వాతంత్య్రం కోసం మరో స్వాతంత్ర ఉద్యమం చేసే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈ తుగ్లక్ ప్రభుత్వంపై పోరాడుతాం. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని అన్నారు.