నందిగామ టౌన్ : నందిగామ పట్టణం మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య తన కార్యాలయంలో మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారిపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును విమర్శించే స్థాయి నీకు గాని నీ వైసీపీ పార్టీకి గాని లేదు. నీ సొంత నియోజకవర్గంలో గడపగడపకు నువ్వు తిరుగుతుంటే వెంకట నాగబాబు అనే ఓటరు నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో 1500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని అడగడం వాస్తవం కాదా? అడిగిన దానికి సమాధానం చెప్పలేక పోలీసులను పిలిపించి ఇతనిపై కేసు నమోదు చేయండి అని బెదిరింపులకు పాల్పడటం నిజం కాదా ? అని వ్యాఖ్యానించారు.
నీ నియోజకవర్గంలో ఓటరుకు సమాధానం చెప్పలేని నువ్వు మా నాయకుడుని అవినీతిపరుడు అనడానికి సిగ్గుండాలన్నారు. మా అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో పోలవరం పనులను పరుగులు పెట్టించి పట్టిసీమ అందాలు కలబోసిన గోదావరి తల్లిని కృష్ణమ్మతో జతచేసిన జలసేనాని మా ఉమామహేశ్వరరావు అన్నారు. నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో దేవాలయపై దాడులు,అక్రమాలు,అన్యాయాలు ఇవి తప్పా ఏనాడు మీ శాఖను సక్రమంగా నిర్వర్తించారో చెప్పే దమ్ము, ధైర్యం మీకుందా? నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 92 ఏళ్ల చరిత్ర కలిగిన గోశాలలో వందల సంఖ్యలో ఆవులు మృతి చెందడం నిజం కాదా? ఆనాడు మంత్రిగా నువ్వేమి చేసావు.మీ ప్రభుత్వం ఏమి చేసిందని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రులకు,ఎమ్మెల్యేలకు తెలిసింది ఏంటి? ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు పెట్టాలి,కేసులు పెట్టాలి వారిపై అసత్య ప్రచారాలు చేయడం తప్పా? అవినీతి గురించి వెల్లంపల్లి మాట్లాడుతుంటే దెయ్యాలు-వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ప్రజల పక్షాన, ప్రజా వ్యతిరేక విధానాలపై సాయుధ పోరాటాలు చేస్తుంటే అది చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేయడం హాస్యాస్పదమన్నారు. తాడేపల్లి.. మీ అధినాయకుడు ముందు భజనలు చేయడం..ప్రతిపక్ష నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజానీకం అతి కొద్ది రోజులలోనే వైసీపీ పార్టీకి మరియు వైసీపీ నాయకులకు తగిన బుద్ధి చెప్పనున్నారని హెచ్చరించారు.