గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం ఏపీ సీఐడీ విచారణకు హాజరయ్యారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ శ్రీనివాసరావుకు 41ఏ కింద సీఐడీ అధికారులు నోటీసులను ఇచ్చారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ నోటీసుల మేరకు ఆయన విచా రణకు హాజరయ్యారు. కొన్ని రోజుల క్రితం ఓ వార్తా ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న శ్రీనివాసరావు… వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో కొలికపూడిపై ఏపీ డీజీపీకి వర్మ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, శ్రీనివాసరావుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
కాగా విచారణ అనంతరం శ్రీనివాసరావు మట్లాడుతూ ఉదయం 10 గంటలకు సీఐడీ విచారణకు హాజరయ్యానని చెప్పారు. సాయంత్రం 5.30 వరకు తనను ప్రశ్నించారన్నారు. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. ఆర్జీవీ సినిమాలపై తనకు తీవ్ర అభ్యంతరాలున్నాయన్నారు. రెండు కులాల మధ్య సామరస్యతను చెడ గొట్టేలా వ్యూహం సినిమా ఉంది. ఆ ఆవేదన వల్లే ఆర్జీవీ గురించి అలా మాట్లాడా. ఈవివాదం తర్వాత రామ్‌గోపాల్ వర్మకు ఫోన్ చేశా. నా అభిప్రాయాన్ని ఆర్జీవీకి చెప్పాలనుకున్నా. నా ఫోన్ కాల్‌ను రామ్‌గోపాల్ వర్మ లిప్ట్ చేయలేదు. జీవితంలో మొదటిసారి రామ్‌గోపాల్ వర్మ భయపడినట్లు సీఐడీ అధికారులు చెప్పారు. ఇప్పటికైనా ఆర్జీవీ మంచి సినిమాలు తీయాలి. లేకపోతే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని కొలికపూడి అన్నారు.