- కృష్ణానది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బందీ లేదు
- వైసీపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు
- రాజధానిలో కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణం
- పటిష్టంగా ఐకానిక్ భవనాలు, క్వార్టర్లు
- ఎలాంటి ఇబ్బంది లేదంటూ నిపుణుల నివేదిక
- రాజధాని రైతులకు రెండ్రోజుల్లో కౌలు నిధులు
- పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ వెల్లడి
అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అమరావతి మునిగిపోతుందని విష ప్రచారం చేసిందని పురపాలక మరియు పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అమరావతి పూర్తిగా సేఫ్జోన్లో ఉందని, ఎలాంటి ఇబ్బందీ లేదని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ప్రమాదం లేదని, దుర్మార్గుల దుష్ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. సోమవారం విజయవాడలోని సీఆర్డిఏ ప్రధాన కార్యాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
అమరావతికి ముంపు లేకుండా రిజర్వాయర్లు నిర్మాణం
అమరావతి రాజధానికి పనికిరాదని గత ప్రభుత్వం ప్రచారం చేయడంతో పాటు ప్రపంచబ్యాంకుకు కూడా నిధులు ఇవ్వొద్దని లేఖలు రాసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కృష్ణానదికి రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ కలగలేదన్నారు. అమరావతి డిజైన్ సమయంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు, రిజర్వాయర్లు ప్రతిపాదనలు చేశామని గుర్తు చేశారు. కొండవీటి వాగు, పాలవాగుల ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ డిజైవ్ చేశామని మంత్రి వివరించారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ మూడు కెనాల్స్‌ను పూర్తిచేసేలా త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. అనంతవరం నుంచి ఉండవల్లి వరకూ 23.6 కిమీలతో కొండవీటి వాగు, దొండపాడు నుంచి కష్ణాయపాలెం వరకూ 16.7 కి.మీ మేర పాలవాగు, వైకుంఠపురం గ్రావిటీ కెనాల్‌ను 8కిమీ మేర అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి వివరించారు. మొత్తం 48.3 కి.మీ మేర ఈ మూడు కాలువలు అభివృద్ధి చేస్తామని, వాగులు కొన్నిచోట్ల ఉండాల్సిన దానికంటే కుచించుకుపోయాయన్నారు.
గత వందేళ్లలో కృష్ణానదికి వచ్చిన వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుని మూడు కాల్వలు అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. వీటితో పాటు 6 రిజర్వాయర్లు నిర్మాణం కూడా చేపడుతున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.
సీడ్ కేపిటల్ లోపల నీరుకొండవద్ద 0.4 టీఎంసీ, కృష్ణాయపాలెంవద్ద 0.1టీఎంసీ, శాఖమూరువద్ద 0.01టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్లు, సీడ్ కేపిటల్ వెలుపల లాంవద్ద 0.3 టీఎంసీ, పెదపరిమి వద్ద 0.2 టీఎంసీ, వైకుంఠపురం వద్ద 0.3 టీఎంసీ సామర్థ్యంతో మొత్తం ఆరు రిజర్వాయర్లు నిర్మాణం చేపడుతున్నామని మంత్రి నారాయణ వివరించారు. .ఎంతవర్షం వచ్చినా సరే కాలువలు, రిజర్వాయర్లు సరిపోతాయన్నారు. ఒకవేళ ఇవి నిండిపోయినా సరే కృష్ణా నదిలోకి పంపింగ్ చేసేందుకు కూడా ప్రతిపాదనలు ఉన్నట్లు మంత్రి చెప్పారు. 12,350 క్యూసెక్కుల కెపాసిటీతో ఉండవల్లి వద్ద, 4000 క్యూసెక్కుల కెపాసిటీతో బకింగ్‌హాం కెనాల్లోకి, 5650 క్యూసెక్కుల కెపాసిటీతో వైకుంఠపురంవద్ద లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తామని వివరించారు. అన్నీ పూర్తయితే ఎంత వర్షం పడినా ఒక్క చుక్క నీరు నిల్వ ఉండదని, భవిష్యత్తులో కృష్ణా నడికి మరింత భారీ వరద వచ్చినప్పటికీ రాజధాని అమరావతికి ఎలాంటి ఢోకా ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా కరకట్టను బలోపేతం చేసేలా రీడిజైన్ చేస్తామన్నారు.
భవనాలన్నీ పటిష్టమేనని నిపుణుల నివేదిక
రాజధానిలో 2014-19మధ్య నిర్మించిన భవనాలు మధ్యలోనే నిలిచిపోయాయి. గత ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో ఆయా భవనాలు సామర్థ్యం ఎలా ఉందనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికోసం ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నై బృందాలకు భవనాలు పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ నివేదిక ప్రభుత్వానికి అందింది. ఐకానిక్ భవనాలైన సెక్రటేరియట్ టవర్లు, హైకోర్టుతో పాటు అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించిన 3600 ఫ్లాట్లకు ఎలాంటి ఇబ్బందీ లేదని.. వాటి నిర్మాణం కొనసాగించవచ్చని నివేదికలు అందినట్టు మంత్రి నారాయణ వెల్లడిరచారు. ఆయా నిర్మాణాల పనులకు రాబోయే రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు. ఐకానిక్ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్ కూడా బలంగా ఉందన్నారు. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు వర్షాలవల్ల ఇబ్బంది కలిగిందని.. త్వరలో పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
రాజధాని రైతులకు రేపో ఎల్లుండో కౌలు నిధులు జమ
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఒక ఏడాది కౌలు కింద రూ. 175 కోట్ల రూపాయలను రేపు లేదా ఎల్లుండి జమ చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. రాజధానిలోని కొన్ని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కింద గతంలో రైతులు భూములు ఇవ్వలేదని… అలాంటి వారు ప్రస్తుతం భూములిచ్చేందుకు ముందుకొస్తున్నారని మంత్రి వివరించారు. అలా భూములు ఇస్తానంటే వారి ఇంటికి స్వయంగా నేనే వెళ్లి అంగీకార పత్రాలు తీసుకుంటానని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన వివిధ రకాల పన్నులకు గడువు ఈనెల 30తో ముగిస్తున్నప్పటికీ, వరదల కారణంగా ఆయా ప్రాంతాల వారికి వెసులుబాటు కల్పించేలా గడువు పొడిగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.