- ఇసుక సరఫరాను పెంచేందుకు సర్కారు నిర్ణయం
- 16నుంచి అందుబాటులోకి తేవాలన్న సీఎం చంద్రబాబు
- గనులు, భూగర్భ శాఖపై సచివాలయంలో సమీక్ష
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గస్థాయిలో ఇసుక సరఫరా ఉండేలా చూడాలని.. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించి వినియోగదారులకు ఇబ్బందులు తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మైనింగ్ శాఖపై సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 16నుంచి రాష్ట్రంలో ఇసుక సరఫరా కోసం 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 108 కొత్త రీచ్‌లు అందుబాటులో వస్తాయని సమీక్షలో అధికారులు వివరించారు. ఈ రీచ్‌ల ద్వారా రోజూ 80వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 30వేల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా జరుగుతోందని… కొత్తగా అందుబాటులోకి వచ్చే రీచ్‌లతో అదనంగా 80 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు. ఇసుక బుకింగ్ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఆన్లైన్ పోర్టల్‌తో పాటు రీచ్‌ల వద్ద నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు.
తద్వారా ఆన్లైన్ పోర్టల్ నుండి బుక్ చేసుకోలేని వారు నేరుగా ఇసుక రీచ్‌కు వెళ్లొచ్చని సీఎం చంద్రబాబు సూచించారు. ఇసుక రీచ్‌లను జిల్లాస్థాయి శాండ్ కమిటీ ఎంపిక చేసిన ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహిస్తాయని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఏజెన్సీలను జిల్లాస్థాయి శాండ్ కమిటీ టెండర్ల ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తుందన్నారు. ర్యాంప్‌ల ఏర్పాటు, రీచ్‌ల నిర్వహణ వ్యవహారాలు వీరు చూస్తారని అధికారులు వివరించారు. ఇసుక రీచ్‌లోని ఇసుక స్టాక్ పాయింట్‌ను 24 గంటలూ ఆపరేట్ చేయడానికి వారిని అనుమతిస్తామని, తద్వారా నిరంతర సరఫరాను కొనసాగించవచ్చని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే రీచ్ పాయింట్ వద్ద ఇసుక సరఫరా రేటు డీఎల్ఎస్సీ నిర్ణయించినట్లుగా ఉండాలని సీఎం సూచించారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను త్వరితగతిన అనుమతించడం ద్వారా మార్కెట్లో ఇసుక లభ్యత పెంచబోతున్నట్లు అధికారులు వివరించారు. అయితే ఎక్కడా అక్రమాలకు తావులేకుండా చూడాల్సిన అవసరం ఉందని… దీని నిరంతర నిఘాతోపాటు నిత్యం పర్యవేక్షణ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇసుక లభ్యత, రవాణా ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు మొదలైన వాటిగురించి ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారాన్ని పంపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చెకింగ్, జీపీఎస్ ట్రాకింగ్, ఆడిట్ల ద్వారా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
డెలివరీలను వేగవంతం చేయడానికి మరిన్ని వాహనాలను అందుబాటులోకి తెచ్చుకోవాలని సీఎం సూచించారు. ఇసుక నిత్యావసరంగా భావించి సరఫరాకు ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇసుక రవాణా ధరలు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఇసుక రీచ్‌ల సంఖ్యను పెంచేందుకు ప్రైవేట్ వ్యక్తులు కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ నుండి అనుమతితో తవ్వకాలు ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. అయితే ప్రైవేట్ వ్యక్తుల కోసం అనుమతించబడిన ఈ కొత్త ప్రైవేట్ ఇసుక రీచ్‌లలో కూడా డీఎల్ఎస్సీ నిర్ణయించిన ధరకే ఇసుకను సరఫరా చేయాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ప్రజలనుంచి పూర్తిస్థాయిలో సానుకూల స్పందన వచ్చేలా అధికారుల చర్యలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.