- ‘జయహో బీసీ.. జనాభాలో సగం, కూటమి ఇచ్చింది బలం’ నినాదంతో ప్రచారం
- స్థానిక ఎన్నికల్లో ‘ట్రిపుల్ ఇంజిన్’ సర్కార్ సాధనే లక్ష్యం
- రాబోయే 50 రోజులు ప్రతి ఒక్కరూ కష్టపడాలి
- ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
- పనితీరు ఆధారంగా నేతలకు రేటింగ్
- వర్చువల్ సమీక్షలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో ‘ట్రిపుల్ ఇంజిన్ సర్కార్’ స్థాపించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, పరిశీలకులు, ముఖ్య నేతలతో ఆదివారం ఆయన ప్రత్యేక వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలు, ప్రచార తీరు, మిత్రపక్షాల సమన్వయం, ప్రత్యర్థుల దుష్ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టడంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ సిఫార్సులను ఆమోదించి, ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు భంగం కలగకుండా బీసీలకు గరిష్ఠ న్యాయం చేస్తున్నామని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన కేటాయింపులతో పాటు పార్టీపరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 40 శాతం వరకు సీట్లు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నట్టు ప్రకటించారు. “జయహో బీసీ! జనాభాలో సగం.. కూటమి ఇచ్చింది బలం” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి తీవ్ర అన్యాయం చేసిందని, చివరికి ఎన్నికలు జరగకుండా కోర్టులకు వెళ్లి అడ్డుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి వేగవంతమైంది. స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి ‘ట్రిపుల్ ఇంజిన్’ పాలన తీసుకురావాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓటింగ్ శాతం సాధించడమే లీడర్ల పనితీరుకు కొలమానమని తేల్చి చెప్పారు. రాబోయే 50 రోజులు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, నేతల పనితీరు ఆధారంగా ప్రత్యేక రేటింగ్లు ఇస్తామని వెల్లడించారు. గెలుపు, నిజాయితీ, సమర్థత, సోషల్ రీ-ఇంజనీరింగ్ ప్రాతిపదికన మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, స్వార్థం లేదా నాటకాలతో పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వామ్యపక్షాలు క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. అన్ని స్థాయిల్లోనూ సమన్వయ కమిటీలను క్రియాశీలకం చేయాలని, చిన్నపాటి అపోహలకు కూడా తావివ్వకూడదని స్పష్టం చేశారు. ‘కూటమి ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లు సంక్షేమానికి, మరో రూ.1.50 లక్షల కోట్లు అభివృద్ధి పనులకు వెచ్చించింది. ‘సూపర్్సక్స్’ హామీలను సూపర్ హిట్గా అమలు చేసింది.
చెత్త పన్ను రద్దు, ‘పల్లె పండుగ’ కింద రూ.11 వేల కోట్లు, జల్ జీవన్ మిషన్కు రూ.30వేల కోట్లు కేటాయించాం. 5 లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయడం, 16.48 లక్షల ఎకరాలను 22 (ఎ) నిషేధిత జాబితా నుంచి తొలగించడం లాంటి అంశాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. విశాఖ, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో రూ.52వేల కోట్ల విలువైన ఆస్తులపై 60వేల మందికి పూర్తి హక్కులతో పట్టాలు ఇచ్చాం’ అని గుర్తు చేశారు. వైసీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోవడంతోనే ఆ పార్టీ నేతలు అబద్ధాలు, ఫేక్ ప్రచారాలను నమ్ముకున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. “వైసీపీ పాలనలో అక్రమ సంపాదన, అనాలోచిత నిర్ణయాల వల్ల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వ్యాపారవేత్తలు సైతం జైళ్లపాలయ్యారు. వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరో ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి నిరోధకులకు, రౌడీలకు, ‘రప్పారప్పా’ ముఠాలకు ఈ ఎన్నికలతో ప్రజలే గట్టి బుద్ధి చెప్పాలి” అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.













