- రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు
- కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు పూర్వవైభవం
- దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
- కర్నూలు జోన్ పరిపాలనా భవనం ప్రారంభం
కర్నూలు(చైతన్యరథం): అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామికం, ఆధ్యాత్మికం అన్నింటిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం కర్నూలు నగరంలో రూ.4.25 కోట్ల వ్యయంతో నిర్మించిన దేవాదాయ శాఖ కర్నూలు జోన్ పరిపాలనా కార్యాలయ భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి భరత్, జిల్లా కలెక్టర్ ఏ.సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం విజయవాడ గొల్లపూడిలో ఉన్నట్లుగానే, రాయల సీమకు కర్నూలులో ఈ ఆధ్యాత్మిక భవనం ఏర్పాటు చేయడం అత్యంత సంతోషదాయకం అని పేర్కొన్నారు. ఈ కార్యాలయ సముదాయంలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయంతో పాటు ఇంజ నీరింగ్, తదితర కార్యాలయాలు సముదాయాలు కూడా ఉన్నాయ ని, నూతన కార్యాలయం కర్నూలు నుంచి కాణిపాకం పనిచేస్తుం దన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన హామీల్లో దేవాదాయ శాఖలో 98 శాతం నెరవేర్చామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 2372 మంది అర్చకులకు కనీస వేతనం కింద ప్రతి నెలా రూ.15 వేలు ఇస్తున్నామన్నారు.
వేద విద్య నేర్చుకున్న 599 మంది అర్హులైన వేద పండితులకు సంభావన కింద నెలకు రూ.3 వేలు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఆలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు రూ. 25 వేల చొప్పున వేతనం ఇస్తున్న ప్రభుత్వం తమది అని మంత్రి పేర్కొ న్నారు. ఆలయాల ట్రస్ట్ బోర్డులో పాలకవర్గంలో బ్రాహ్మణుల్లో ఒకరిని, నాయీ బ్రాహ్మణుల్లో ఒకరిని సభ్యులుగా చేర్చేందుకు చట్టం తెచ్చామన్నారు. రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద ఆలయాల న్నింటిని టూరిజం సర్క్యూట్ కింద చేర్చి, టెంపుల్ టూరిజంను రాష్ట్రంలో పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దేవాదా య ఆస్తులను, ఆలయ భూములను పరిరక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో 21 ఆలయాల్లో ప్రతినిత్యం అన్నప్రసాద వితరణ జరుగుతోందని, 74 ఆలయాల్లో వారానికి ఒకరోజు, రెండురోజులు అన్నప్రసాద వితరణ చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 1058 ఆలయాలలో పునర్నిర్మాణ పనులకు రూ.846 కోట్లు నిధులు మంజూరు చేశామని తెలిపారు.
రాష్ట్రంలో గోదావరి, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఆగమ పండితులు, వేద పండితులు తేదీలను నిర్ణయించడం జరిగిందని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో ఈ అంశంపై చీఫ్ సెక్రటరీ, ఇతర శాఖల కార్యదర్శిలు హెచ్‌ఓడీలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలి పారు. 2028లో కృష్ణా నది పుష్కరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.
















