భారత రాజకీయాల్లోనే కాదు, పాలకుల దృక్పథంలోనూ పెను మార్పులకు కారణమయ్యింది తెలుగుదేశం పార్టీ. "రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదు. ప్రజలిచ్చిన అధికారాన్ని దేశ, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి వినియోగించడం." అన్న ఎన్టీఆర్... ఆ దిశగా ప్రజలను చైతన్యపరిచారు. రాజకీయనేతలు సదా ప్రజల్లోనే ఉండాలన్న సంప్రదాయాన్ని తెచ్చారు. తెలుగునాట ఏర్పడిన ఈ చైతన్యం క్రమేపీ ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. ఎన్టీఆర్ చైతన్యయాత్ర మాదిరిగా రథయాత్రలు, పాదయాత్రలు అవసరమయ్యాయి. రాజకీయ నాయకత్వం ప్రజల గడప ముందుకు వచ్చింది
దేశంలో సంక్షేమపాలనకు శ్రీకారం:
"పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం" అంటూ 'రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం'తో ప్రారంభించి ఎన్టీఆర్ అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షించాయి. దీంతో దేశంలో సంక్షేమ పాలన మొదలయ్యింది.
అలాగే ఎన్టీఆర్ తీసుకువచ్చిన మండల వ్యవస్థ, స్త్రీలకు ఆస్తి హక్కు... వంటివి దేశంలో అనేక సామాజిక మార్పులకు, పాలనా సంస్కరణలకు కారణం అయ్యాయి
ఇక నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక... దేశ ప్రజల దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ మీదే కేంద్రీకృతమైంది. చంద్రబాబు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు దేశానికి నూతన మార్గ నిర్దేశనం చేశాయి. చంద్రబాబు నోట ముందుగా వచ్చిన 'సంపద సృష్టి' అన్న పదం రాజకీయ నేతలనే కాదు ఆర్థికవేత్తలను, పారిశ్రామికవేత్తలను సైతం ఆకర్షించింది. 'సమర్థవంతమైన ఆర్థిక విధానాలే నిజాయితీగల రాజకీయాలకు బాటలు'
అని నమ్మి, ఆర్థిక సంస్కరణల ద్వారా నిరూపించి చూపిన మొదటి ఆర్థిక రాజకీయవేత్త చంద్రబాబు.
ఈ-గవర్నెన్స్ :
పాలనలో సాంకేతికతను ప్రవేశపెడుతూ... దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ-గవర్నెన్స్‌కు నాంది పలికిన చంద్రబాబు... దేశానికి సాంకేతికత అవసరాన్ని గుర్తుచేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసిన "నేషనల్ ఐటీ ప్యానెల్"కు నారా చంద్రబాబు నాయుడు చైర్ పర్సన్ గా వ్యవహరించారు అంటే, దేశ ఐటీ రంగంపై ఆయన ఎలాంటి ముద్ర వేసారో అర్థం చేసుకోవచ్చు.
టెలికాం సంస్కరణలు :
అంతేకాదు ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే దేశ టెలికాం రంగంలో సంస్కరణలు చేయదలచి చంద్రబాబు నేతృత్వంలో ఒక కమిటీ వేయబడింది. 1997 వరకూ బీఎస్ఎన్ఎల్ మాత్రమే ఫోన్ కనెక్షన్లు ఇచ్చేది. విదేశాల్లో మాదిరిగా ప్రైవేటు కంపెనీలు సెల్ఫోన్లు ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని ప్రధాని వాజపేయికి చంద్రబాబు సూచించారు.
చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ సూచనల మేరకు టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలకు గొప్ప అవకాశాలు కల్పిస్తూ టెలికాం విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. దాంతో పాటు 1997లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ను ఏర్పాటు చేసింది. అదే సమయంలో టెలికం రంగంలోకి రావాలని ధీరూబాయ్ అంబానీకి చంద్రబాబు సలహా ఇచ్చారు. ఆ తర్వాత టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఎలా పెరిగిందీ మనం చూసాం. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉందంటే దానికి కారణం ఆనాటి టెలికాం సంస్కరణలే.
స్వర్ణ చతుర్భుజి:
ఎన్డీయే ప్రభుత్వ కాలంలో ప్రధాని వాజపేయిని కలిసిన చంద్రబాబు నాయుడు విదేశాలలో మాదిరిగా భారత దేశంలోనూ విశాలమైన జాతీయ రహదారులను నిర్మించే ప్రతిపాదనను తెచ్చారు. అయితే అన్ని నిధులు సమకూర్చుకోవడం ప్రభుత్వానికి కష్టం కదా అన్నారు వాజపేయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో రోడ్లు వేయవచ్చని... టోల్ వసూలుకు అనుమతిని ఇద్దామని... ప్రయాణానికి రోడ్లు బాగుంటే ప్రజలు టోల్ ఫీజు కట్టడానికి వెనుకాడరని సలహా ఇచ్చారు చంద్రబాబు. ఆ ఫలితంగా కేంద్రం ‘స్వర్ణ చతుర్భుజి’ పేరుతో దేశం నలు దిక్కులా జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి చేపట్టింది.
నదుల అనుసంధానం :
దేశంలో నదుల అనుసంధానం ప్రతిపాదనను మొదటగా తెచ్చింది విజయవాడకు చెందిన ఇంజనీర్ కె ఎల్ రావు. ఆయన 1972 లోనే గంగా-కావేరి నదుల అనుసంధాన ప్రస్తావన చేసారు. అయితే అప్పట్లో ఆయన ఆలోచనలను కేంద్రంలోని పాలకులు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ నదుల అనుసంధాన ప్రతిపాదనను నాటి ప్రధాని వాజపేయి ముందుకు తెచ్చారు. అందుకు అంగీకరించిన వాజపేయి నదుల అనుసంధాన ప్రక్రియను ప్రారంభించడానికి ముందే పదవి నుంచి వైదొలిగారు.
అప్పట్లో అలా ఆగిపోయిన నదుల అనుసంధానం 2014లో చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి కావడంతో పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా - గోదావరి నదుల అనుసంధానం చేసి, దేశంలో తొలి నదుల అనుసంధానం చేసారు.
ఇలా నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ దేశ నిర్మాణంలో ఎన్నో కీలక మలుపులకు కారణమైంది.