అమరావతి: వైసీపీ మూకల చేతిలో హత్యకు గురైన టిడిపి బీసీ నాయకుడు జల్లయ్య కుటుంబ సభ్యులను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ లో పరామర్శించారు. జల్లయ్య భార్య, తండ్రి, తల్లితో లోకేష్ ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…జగన్ రెడ్డి చేస్తోంది సామాజిక అన్యాయమని దుయ్యబట్టారు. ఒకపక్క సామాజిక న్యాయ భేరి అంటూ బస్సు యాత్రలు చేస్తూ మరోపక్క బీసీ నాయకుల్ని పక్కా ప్రణాళికతో హత్యలు చేయిస్తున్నారని అన్నారు. బీసీలు తనవైపు లేరనే కక్షతోనే తన సామాజిక వర్గం నేతల్ని బీసీ నాయకుల్ని మట్టుపెట్టాలని జగన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు. జగన్రెడ్డి బినామీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గం మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్యచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా బీసీ నేతల హత్యల వెనుక పెద్ద కుట్ర ఉందని లోకేష్ పేర్కొన్నారు. బీసీ నేత జల్లయ్య కుటుంబానికి టిడిపి అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. రాజారెడ్డి రాజ్యాంగంలో హత్యలు చేసి హ్యాపీగా తిరగొచ్చనే భావనలో ఉన్నారు. రాబోయేది టిడిపి ప్రభుత్వం. ఖచ్చితంగా చేసిన ప్రతి నేరానికి వైసిపి నాయకులు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. హత్య చేసిన వారిని పట్టుకోవడం చేతగాని పోలీసులు బంధువులకు తెలియకుండా జల్లయ్య మృతదేహాన్ని తరలించడం, టిడిపి నాయకులు కనీసం నివాళులర్పించడానికి కూడా లేదని అరెస్టులు చేయడం ఆంధ్రప్రదేశ్ లో పోలీసు శాఖ దుస్థితిని తెలియజేస్త్తోందని లోకేష్ పేర్కొన్నారు.
కక్షగట్టి వెంటాడి చంపారు: కుటుంబసభ్యులు
మూడేళ్లు గ్రామంలో లేకపోయినా కక్షగట్టి వెంటాడి జల్లయ్యని అతి కిరాతకంగా చంపారని జల్లయ్య కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా మృతదేహాన్ని తరలించారని తెలిపారు. జల్లయ్యని హత్య చేసిన వారికి శిక్ష పడేవరకు న్యాయపోరాటం చేద్దాం… పార్టీ అండగా ఉంటుందని లోకేష్ చెప్పారు.