- ఓబులాపురం మైనింగ్‌కు అభ్యంతరం లేదని సుప్రీంలో అఫిడవిట్
- 1.95 లక్షల టన్నులు అక్రమంగా తవ్వారని అప్పట్లో రోశయ్య ప్రభుత్వం గుర్తింపు
- ఆ కేసు తేలకుండానే మరోమారు మైనింగ్‌కు గాలి కంపెనీలు సిద్ధం
- సిబిఐ కేసు ఉండగానే జగన్‌రెడ్డి ప్రభుత్వం నో అబ్జక్షన్
- అనుమతులపై నేడు సుప్రీం కోర్టులో విచారణ
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
కర్నాటక – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని వివాదాస్పద ఓబులాపురం రిజర్వ్ ఫారెస్ట్ లో 2010లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిన ఐరన్ ఓర్ మైనింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సహనిందితుడు గాలి జనార్దన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఓబులాపురంలో మైనింగ్ కు తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపడంలో ఆసక్తికరమైన పరిణామం. 2008 నుండి 2011 వరకు కర్ణాటక ప్రభుత్వంలో పర్యాటక, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా పనిచేసిన గాలి జనార్దన్ రెడ్డి వివాదస్పద ఓబులాపురం మైనింగ్ ప్రాంతంలో సుమారు 2లక్షల టన్నుల ఐరన్ ఓర్‌ను అక్రమంగా తరలించిన ఆరోపణలు, మనీలాండరింగ్ ఆరోపణలపై కూడా గాలి జనార్దన్ రెడ్డిపై విచారణ కొనసాగుతోంది. మైనింగ్ ఆగిపోవడానికి కారణమైన ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక సరిహద్దు వివాదం ఇప్పుడు పరిష్కారమైనందున మైనింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని ఓబులాపురం మైనింగ్ కంపెనీ సుప్రీం కోర్టును అభ్యర్థించింది. దీనిపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని జగన్ రెడ్డి నేతృత్వంలోని ఎపి ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. మార్చి 2010లో అనంతపురం జిల్లాలో వివాదాస్పద ప్రాంతంలో మైనింగ్ నిలిపివేస్తూ ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మైనింగ్ ఉల్లంఘనలపై సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతోంది. 11సంవత్సరాల తరువాత జూలై 21న సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రాష్ట్ర సరిహద్దు నివేదికను రెండు రాష్ట్రాలు చివరకు ఆమోదించినట్లు సుప్రీంకోర్టుకు సమాచారమిచ్చాయి. ఓబులాపురం ప్రాంతంలో మైనింగ్‌ను పునఃప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని ఓబులాపురం మైనింగ్ కంపెనీ సుప్రీంకు విన్నవించగా…ఆంధ్రప్రదేశ్ తరపున హాజరైన న్యాయవాది సరిహద్దు ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి అభ్యంతరం లేదని అఫిడవిట్ సమర్పించారు.
2010 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నేతృత్వంలోని ఎపి ప్రభుత్వం… బళ్లారి అడవుల్లో రెడ్డి సోదరులు (గాలి జనార్దన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి) సుమారు 1.95 లక్షల టన్నుల ఇనుప ఖనిజాలను అక్రమంగా తవ్వారని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఆ వివాదం పరిష్కారం కాకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ మైనింగ్ కార్యకలాపాలకు తమకు అభ్యంతరం లేదని సుప్రీం కోర్టుకు తెలిపిన నేపథ్యంలో బుధవారం సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టనుంది. 2009-10 మధ్య కాలంలో రెడ్డి (జనార్దన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి) సోదరులకు వ్యతిరేకంగా పనిచేసిన అనేక మంది అధికారులను జగన్ రెడ్డి సర్కారు సాగనంపడటంతో రాష్ట్ర వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఏప్రిల్ 2011లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రెండవ నివేదికలో నిబంధనల ఉల్లంఘించి చేసిన మైనింగ్ కు సంబంధించి సుదీర్ఘ జాబితాను సమర్పించింది.
సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదికలో కీలకాంశాలు:
1). మైనింగ్ లీజులు ఏవీ మైదానంలో గుర్తించబడలేదు.
2).రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో డంపింగ్.
3). లీజు ప్రాంతాలను పెంచేందుకు సరిహద్దు స్తంభాల తొలగింపు.
4). మైనింగ్ లీజులను 12-17 ఏళ్ల పాటు చట్టవిరుద్ధంగా పొడిగించడం.
5). అటవీ అనుమతులు లేకుండా మైనింగ్.
6). సరిహద్దు గుండా ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించేందుకు కర్నాటకతో సహా అటవీప్రాంతంలో అక్రమ రహదారుల నిర్మాణం.
7). గనుల ఉత్పత్తి సామర్థ్యాన్ని మించి ఇనుప ఖనిజం తరలింపు
కర్ణాటకలోని బళ్లారిలోని లీజు ప్రాంతాల్లో అక్రమంగా తవ్విన ఇనుప ఖనిజాన్ని అటవీ రహదారుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని పొరుగున ఉన్న అనంతపురం జిల్లాలోని గనులకు, ఆపై చెన్నయ్ పోర్టు ద్వారా ఐరన్ ఓర్ ను అక్రమంగా రవాణా చేశారు. రెండు కంపెనీలు వెలికితీసిన మెటీరియల్‌ను ఓఎంసి ద్వారా తరలించినట్లు గుర్తించిన సుప్రీంకోర్టు… సంబంధిత లింక్‌లపై దర్యాప్తు చేయాలని సీబీఐని సెప్టెంబర్ 2011లో కోరింది. గ్లోబల్ స్టీల్ మార్కెట్‌లో ఐరన్ ఓర్ కు విపరీతమైన గిరాకీ పెరగడంతో జనార్దన్ రెడ్డి, అతని సోదరులు కరుణాకర రెడ్డి, సోమశేఖర రెడ్డితో కలిసి 2000ల ప్రారంభంలో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని బళ్లారి రిజర్వ్ ఫారెస్ట్ లో ఐరన్ ఓర్ మైనింగ్ లీజు కింద ఉన్న 188 హెక్టార్లలో 134 హెక్టార్లు ఓఎంసీ దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాపారాలతో ఆర్థిక సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేస్తున్న కంపెనీల్లో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒఎంసి, బ్రాహ్మణి కంపెనీలు కూడా ఉన్నాయి. 2008-11 మధ్య కాలంలో కర్నాటకలో మొదటి బీజేపీ ప్రభుత్వంలో రెడ్డి సోదరులు మంత్రులుగా ఉన్నారు. 2018లో సోమశేఖర రెడ్డి, కరుణాకరరెడ్డి బీజేపీ టిక్కెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు.