. 5శాతం రిజర్వేషన్ తొలగించి తీరని అన్యాయం
. కాపు కార్పొరేషన్ నిర్వీర్యం
. రంగా హత్యలో ప్రధాన ముద్దాయి కుమారుడు దేవినేని అవినాష్‌కి వైకాపాలో పెద్దపీట
. వంగవీటి రంగాను హత్య చేయడం తప్పు లేదని వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డికి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ పదవి
. తిరుపతిలో చిరంజీవి బస చేసిన హోటల్‌పై జగన్‌రెడ్డి బంధువు దాడి
. కోనసీమ, విశాఖ, చిత్తూరులలో కాపు, బలిజ యువకులపై అక్రమ కేసులు, దాడులు
. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి సాంప్రదాయబద్ధంగా బలిజలకు కేటాయిస్తున్న రాజంపేట ఎంపీ సీటు పీకి మిథున్‌రెడ్డికి కేటాయింపు
. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడుపై బాంబు దాడి
. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం
. రంగా హత్యతో టీడీపీకి సంబంధం లేదని రంగా కన్నకొడుకు వంగవీటి రాధ చెప్పినా కూడా టీడీపీపై నిందలు కులచిచ్చు కోసం కాదా?
అమరావతి (చైతన్యరథం), అక్టోబర్ 31: టిడిపి, జనసేన కలిసి పోటీచేస్తే వైకాపా దివాలా తీస్తుందని జగన్ రెడ్డికి భయంపట్టుకుందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. అందుకే తన తొత్తుల ద్వారా కులచిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌పై నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారు. చంద్రబాబు కాపు, బలిజ బాంధవుడు, జగన్ రెడ్డి కాపు ద్రోహి అని దుయ్యబట్టారు. ఎస్.వి యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా ఉన్నపుడే చంద్రబాబు బలిజ సామాజికవర్గానికి చెందిన అంతరాజీ మోహన్‌ను యూనివర్సిటీ చైర్మన్ చేశారు. కాపు కార్పొరేషన్ పెట్టి తగుస్థాయిలో నిధులిచ్చారు. కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. కాపునేత రాజప్పను మొదటిసారి ఉపముఖ్యమంత్రిని చేసింది చంద్రబాబు మాత్రమే. కాపుల సంక్షేమానికి చంద్రన్న అన్నివిధాలా మంచే చేశారు.
జగన్ కుటుంబం కాపులకు ద్రోహం చేసింది. 5శాతం రిజర్వేషన్ రద్దుచేసింది. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడుపై బాంబుదాడి చేశారు. చిత్తూరు మాజీమేయర్ హేమలతను కారుతో తొక్కించారు. వైఎస్ కుటుంబం రాజకీయాల్లో రాకముందు పులివెందుల సర్పంచ్‌గా బలిజలు ఉండేవారు. జగన్‌రెడ్డి కుటుంబం వల్ల పులివెందుల టౌన్‌లో మెజారిటీగా ఉన్న బలిజలను అణగదొక్కారు. అన్నివిధాలా కాపులు, బలిజలకు ద్రోహం చేసింది జగన్ రెడ్డి, ఆయన కుటుంబం మాత్రమే.
వంగవీటి రంగాను హత్యచేయడం తప్పులేదని వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డికి పైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పోస్టింగ్ ఇచ్చింది జగన్ రెడ్డి కాదా? రంగా హత్యకేసులో దేవినేని నెహ్రూకి సంబంధం ఉందని చెప్పిన మీరు ఆయన కొడుకు దేవినేని అవినాష్ ను వైసిపిలో చేర్చుకున్నది నిజం కాదా? రంగా హత్య రెండు కుటుంబాల మధ్య జరిగిందే కానీ పార్టీలకు సంబంధం లేదని రంగా కన్నబిడ్డ వంగవీటి రాధా చెప్పిన మాట వాస్తవం కాదా? వంగవీటి రాధాను వాడుకుని వదిలేసింది జగన్ రెడ్డి కాదా? రాధాపై రెక్కీ నిర్వహించింది వైసిపి మూకలు కాదా, ఇందుకు సంబంధించి రాధా ఇచ్చిన ఫిర్యాదును వైసిపి బుట్టదాఖలు చేయలేదా? స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి రాజంపేట ఎంపి టిక్కెట్ బలిజలకు ఇస్తే జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఇచ్చింది నిజం కాదా అని బోండా ఉమా ప్రశ్నించారు.
హరిరామజోగయ్యగారి మాటలను వక్రీకరించి వైకాపా నేతలు చంద్రబాబుపై అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. జగన్‌రెడ్డి ముఠా అబద్ధాల పుట్ట. గొడ్డలి వేటును గుండెపోటుగా అబద్ధాల ప్రచారం చేశారు. నారా వారి రక్త చరిత్ర అని పచ్చి అబద్ధపు రాతలు సాక్షిలో రాశారు. పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో
ఉందని ఆనాడు నిందలు వేసి ఈనాడు లేదంటున్నారు. తమకు చెప్పుకోవడానికి చేసిందేమీ లేక ప్రాంతీయ కులచిచ్చుతో రాష్ట్రాన్ని కలుషితం చేస్తున్నారు. వైకాపా అబద్ధాలు నమ్మి మరోసారి మోసపోవడానికి కాపులు సిద్ధంగా లేరు.