ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కు కీలకం కానున్నాయి. వ్యవస్థలు నిర్వీర్యమై, అభివృద్ధి అడుగంటి అన్నిరంగాలలో అధోగతి పాలై భావితరాల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారయింది. ఈ స్థితిలో పరిస్థితులు చక్కదిద్దేందుకు పట్టభద్రుల ముంగిట సువర్ణావకాశం నిలిచింది. చట్టసభల్లో విద్యావంతుల గళాన్ని వినిపించే సదుద్దేశంతో పట్టభద్రుల కోసం ప్రత్యేకంగా నియోజకవర్గం ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుత అధికార పార్టీ వైఖరి ఆ ఉద్దేశాన్ని నీరు గార్చటమే గాక, రాష్ట్రంలోని పట్టభద్రులు అందరినీ అవమాన పరిచేదిగా వుంది. అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై వున్న వ్యక్తిని రాయలసీమ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా నిలిపింది. అదేవిధంగా ఒకండలిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేయటం తో పాటు వివిధ రకాల అక్రమ వ్యాపారాలలో నిందితునిగా ఉన్న ఒక ఎమ్మెల్సీ కి అనుచరుడిని ఉత్తరాంధ్రలో ఎన్నికల బరిలో నిలిపారు. దీన్ని బట్టి అధికార పార్టీ నాయకులకు పట్టభద్రులు అంటే ఎంత చులకనభావం వుందో అర్థమవుతోంది.
సాంకేతికంగా అభ్యర్థి నేరమయ జీవితం ఎన్నికలలో పోటీకి ఆటంకం కాకపోవచ్చు. కానీ ఆ విధమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా అధికార పార్టీ ఏవిధమైన సందేశం ఇస్తున్నట్టు? తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే అహంభావ ధోరణికి నిదర్శనం కాదా? ఇప్పటికే భావి తరాల భవిష్యత్ అంధకారమై వున్న తరుణంలో, ప్రలోభాలు లేదా ఇతరత్రా కారణాలతో నేరమయ ఆరోపణలు వున్న వారిని ఎన్నుకుంటే పరిస్థితులు మరెంత దుర్భరంగా మారతాయో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరముంది. అంతేగాక పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు విచ్చలవిడిగా నమోదయ్యాయి. దొంగ ఓట్ల నమోదులో అధికార పార్టీ మరీ బరితెగించినట్టు స్పష్టమవుతోంది. చివరకు వైసీపీ కార్యాలయం చిరునామా తోనో పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదు కావటం అధికార పార్టీ బరి తెగింపు కు పరాకాష్ట. వాలంటరీ వ్యవస్థను యధేచ్చగా దుర్వినియోగం చేసింది. వీటన్నింటి పైనా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం రాజ్యాంగ సంస్థలకు ఫిర్యాదు ఇవ్వటంతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధం అవుతోంది. అయితే ఈ విధమైన అరాచకాలను అడ్డుకొని అధికార పార్టీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కేవలం ప్రతిపక్ష పార్టీల దేనా? విద్యావంతులు అందరూ ఎంతో విజ్ఞతతో ఆలోచించాల్సిన తరుణమిది. అధికార పార్టీ అరాచకాలను అడ్డుకొని, ఈ రాష్ట్ర భవిష్యత్ ను చక్కదిద్దే శక్తి విద్యావంతులు అందరిపైనా వున్నది. విద్యావంతులు తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు.
గత ఎన్నికలలో ఒక్క ఛాన్స్ ఎంత విధ్వంసానికి దారితీసిందీ ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే వారి భవిష్యత్ ను చీకటి మయం చేశారు. దొంగ ఓట్లు, డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు తో ఎన్నికలలో గెలవగలమని విర్రవీగుతున్న అధికార పార్టీ నాయకులకు కనువిప్పు కలిగించే విధంగా పట్టభద్రుల తీర్పు వుండాలి. ఏటేటా ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, డీఎస్సీ నిర్వహణ వంటి వాటిపై మోసపూరిత హామీలు ఇచ్చి నిరుద్యోగులను అధికార పార్టీ దారుణంగా మోసగించింది. మరోవైపు ప్రయివేటు రంగంలోనూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. నూతనంగా పరిశ్రమలు రాక, వున్నవి తరలిపోతుండటంతో ఉపాధి అవకాశాలు మరింత జటిలంగా మారాయి. అదే సమయంలో గంజాయి వంటి మాదకద్రవ్యాలు, నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్న సంఘటనలు ప్రతిరోజూ వెలుగుచూస్తూనే వున్నాయి. పెట్రోలు, డీజిల్, విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలు, నిత్యావసరాల ధరలు ఇప్పటికే సామాన్యుడు మోయలేని స్థితికి చేరుకున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగుల పరిస్తితి మరీ దారుణంగా తయారయింది. గతంలో తమ న్యాయపరమైన హక్కులు, డిమాండ్ ల కోసం పోరాడిన ఉద్యోగులు, ఇప్పుడు వేతనాలు కోసం వినతి పత్రం ఇచ్చే దయనీయ స్థితిలో వున్నారు. ప్రభుత్వం తాజాగా ఏప్రిల్ 1 వ తేదీనే వేతనం ఇస్తామంటూ వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 1,2 సెలవు దినాలు అయినప్పటికీ వారి వేతనాలు ఏ విధంగా జమ అవుతాయి? అన్న సందేహం కంటే మొత్తం మీద జీతాలు వస్తాయన్న చిన్న పాటి ఆశతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆ ఆశ ఆవిరి కాకముందే 13 వ తేదీన జరుగనున్న పట్టభద్రుల ఎన్నికలలో తమ పబ్బం గడుపుకోవచ్చనేది అధికార పార్టీ ఆరాటంగా కానవస్తోంది. ఈ విధంగా సమాజంలో నున్న ప్రతివర్గమూ ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూనే వున్నది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈ ఎన్నికలలో అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరముంది. టిడిపి అభ్యర్థుల ను గెలిపించడం ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగం పంచుకునే అవకాశం పట్టభద్రుల ముంగిట నిలిచి వుంది.