రాష్ట్రంలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు నాయకత్వ పటిమకు అద్దం పట్టాయి. జగన్ పాలనపై ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యావంతులు అయిన పట్టభద్రులు కన్నెర్ర చేశారన్న సత్యం కాదన లేము. ఈ విషయం జగన్ మోహన్ రెడ్డికి ముందే తెలుసు. అయితే సింహం సింగిల్ గా వస్తుందన్న అహం, అధికారం చేతిలో ఉందన్న అతి విశ్వాసంతో ఆయన కళ్ళు మూసుకుపోయాయి. అధికారులు, వాలంటీర్ల సహకారంతో భారీ ఎత్తున బొగస్ ఓట్లు చేర్పించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బోగస్ ఓట్లు, దొంగ ఓట్లు వేసుకుని, రిగ్గింగ్ చేసుకుని గెలవవచ్చన్న ధీమాతో ఉన్నారు. అలాగే డబ్బుతో ఓట్లు కొనాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 27 వేల ఓట్లు వరకు ఉన్న రెండు ఉపాద్యాయ నియోజక వర్గాలలో జగన్ అంచనాలు ఫలించాయి. అయితే మూడు లక్షల కంటే ఎక్కువ ఓట్లు ఉన్న పట్టభద్రుల ఎన్నికల్లో ఆయన ఎత్తుగడలు దెబ్బతిన్నాయి. రాజకీయ వ్యూహంలో రాటుదేలిన చంద్రబాబు కార్యకర్తలను అడుగడుగునా హెచ్చరిస్తూ, సూచనలు ఇస్తూ, ప్రేరణ కలిగించి పోరాట పటిమను పెంచారు. రాజకీయాలలో వ్యూహం, ప్రచారం, నిర్మాణం, పోరాటం నాలుగు స్తంభాల వంటివి.
చంద్రబాబు ఈ నాలుగు అంశాల పట్ల జాగ్రత్త వహించారు. ఉపాద్యాయ సంఘాలకు ఎక్కువ పట్టు ఉన్న ఉపాద్యాయ ఎమ్మెల్సీల నియోజక వర్గాలలో పోటీ పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో నిరంతర కృషి చేశారు. పట్టభద్రుల ఓట్లు నమోదులో టిడిపి కొంత వెనకబడిన వాస్తవం గుర్తించారు. దీంతో ఎన్నికల సమయంలో వ్యూహం మార్చారు. ప్రాదాన్యత ఓట్లపై దృష్టి పెట్టారు. బలమైన పిడిఎఫ్ తోను, కొంతమేర ఓటు బ్యాంకు ఉన్న బిజెపితో పాటు ప్రతి స్వతంత్ర అభ్యర్థితో అవగాహనకు వచ్చారు. వారి ద్వారా రెండు, మూడు ఇతర ప్రాధాన్యత ఓటును అభ్యర్థించారు. ఈ వ్యూహమే ఎన్నికల్లో గెలవడానికి వరమయ్యింది. తూర్పు రాయలసీమలో డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కు మొదటి ప్రాధాన్యత ఓట్లలో వైకాపా కంటే 27,216 ఓట్లు అధికంగా వచ్చినప్పటికీ కోటా ఓట్ల కోసం అయితే రెండవ ప్రధాన్యత ఓట్లపై ఆధార పడవలసి వచ్చింది.
బిజెపి, పిడిఎఫ్ అభ్యర్దులకు వచ్చిన ఓట్లలో ఎక్కువ శాతం రెండవ ప్రాధాన్యత ఓట్లు టిడిపికి రావడం వల్లనే గెలుపు సాధ్యం అయ్యింది.అలాగే ఉత్తరాంధ్రలో డాక్టర్ వేపాడ చిరంజీవి రావుకు మొదటి ప్రధాన్యత ఓట్లు వైకపా కంటే 27,262 అధికంగా వచ్చి నప్పటికీ రెండవ ప్రాదాన్యత ఓట్లు అధికంగా రావడం వల్లనే గెలుపు సాధ్యం అయ్యింది. ఇక పశ్చిమ రాయల సీమలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో వైకాపా అభ్యర్థి కంటే 1820 ఓట్లు తక్కువగా వచ్చాయి. బిజెపి, పిడిఎఫ్ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లలో అత్యధిక శాతం రావడం వల్లనే అయనకు విజయం చేకూరింది. చంద్రబాబు ఈ విషయంలో నాయకులను, కార్యకర్తలను పదే పదే హెచ్చరించడం వల్లనే విజయం సాధ్యమయ్యింది. ఇక అడుగడుగునా వైకాపా ఆగడాలను ఎండ కట్టడంలోను, టిడిపి అభ్యర్ధులకు అనుకూలంగా ప్రచారం చేయడంలో మీడియా ముఖ్యంగా సోషియల్ మీడియా విశేష కృషి చేసింది. కార్యకర్తల నిర్మాణం పటిష్టంగా ఉన్నందు వల్ల పోలీసులు అరెస్టులు చేసినా, వాలంటీర్లు జోక్యం చేసుకున్నా ఎదురొడ్డి ఓట్లు వేయించు కోగలిగారు. అడుగడుగునా కార్యకర్తలు పోరాడి అభ్యర్థుల గెలుపుకు దోహద పడ్డారు.
జీరో బడ్జెట్ కు పట్టం గట్టారు :
మూడు పట్టభద్రుల నియోజక వర్గాలలోని 108 అసెంబ్లీ నియోజక వర్గాలలో ఓటర్లు జీరో బడ్జెట్ రాజకీయాలకు పట్టం గట్టారు. 7.16 లక్షలు మంది ఓటర్లలో మెజారిటీ పట్టభద్రులు డబ్బు తీసుకోకుండా టిడిపి అభ్యర్థులను గెలిపించారు. రెండు ఉపాద్యాయ నియోజక వర్గాలలో వైకాపా అభ్యర్ధులు ఓటుకు ఐదు వేల చొప్పున పంచారు. అయినా ఒక రూపాయి డబ్బు పంచని పిడిఎఫ్ అభ్యర్థులపై స్వల్ప మెజారిటీ సాధించారు. పట్టభద్రుల నియోజకవర్గంలోను వైకాపా అభ్యర్దులు 500 నుంచి 300 వేల వరకు పంచారు. టిడిపి అభ్యర్ధులు ఎక్కడ, ఎవరికి పైసా కూడా ఇవ్వలేదు. మూడు చోట్ల మంచి అభ్యర్థులను పెట్టారు. చక్కగా ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. తొలిసారిగా పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ముగ్గురు టిడిపి అభ్యర్థులను గెలిపించారు.
చంద్రబాబు పదే పదే చేప్పినట్టు ప్రజలకు దగ్గరైతే డబ్బు ఖర్చు పెట్టవలసిన పనిలేదు అన్నది ఈ ఎన్నికల్లో రుజువు అయ్యింది. ఇప్పటి నుంచి ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక పోరాటం చేస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తామనడానికి ఈ ఎన్నికలు మార్గదర్శనం చేశాయి. అయితే ముంతడు నీళ్లకే మురిసి పోవడం మంచిది కాదు.అతివిశ్వాసం పనికి రాదు. పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన సాధారణ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పలేము. శాసన మండలి పునరుద్ధరించిన 2009 నుంచి ఇప్పటి వరకు ఉపాద్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచిన కమ్యూనిస్టులు ఒక ఎమ్మెల్యే స్థానంలో కూడా గెలవ లేదన్న విషయం విస్మరించరాదు. అయితే ప్రజల్లో బలమున్న టిడిపికి ఈ ఎన్నికలు సెమీ ఫైనల్ లాగా భావించాలి. నిరంతరం నిర్మాణాత్మకంగా పనిచేసి రాష్ట్రానికి జగన్ పీడ వదిలించుకోవడానికి ప్రతి కార్యకర్త రాట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి. తిరిగి చంద్రబాబును ముఖ్య మంత్రిగా గెలిపించి అభివృద్ధిని పరుగులు తీయించాలి.