తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాటికి 92 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి శ్రేణులు మండల, మున్సిపల్ వార్డు, డివిజన్ స్థాయిలో గ్రామాలు, బస్తీలలో ఇంటింటికీ వెళ్లి గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరిస్తున్నాయి. మహిళా కార్యకర్తలు ఆడబిడ్డలకు బొట్టు పెట్టి టిడిపిని మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం జోరందుకోవడంతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పచ్చ జెండాలు రెపరెపలాడుతున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పండుగ వాతావరణంలో పార్టీ జెండాలు ఎగురవేస్తున్నారు.
పార్టీ కార్యక్రమం రోజురోజుకూ ఊపందుకుంటున్నందున నాయకులలో జోష్ కనిపిస్తోంది. అంతేకాదు పార్టీ పొలిట్ బ్యూరో మొదలు రాష్ట్ర, పార్లమెంట్, జిల్లా, మండల, గ్రామ ఇలా అన్ని స్థాయిలో కేడర్ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో నూతనోత్సాహంతో పాలుపంచుకుంటున్నారు. దీంతో మొదట్లో 10-12 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితమైన ఈ కార్యక్రమం రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలతో రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఇందుకోసం రాష్ట్ర, పార్లమెంట్ అబ్జర్వర్లు, అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు, మండల నాయకులతో రోజూ వారీగా టెలి కాన్ఫరెన్స్ లతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహించారు.
ఏయే నియోజకవర్గాల్లో కార్యక్రమం ప్రారంభించారు? ఏయే నియోజకవర్గంలో ప్రారంభం కాలేదు? అందుకుగల కారణాలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో నాయకుల భాగస్వామ్యం, ఇతర ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నాయకులు సహకరించకపోతే అందుబాటులో ఉన్న మిగతా అందరి నాయకులను సమన్వయం చేసుకొని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టారు. దీంతో అన్ని అడ్డంకులను దాటుకుని పార్టీ కార్యక్రమం జెట్ స్పీడ్ తో ఊపందుకున్నది.