తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు అధికార పార్టీ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. చంద్రబాబు పార్టీ కార్యక్రమాల దూకుడు పెంచారు. లోకేష్ ప్రజాక్షేత్రంలో దూసుకు పోతున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకుల అవినీతి పుట్టలు బద్దలు కొడుతూ, సాక్ష్యాధారాలతో ప్రజల ముందుంచుతున్నారు. వారిరువురూ బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ప్రజలతో మమేకం, ప్రత్యర్థులతో పోరాటం, పార్టీ పటిష్టత లపై ఏకకాలంలో దృష్టి సారించారు. నవయువకునిగా నిర్విరామంగా పనిచేస్తున్న చంద్రబాబు వేగాన్ని అందుకోలేక పార్టీ శ్రేణులు ప్రయాస పడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులపై మున్నన్నడూ లేని రీతిలో తీవ్ర స్థాయిలో చేస్తున్న విమర్శలు పదునెక్కాయి. హెచ్చరికలు ఘాటెక్కాయి. వాటికి లోకేష్ పోరాట పటిమ తోడు కావడంతో అధికార పార్టీకి ఊపిరి సలపటం లేదు. చంద్రబాబు సైతం నిర్విరామంగా కార్యక్రమాలు రూపొందించుకొని, ప్రజలతో మమేకం అవుతున్నారు. దానికి కొనసాగింపుగా ఎక్కడికక్కడ పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రతి చోటా పదునైన విమర్శలతో అధికార పార్టీపై విరుచుకు పడుతున్నారు. తీవ్రస్థాయిలో చేస్తున్న హెచ్చరికలు రాజకీయ ప్రత్యర్ధులు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఏడు పదుల పైబడి వయసున్న చంద్రబాబు నవయువకునిలా పార్టీ శ్రేణులను పరుగులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు వేగాన్ని అందుకునేందుకు పార్టీ శ్రేణులు నానా ప్రయాస పడుతున్నప్పటికి, ఆయన వైఖరిలో వచ్చిన మార్పు వారిని ఆనంద డోలికల్లో తేలియాడేలా చేస్తోంది. చంద్రబాబులో సరిగ్గా ఈ విధమైన మర్పునే పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కర్నూలు, గోదావరి, గుంటూరు, విజయనగరం, నెల్లూరు జిల్లాలలో వరుసగా పర్యటించిన చంద్రబాబు విరామం లేకుండా ప్రతిచోటా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు, వివిధ కులాలు, చేతివృత్తుల వారి సదస్సులు నిర్వహించారు.
ఈనెల12,13,14 తేదీలలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా జోనల్ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులు పనితీరును సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకు జోన్ 1 ఏలూరు, జోన్ 2 అమరావతి లలో సమీక్షలు పూర్తి చేశారు. ఈనెల 5 న విశాఖ, 6న కడప, 7న నెల్లూరు లలో జోనల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రతి చోటా రానున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అదేసమయంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా శాసనసభ్యులు, పార్టీ ఇంచార్జీలతో ముఖాముఖి నిర్వహించి అసమ్మతులు రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు. బాగా పనిచేయక పోతే టిక్కెట్ కు భరోసా ఇవ్వలేమన్న సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా అందుకు సంసిద్ధంగా వుండేలా శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల సామాన్య ప్రజానీకంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నట్టు అంతర్గత సర్వేలలో తేటతెల్లం అవుతున్నది. పార్టీ మరింత బలం పుంజుకోవాలని భావిస్తున్న చోట నాయకులకు ప్రత్యేక కార్యాచరణ ఇస్తున్నారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న పట్టుదల అన్నివర్గాలలో ద్యోతకమవుతుంది.