అంతా అనుకున్నట్టే అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో బైజూస్ కంటెంట్‌కు జగన్ సర్కార్ బై బై చేప్పేస్తోంది. దీంతో.. ఏపీలో సీఎం జగన్.. బైజూస్ బంధం మూన్నాళ్ళ ముచ్చటగా మారింది. గత ఏడాది చివర్లో ఎంతో ఆర్భాటంగా బైజూస్‌తో ఒప్పందాన్ని ప్రకటించిన సీఎం జగన్ రెడ్డికి.. 3 నెలల తిరిగే సరికే తత్వం బోధపడినట్టుంది. అందుకే బైజూస్ కంటెంట్‌కు బదులు.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కంటెంట్‌ను రెడీ చేయిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో సొంత కంటెంట్‌నే బైజూస్ ట్యాబ్‌లలో వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో బైజూస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్ళూ ఆడిన డ్రామా తుది అంకానికి చేరినట్టైంది.
“అడుసు తొక్కటం.. కాళ్ళు కడుక్కోవటం” అలవాటుగా మార్చుకున్న సీఎం జగన్ రెడ్డి నైజానికి మంచి ఉదాహరణగా ఏపీలో బైజూస్ ఉదంతం నిలుస్తోంది. ఆన్ లైన్ ట్యూషన్ సర్వీసులు అందించే ఈ బైజూస్ సంస్థ కరోనా సమయంలో బాగా పాపులర్ అయ్యింది. అయితే.. అదే సమయంలో నాసిరకం కంటెంట్‌తో పిల్లలకు.. వారి తల్లి తండ్రులకు కుచ్చుటోపీ పెడుతోందంటూ బైజూస్ పై అనేక విమర్శలు వచ్చాయి. క్వాలిటీ లేని కంటెంట్, ట్యాబ్‌లను అంట గడుతూ బైజూస్ మోసం చేస్తోందని దేశ వ్యాప్తంగా అనేక కేసులూ నమోదయ్యాయి. అయితే.. ఇలాంటి బైజూస్ సంస్థతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏకంగా దావోస్ వెళ్ళి మరీ ఒప్పందం చేసుకుని వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో బైజూస్ కంటెంట్ తో ఆన్లైన్ బోధన చేస్తామంటూ గొప్పలు పోయారు. బైజూస్ పాఠాలు వింటే.. పిల్లలంతా అపరమేధావులుగా తయారైపోతారనేలా అరచేతిలో స్వర్గం చూపించారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలోని ప్రభుత్వ కంటెంట్ కంటే.. బైజూస్ కంటెంట్ చాలా గొప్పదనేలా అప్పట్లో జగన్ రెడ్డి బిల్డప్ ఇచ్చారు. తీరా.. మూడు నెలలు గడిచాయో లేదో కానీ.. బైజూస్ కంటెంట్ కు జగన్ రెడ్డి బైబై చెప్పేస్తున్నారు.
అయితే… బైజూస్‌తో ఒప్పందం సందర్భంగా సీఎం జగన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఇప్పుడు ఓ సారి గుర్తుకు తెచ్చుకోవాలి. కార్పొరేట్ విద్యా స్కూళ్ళకే పరిమితమైన కాస్ట్‌లీ కంటెంట్‌ను ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇస్తున్నామని ఆనాడు సీఎం పేర్కొన్నారు. బైజూస్ కంటెంట్‌ను గేమ్ ఛేంజర్ గా ఆయన అభివర్ణించారు. ఒక్కో విద్యార్ధి 25 వేల రూపాయలు పెట్టి ఆ కంటెంట్ కొనుక్కోలేరు కనుక.. ప్రభుత్వమే దానిని కొని అందిస్తుందని గొప్పలు పోయారు. ఈ క్రమంలోనే 2022 డిసెంబర్ 21న రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి చదివే 4.59 లక్షల మంది విద్యార్ధులకు, 59 వేల మంది టీచర్లకు కలిపి 5 లక్షల 18 వేల 740 ట్యాబ్‌లు ఇచ్చారు. ఇందు కోసం 688 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. అంతే కాదు.. ఎంతో విలువైన కంటెంట్‌ను బైజూస్ ఇస్తోందని.. దాని విలువ 778 కోట్లని సీఎం జగన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ కంటెంట్‌తో ఏపీలో విద్యార్ధుల జీవితాలన్నీ మారిపోతాయనే విధంగా ఆనాడు సీఎం ప్రసంగం కొనసాగింది.
ఇక.. 8వ తరగతి విద్యార్ధులకు ఇచ్చిన ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్ లోడ్ చేయగా.. 4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు వారి మొబైల్ ఫోన్లలో కంటెంట్ లోడ్ చేశారు. అయితే.. బైజూస్ కంటెంట్ వాడటం మొదలు పెట్టిన తరువాత గానీ.. జగన్ సర్కార్ కు అసలు విషయం బోధపడలేదు. తాము అడుసులో కాలేసామని భావించిన సీఎం జగన్ రెడ్డి.. బైజూస్ కంటెంట్ ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చేశారు. దానికి సమాంతరంగా సొంత కంటెంట్ తయారు చేయిస్తున్నారు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సీబీఎస్ఈ బేస్డ్ సిలబస్ రూపొందించే బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలికి అప్పగించారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఈ కంటెంట్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిని బట్టి ఏడాది కాలంలోనే బైజూస్ సేవలకు జగన్ సర్కార్ బైబై చెప్పినట్టు అర్ధం అవుతోంది.
ప్రస్తుతం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో రూపొందుతున్న కంటెంట్ కు, మొబైల్ యాప్‌కు సైతం భారీగా ఖర్చు అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన వందల కోట్ల రూపాయల మాటేంటి…? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అంతే కాదు.. బైజూస్ ట్యాబ్‌లు పంపిణీ సందర్భంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు అవసరం లేదనే విధంగా సీఎం జగన్ మాట్లాడారు. ప్రతీ టీచర్ బైజూస్ కంటెంట్ ను ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కూడా విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ చేయించారు. బీఈడీ చేసి… టెట్ , డీఎస్సీ వంటి అర్హతలు పాసైన ఉపాధ్యాయులు సైతం బైజూస్ కంటెంట్‌ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి..? బోధనలో ఉపాధ్యాయుల ఎక్స్‌పీరియన్స్ కన్నా బైజూస్ కంటెంట్ గొప్పదా..? అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. పిల్లల భవిష్యత్‌ను ఫణంగా పెట్టి.. ఏపీ సర్కార్ అనవసర ప్రయోగాలు చేస్తోందనే విమర్శలు వచ్చాయి. అయితే ఆనాడు జగన్ సర్కార్ వాటిని బేఖాతర్ చేసింది. కానీ.. ఇప్పుడు బైజూస్ కంటెంట్ ను వదిలించుకోవటంతో.. ప్రజల అనుమానాలే నిజం అయ్యాయి. మరోవైపు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి SCERT కంటెంట్‌నే ప్రభుత్వం కొనసాగిస్తుందా..? లేక బైజూస్ కంటెంట్ ను కూడా మిక్స్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ. ఒకవేళ రెండింటినీ ఒకేసారి విద్యార్థులపై రుద్దితే వారిపై తీవ్ర ఒత్తిడి పడుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి 2019-20 కరోనా లాక్‌డౌన్ సమయంలో బైజూస్ ఆన్ లైన్ క్లాసులకు విద్యార్ధులు ఎగబడ్డారు. దీంతో ఆ సంస్థకు ఇబ్బడి ముబ్బిడిగా లాభాలు వచ్చి పడ్డాయి. ఆ తరువాత కోవిడ్ పరిస్థితులు చక్కబడటంతో.. బైజూస్ ఖాతాదారులు కూడా తగ్గారు. క్రమంగా బైజూస్ లాభాలు తగ్గి నష్టాల బాట పట్టింది. ఏకంగా 4 వేల 500 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు మూటగట్టుకున్న ఈ సంస్థ వేలాది మంది ఉద్యోగుల్ని సైతం తొలగించింది. ఈ నేపథ్యంలో కొంత మంది వైసీపీ నేతల సహాయంతో చక్రం తిప్పిన బైజూస్ అధినేత రవీంద్రన్.. ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. దశల వారీగా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బైజూస్ కంటెంట్ అంటగట్టే స్కెచ్ దీని వెనుక ఉందంటున్నారు. అయితే ఫస్ట్ ఫేజ్‌లో 8వ తరగతి విద్యార్ధులకు కంటెంట్ ఇచ్చేలా ఎగ్రిమెంట్ అయ్యింది. కానీ.. మూడు నెలల్లోనే బైజూస్ కంటెంట్ బోర్ కొట్టేయటంతో.. ఏపీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. దీంతో జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లి తండ్రుల్లో నవ్వుల పాలౌతోంది.