టిడిపి మహిళా నేత ముల్పూరి కళ్యాణి అక్రమ అరెస్ట్‌పై చర్యలు కోరుతూ జాతీయ మహిళా కమిషన్, డీజీపీకి తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాశారు. గత మూడున్నరేళ్లలో డ్రగ్స్ నేరాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగంతో పాటు మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి నేరాల నియంత్రణకు బదులుగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటోందని మండిపడ్డారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేస్తే టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.
తెలుగు మహిళా నాయకురాలు ముల్పూరి కళ్యాణిని నిందితురాలిగా చేర్చారన్నారు. ఏప్రిల్ 10న గన్నవరం, హనుమాన్ జంక్షన్ పోలీసులు కళ్యాణి ఇంట్లోకి చొరబడి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారని.. దుస్తులు మార్చుకునేందుకు కూడా అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమక్షంలోనే దుస్తులు మార్చుకోవాలని బలవంతం చేశారన్నారు. ఇది తన వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమే అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసులు మహిళలపై నేరాలు కట్టడి చేసే బదులు ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోసుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కళ్యాణి అక్రమంగా అరెస్టు ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనిత లేఖలో పేర్కొన్నారు.