ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ సర్పంచ్ సూరనేని సూరిబాబు వర్ధంతిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. కొత్తూరు తాడేపల్లి, వేమవరం, నైనవరంలో అక్రమంగా గ్రావెల్ తోలకాలు జరిగినట్లు అధికారులు నివేదిక అందజేశారన్నారు. అధికారులు ఇచ్చిన నివేదిక పై ఇప్పుడు ఎం సమాధానం చెబుతావని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను ప్రశ్నించారు. ఇంకా దేవినేని ఉమ మాట్లాడుతూ.. ‘‘కొండపల్లి అడవిలో గ్రావెల్ అమ్ముకుంది ఎవరు? అధికారులు ఫైన్ వేస్తే కట్టింది ఎవరు? అటవీ అధికారులను బదిలీ చేయించింది ఎవరు? తప్పు చేయకపోతే రూ.10 లక్షలు ఫైన్ ఎందుకు కట్టారు? మీ బామ్మరిది.. నీ బినామీ కాదా? అక్రమార్కులను అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టాలి.
రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద 10 రెట్లు వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయాలి. నీ రాజీనామా డ్రామాలు కట్టిపెట్టి ఎమ్మెల్యే సమాధానం చెప్పు. నువ్వు, మీ పార్టీ నాయకులు తప్పు చేసినట్టు రుజువు అయింది. మైలవరం నియోజకవర్గంను దోచుకోవడానికే ఆగర్భ శ్రీమంతుడు అనే ముసుగు వేసుకొని వసంత ఎమ్మెల్యే అయ్యాడు. పాపాలన్నీ చేసి ఇళ్లకు స్టిక్కర్‌లు వేస్తే ప్రజలు హర్షించరు. ఎమ్మెల్యే, అతని అనుచరులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.