యువగళం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం డోన్ నియోజకవర్గం, ప్యాపిలి మండలం, ప్యాపిలి గ్రామంలో వేరుశనగ రైతు రామన్నను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కలిశారు. పాదయాత్రగా వెళ్తూ పొలంలో పని చేసుకుంటున్న రామన్న వద్దకు వెళ్లి వెంటనే రైతు వద్దకు వెళ్లి వ్యవసాయం ఎలా ఉందని వాకబు చేశారు. రైతు రామన్న మాట్లాడుతూ నాకు 5 ఎకరాల పొలం ఉంది. వేరుశనగ పంట వేశాను. డ్రిప్ ఉండడం వల్ల పంట తీయగలుగుతున్నాను. టీడీపీ పాలనలో 90శాతంపై డ్రిప్ ఇచ్చేవాళ్లు. తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలు వచ్చేవి. నేడు డ్రిప్ మేమే కొనుక్కోవాల్సి వస్తోంది.
వైసీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదు. నకిలీ విత్తనాలు వల్ల పంట నష్టం జరుగుతోంది. మాకు మంచి విత్తనాలు, సబ్సిడీపై ఎరువులు, డ్రిప్ ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని లోకేష్ కు వివరించారు. దానిపై లోకేష్ స్పందిస్తూ రైతు ముఖంలో చిరునవ్వు చూడడమే టీడీపీ లక్ష్యం. గత పాలనలోనూ రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాం. 90శాతం సబ్సిడీపై డ్రిప్ తో పాటు, యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు కూడా సబ్సిడీపై అందించి రైతులను ఆదుకున్నాం.
జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదు. రైతులు పడే కష్టాలు ఏమీ తెలియవు. అందుకే డ్రిప్ రద్దు చేశాడు. జేబులు నింపుకునేందుకు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు అమ్మేవాళ్లను ప్రోత్సహిస్తున్నాడు. మేం అధికారంలోకి వచ్చాక రైతులకు గతంలో అమలు చేసిన పథకాలను పునరుద్ధరిస్తాం. రైతులను ఆదుకుని వ్యవసాయం లాభసాటి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.