పత్తికొండ నియోజకవర్గం గుడిసె గుప్పరాలలో సర్పంచ్ ల సంఘం ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను సర్పంచుల అధీనంలోకి తీసుకురావాలి. పంచాయితీలకు చెందాల్సిన నిధులను సిఎఫ్ఎంఎస్, పిడి ఎకౌంట్ల నుంచి రాష్ట్రప్రభుత్వం మాకు చెప్పకుండా ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తోంది.
2022-23 ఆర్థికసంవత్సరానికి కేంద్రం విడుదల చేసిన ఆర్థికసంఘం నిధులు వెంటనే పంచాయితీలకు ఇవ్వాలి. గ్రామసచివాలయాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.20లక్షల నిధులను ఎమ్మెల్యే ద్వారా కాకుండా సర్పంచ్ ల ద్వారా అభివృద్ధి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలి. పంచాయితీల విద్యుత్ బిల్లులు, క్లాప్ మిత్రుల జీతాలు పాతపద్ధతిలోని రాష్ట్రప్రభుత్వం చెల్లించాలి. జాతీయ ఉపాధి పథకం నిధులను ఉపాధి హామీ చట్టం ప్రకారం గతంలో మాదిరి సర్పంచ్ లకు ఇవ్వాలి.
సర్పంచ్, ఎంపిటిసిలకు రూ.15వేలు, ఎంపిపి, జడ్ పిటిసి లకు రూ.30వేలు గౌరవవేతనం చెల్లించాలి అని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. 73,74 రాజ్యాంగసవరణల ద్వారా స్థానికసంస్థలకు సంక్రమించిన అధికారాలను సమాంతర వ్యవస్థల ద్వారా జగన్ ప్రభుత్వం హైజాక్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీలకు కేంద్రం ఇచ్చిన రూ.7,880 కోట్ల నిధులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దొంగిలించింది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయితీలకు నిధులు ఇచ్చి బలోపేతం చేస్తాం. సర్పంచ్ ల గౌరవ, ప్రతిష్టలు పెంచేలా వారికి 73,74 రాజ్యంగ సవరణల ప్రకారం అధికారాలు ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.