టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రతి పల్లెలో తాగు నీటి సమస్య లేకుండా చేస్తాం. ధైర్యంగా ఉండండి. రాబోయే చంద్రన్న ప్రభుత్వంలో అన్ని సమస్యలు తీరుతాయి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం ఆలూరు నియోజకవర్గం దేవనకొండ శివార్లలో యువనేత లోకేష్ శనగచేలో దిగి అక్కడి రైతుకూలీల సాధకబాధకాలు తెలుసుకున్నారు. రోజంతా కష్టపడితే రూ. 200 కూలీ వస్తోంది. పెరిగిన నిత్యావసర ధరలతో బతుకుబండి లాగలేకపోతున్నాం. కరెంటుబిల్లులు భారీగా పెరిగాయి. వ్యవసాయ రంగం పూర్తిగా నాశనం అయింది.
పల్లెల్లో తాగడానికి నీళ్లు కూడా ఉండడం లేదు. కుటుంబసభ్యులు అద్దెకు ఆటోలు నడుపుకుంటుంటే పింఛను తీసేస్తున్నారని రైతుకూలీలు వాపోయారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ ను పీకిపారేయడమే కరెంటుబిల్లుకు పరిష్కార మార్గం. టిడిపి హయాంలో రూ. 200 ఉన్న పింఛనును రూ.2వేలకు పెంచాం. సంక్షేమ కార్యక్రమాలు తెచ్చింది, వాటిని కొనసాగించేది చంద్రబాబే. జగన్ ప్రభుత్వం కుంటిసాకులతో తొలగించిన పెన్షన్లు పునరుద్దరిస్తాం. చంద్రబాబు హయాంలో ఉల్లి రైతులకు రాయితీ అందించాం అని చెప్పారు.