సెల్ఫీ ఛాలెంజ్ లకు జవాబు చెప్పలేక చేతులెత్తేసిన వైసీపీ
మండుటెండల్లో నూ ఊపిరి సలుపని పర్యటన
అధికార పార్టీ నాయకుల్లో పెరుగుతున్న అసహనం
నేటి నుంచి 3 రోజులపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండుటెండల్లో సైతం ఊపిరి సలుపని పర్యటనలు చేస్తున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం మూడురోజుల పాటు నియోజకవర్గాలలో పర్యటిస్తూ శ్రేణులలో ఉత్తేజం నింపుతున్నారు. పర్యటన ముగిసిన అనంతరం రాత్రి బస సైతం అదే నియోజకవర్గంలో చేస్తున్నారు. ఆ జిల్లాలోని నాయకులు అందరితో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో జరుపుతున్న పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార పార్టీ నాయకుల అవినీతిని ఎండగడుతూ, టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధిని కళ్లెదుటే సాక్షాత్కరింప చేస్తూ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్ లకు స్పందించ లేక అధికార పార్టీ నాయకులు చేతులెత్తేశారు.
ఇదే తరుణంలో చంద్రబాబు జరుపుతున్న పర్యటనలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో చంద్రబాబు, లోకేష్ పర్యటనలను అడ్డుకునేందుకు అధికార పార్టీ నాయకులు కొందరు విఫలయత్నం చేస్తున్నారు. బాధ్యతాయుత స్థానాలలో వున్న నాయకులే బరితెగించి వీధి రౌడీల తరహాలో సవాళ్లు చేయటం అధికార పార్టీలో ప్రబలుతున్న అసహనానికి నిదర్శనంగా నిలిచింది. ఒకవైపు మండుటెండలు, మరోవైపు, గాలి, వాన. అయినప్పటికీ ప్రజామద్ధతుతో చంద్రబాబు, లోకేష్ ల పర్యటనలు నిరాఘాటంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన పర్యటనలో పోలీసు వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి.
చంద్రబాబు తాజాగా గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, తాడికొండ నియోజకవర్గాలలో 25,26,27 తేదీలలో జరుపనున్న పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన నాయకులు అందరూ సమిష్టిగా కృషించేస్తున్నారు. ఇప్పటికే మూడు ప్రాంతాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి టిడిపి ఇంచార్జీ నియామకం జరుగక పోవటంతో పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న నాయకులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
పర్యటన ఏర్పాట్లలో భాగంగా సీనియర్ నాయకుడు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఫోటో తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించటం వివాదాస్పదమైంది. అదే సమయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు యధావిధిగా వుంచారు. దీంతో అధికార యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదన్న విషయం స్పష్టమవుతుంది. దీనిపై ఆందోళన నిర్వహించేందుకు టిడిపి శ్రేణులు సిద్ధమయ్యాయి. చంద్రబాబు పర్యటన ప్రారంభం అయ్యే లోగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నాహం చేస్తున్నాయి.