నేరస్తుల్ని కాపాడుతున్న జగన్ రెడ్డికి సిఎంగా కొనసాగే అర్హత లేదు
టీడీపి అధినేత చంద్రబాబు పై పలుమార్లు దాడులకు పాల్పడిన వైనం
రూ.2,27,500 కోట్ల ప్రజాధనం లూటీ
నాలుగేళ్లలో ప్రతి కుటుంబం పై రూ. 7,86,413ల భారం
టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలపై 150 పైగా అక్రమ కేసులు
365మంది టిడిపి నేతలపై అక్రమకేసులు, కష్టోడియల్ టార్చర్
టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి
వివేకాహత్యకు సంబంధించి ‘నీలి’ మీడియా లో వికృత రాతలు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అసత్యప్రచారాలు
ఎడారి, శ్మశానం అన్న అమరావతిలో సెంటు స్థలాలపై పేదలను మోసాగిస్తున్న వైనం
చార్జ్ షీట్ ను విడుదల చేసిన టిడిపి సీనియర్ నాయకులు
…….
వైసీపీ అధికారం చేపట్టి సరిగ్గా నాలుగు సంవత్సరాలు పూర్తయింది. అదే రోజు రాష్ట్ర మనుగడకు ముప్పువాటిల్లే ధ్వంసరచనకు బీజం పడింది. భావితరాల భవిష్యత్ అగమ్యగోచరం అయింది. తెలుగుజాతి మనుగడ కత్తిమొనపై వుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నడూ చూడని విద్వేషం పురుడుపోసుకున్నది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ స్వీయ రాజ్యాంగంతో రాజ్యాంగ వ్యవస్థలపైనే దాడి మొదలైంది. ఫలితంగా వ్యవస్థలు నిర్వీర్యమై రాజ్యాంగ ప్రసాదిత హక్కుల హననం నిత్యకృత్యమైంది.
కుల, మత రహితంగా, నిస్పక్షపాతంగా పాలన చేస్తామని ప్రమాణం చేసిన బాధ్యతాయుత స్థానాలలో వున్న నాయకులే కులాల కుంపట్లు రాజేశారు. ప్రభుత్వానికి, రాజకీయానికి మధ్య వున్న లక్ష్మణ రేఖా చెరిగిపోయింది. రాజధాని అమరావతి నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులతో ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గాలిలో కలసిపోయింది. కుల విద్వేషం, వ్యక్తిగత స్వార్ధంతో రైతుల త్యాగాన్ని అపహాస్యం చేశాయి. ఫలితంగా సామాన్యునికి సైతం రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లే పరిస్తితి ఉత్పన్నం అయింది. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు గతంలో ఎన్నడూ లేనంత అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రశ్నించే గొంతులపై అధికారం జులుం కొనసాగింది.
నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగిన రాజ్యాంగ, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మంగళవారం ‘ప్రజా చార్జ్ షీట్’ విడుదల చేసింది. టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, బోండా ఉమామహేశ్వరరావు, పరుచూరి అశోక్ బాబు, పంచుమర్తి అనూరాధ, నసీర్ అహమ్మద్, గురజాల మాల్యాద్రి తదితరులు మంగళవారం టిడిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చార్జ్ షీట్ ను విడుదల చేశారు.
గత నాలుగేళ్లుగా వివిధ రంగాలలో చోటుచేసుకున్న ప్రభుత్వ అరాచక, అవినీతి విధానాలు, అధికార పార్టీ నాయకులు పాల్పడిన నేరాలు, ఘోరాలను చార్జ్ షీట్ లో వివరించారు. వివేకానంద రెడ్డి క్రూర హత్యలో నేరస్థుల్ని కాపాడుతున్న జగన్ రెడ్డి కి సిఎం గా కొనసాగే నైతిక అర్హత లేదని చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. పౌరుల, ధన, మాన ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండాలంటే జగన్ రెడ్డి సిఎం పదవికి రాజీనామా చేసి, న్యాయవిచారణకు సహకరించాలని చార్జ్ షీట్ లో డిమాండ్ చేశారు.