టిడిపి అధికారంలోకి వచ్చాక రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామనై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం మైదుకూరు నియోజకవర్గం సీతారాంపురం రైతులు యువనేత లోకేష్ ను కలసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
మా గ్రామపొలాలకు కుందూనది నుంచి సాగునీరు అందుతోంది. కుందూనది విస్తరణ పేరుతో ప్రభుత్వం ఒక ప్రముఖ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వగా, కొందరు స్థానిక వైసిపి నేతలు సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు. స్థానిక నేతలు నదివెంట ఉన్న మట్టి, ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. నది వెంట ఉన్న రైతుల విద్యుత్ మోటార్లు, పైప్ లైన్లు, ఇతర సామగ్రిని ధ్వంసం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు కొనసాగుతున్నప్పటికీ మట్టి, ఇసుక తవ్వకాలు ఆపడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ రైతులకు న్యాయం చేయండి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి జగన్ అండ్ కో కు ఇసుక, మట్టి అమ్మకాలపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదు. గత నాలుగేళ్లలో బినామీ సంస్థను అడ్డంపెట్టుకొని ఇసుకద్వారా జగన్ రూ.10వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి ధనదాహం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61మంది అమాయకులు బలయ్యారు. రైతుల పక్షాన నిలవాల్సిన అధికారులు వైసిపి తొత్తులుగా మారడం దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీ సీతారాంపురం రైతులకు అండగా నిలస్తుందని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.