అమరావతి: అధికారంలో ఉన్నానన్న అహంకారంతో వ్యవస్థలను అడ్డం పెట్టుకొని చంద్రబాబుపై జగన్ రెడ్డి పెట్టించిన తప్పుడు కేసులన్నీ న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయని, జగన్ బారి నుంచి రాజ్యాంగాన్ని, న్యాయాన్ని కాపాడుతున్న న్యాయవ్యవస్థను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అధికారంతో రాష్ట్రాన్ని దోచుకొని, లక్షలకోట్లు దాచుకున్న జగన్ రెడ్డి, ప్రజల్ని మాయమాటలతో మభ్యపెడుతూ తన దుర్మార్గపు చర్యల్ని నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నాడని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టించినంత మాత్రాన దొంగ దొరవడు.. దొర దొంగ కాబోడని ఆలపాటి అన్నారు. నిప్పులాంటి చంద్రబాబు తప్పు చేశాడని నిరూపించటం వైఎస్ వల్లే కాలేదు.. జగన్ వల్ల ఏమవుతుందన్నారు.
విచారణకు హాజరుకాకుండా జగన్ కుంటిసాకులు..
జగన్ రెడ్డి నిజంగా మనిషైతే, సిగ్గు, శరం, చీము, నెత్తురుంటే అవినీతి కేసుల్లో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. దేశంలో ఏ రాజకీయనాయకుడిపై లేనన్ని పెద్దపెద్ద కేసులు తనపై ఉన్నా, కోర్టుల విచారణకు హాజరు కాకుండా జగన్ కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటున్నాడు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై జగన్ రెడ్డి బురదజల్లింది నిజం కాదా? ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ జగన్ రెడ్డి వారిని వేధిస్తున్నది నిజం కాదా అని ఆలపాటి ప్రశ్నించారు.
కనీస ఆధారాల్లేకుండానే కేసులు..
చంద్రబాబుపై జగన్ రెడ్డి పెట్టించిన ఐ.ఆర్.ఆర్. (ఇన్నర్ రింగ్ రోడ్), ఇసుక, మద్యం కేసులన్నీ ఆలూలేదు..చూలూ లేదు…కొడుకు పేరు ఏదో అన్నట్టుగా ఉన్నాయని న్యాయస్థానాల విచారణలో తేలిపోయింది. చంద్రబాబుపై పెట్టిన కేసుల విచారణ సందర్భంగా ప్రాథమిక ఆధారాలు కూడా లేని ఇటాంటి కేసులు ఎప్పుడూ చూడలేదని న్యాయకోవిదులు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు చూపలేదని న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలు జగన్ రెడ్డికి, అతని ప్రభుత్వానికి నిజంగా పెద్ద చెంపపెట్టు అనే చెప్పాలి. టీడీపీ అధినేతపై పెట్టిన తప్పుడు కేసులు…ఆధారాల్లేని ప్రభుత్వ ఫిర్యాదులపై న్యాయస్థానాలే విస్మయం వ్యక్తం చేశాయి. ఉచితంగా ప్రజలకు ఇసుక అందించిన చంద్రబాబు దోషా… అదే ఇసుకను అమ్ముకుంటూ వేలకోట్లు దోచేసిన జగన్ రెడ్డి నిర్దోషా? రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న ఇసుక కొండలు ముఖ్యమంత్రికి కనిపించడం లేదా? చంద్రబాబుపై ఇసుక కేసు పెట్టిన మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి.. జగన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తే వ్యక్తి కాదా? అక్రమ మద్యాన్ని అధికధరకు అమ్ముతూ వేలకోట్లు కొట్టేసిన జగన్ రెడ్డి, చంద్రబాబు హయాంలో అమలైన మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని నిరాధార ఆరోపణలతో న్యాయస్థానాల్ని ఆశ్రయించి భంగపడ్డాడు. తన దోపిడీ గురించి వాస్తవాలు ప్రజలకు చెబుతున్నారన్న అక్కసుతోనే టీడీపీ అధినేత చంద్రబాబు సహా, ఆ పార్టీ నేతలపై జగన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడని తేలిపోయింది. తలెత్తుకు తిరగాల్సిన ప్రభుత్వం, రాష్ట్ర పాలనా వ్యవస్థలు న్యాయస్థానాల ముందు తలదించుకోవడానికి కారణం జగన్ రెడ్డి కాదా అని ఆలపాటి ప్రశ్నించారు.
మాయని మచ్చలా సీఐడీ..
న్యాయశాస్త్రంలోని లొసుగుల్ని అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి అన్యాయంగా చంద్రబాబుని జైలుకు పంపాడని ప్రజలకు అర్థమైంది. చంద్రబాబుపై జగన్ రెడ్డి పెట్టించిన కేసులన్నీ తప్పుడు కేసులు..కక్షసాధింపులో భాగంగా పెట్టినవేనని ప్రజలు గ్రహించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగన్ రెడ్డి చేస్తున్న పనులు.. సామాన్యప్రజలకు అభద్రతా భావం కలిగిస్తున్నాయి. జగన్ తండ్రి, దివంగత రాజశేఖర్ రెడ్డే .. చంద్రబాబు తప్పుచేశాడని నిరూపించలేకపోయాడు. జగన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతున్న సీఐడీ వ్యవస్థ రాజ్యాంగానికే మాయని మచ్చగా మారింది. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిన జగన్ రెడ్డి తన దుర్మార్గాలు ప్రజలకు తెలియచేస్తున్నారన్న అక్కసుతోనే ప్రతిపక్షనేతలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు. జగన్ దాష్టీకాల నుంచి అంబేద్కర్ రాజ్యాంగాన్ని, న్యాయాన్ని నాయస్థానాలు రక్షించడాన్ని స్వాగతిస్తున్నామని ఆలపాటి అన్నారు.