- భార్య మృతదేహం తరలింపునకు గంగులు పడ్డ అవస్థలు తీవ్రంగా కలచివేశాయి
- గిరిజన బిడ్డలకు వైద్యం ఎలాగూ అందించలేరు
- కనీసం మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు కూడా చేయలేరా?
- అసమర్థుడి పాలనలో అంపశయ్యపై వైద్యం
అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో అంపశయ్య పైకి చేరిన వైద్య, ఆరోగ్యరంగ పరిస్థితులకు, గిరిజనుల
కష్టాలకు ఈ సంఘటన నిదర్శనమన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన భార్య మృతదేహాన్ని గంగులు ద్విచక్రవాహనంపైన కొద్దిదూరం, డోలీపైన మరికొంతదూరం అవస్థలు పడి స్వస్థలానికి తీసుకెళ్లడం రాష్ట్రంలో మారుమూల గిరిజనులు ఎదుర్కొంటున్న పరిస్థితులను కళ్లకు కడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్థుడి పాలనలో గిరిజన బిడ్డలకు సరైన వైద్యం అందించడం ఎలాగూ చేతకాలేదని, కనీసం మృతదేహాన్ని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయలేరా? అని ప్రశ్నించారు. ఫోన్ కొట్టిన వెంటనే ‘కుయ్.. కుయ్…’’ అంటూ అంబులెన్స్ పరుగెత్తుకొస్తుందని గాలికబుర్లు చెప్పే ముఖ్యమంత్రి దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
అసలేం జరిగిందంటే…?
చిట్టెంపాడు గ్రామానికి చెందిన మాదల గంగులుకు భార్య, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. ఈ నెల 5వ తేదీన కుమారుడికి అనారోగ్యం చేయడంతో డోలీలో శృంగవరపుకోట ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే భార్య గంగమ్మ కూడా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఇద్దరినీ విజయనగరం సర్వజన ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాబు ఈ నెల 6వ తేదీన మృతి చెందాడు. తర్వాత గంగమ్మ కూడా తీవ్ర అనారోగ్యం పాలవడంతో మూడు రోజుల క్రితం విశాఖ జిల్లా భీమిలి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించగా… మంగళవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ చనిపోయింది.
గంగులు తన భార్య మృతదేహాన్ని ఆటోలో తీసుకురావడానికి మాట్లాడారు. డ్రైవరు ఎస్.కోట వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక కొండల పైకి రానంటూ వెనక్కి వెళ్లిపోయాడు. విధిలేక బాధను దిగమింగుకుంటూ తన స్నేహితుడి ద్విచక్ర వాహనం తీసుకొని తమ్ముడు సాయంతో భార్య మృతదేహాన్ని మధ్యలో కూర్చోబెట్టుకొని ఏడు కిలో మీటర్లు దూరంలో ఉన్న బొడ్డవర రైల్వేస్టేషను వరకు తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీ కట్టి బంధువుల సాయంతో మోసుకుంటూ గ్రామానికి తరలించాడు.