- రాజీనామా బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- కొత్త ఇంఛార్జ్‌లకు సహకరించని స్థానిక నాయకత్వం
- తలలు పట్టుకుంటున్న పార్టీ అధిష్టానం
అమరావతి, చైతన్యరథం: వైసీపీ పార్టీలో సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల మార్పు వ్యవహారం ఆ పార్టీ మెడకు చుట్టుకుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్‌బై చెప్పి వారి దారి వారు చూసుకోగా ఇప్పుడు మరికొంత మంది అదే బాటలో నడుస్తున్నారు. మిగిలిన వారు తమకు టిక్కెట్లు ఇవ్వకుంటే పార్టీ మారి తీరుతామంటూ అధిష్టానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చాలా చోట్ల నియోజక వర్గ కొత్త ఇంఛార్జ్‌లకు స్థానిక నాయకత్వం సహకరించడం లేదు. కొన్ని చోట్ల ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిందేననే డిమాండ్లు కూడా వస్తున్నాయి. దీంతో నియోజకవర్గాల మార్పు కసరత్తు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని వైసీపీ అధిష్టానం భావించిన ప్పటికీ అసంతృప్తుల, నాయకుల తిరుగుబాట్ల నేపథ్యం లో అది కాస్త ఆలస్యమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
ఇప్పటికే నాలుగు జాబితాల ద్వారా 58 అసెంబ్లీ, 10 పార్లమెంట్ నియోజక వర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లను ప్రకటిం చారు. మరో రెండు జాబితాలు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా 10 మంది ఎంపీల స్థానంలో కొత్త నియోజకవర్గ ఇంఛార్జ్‌లను జాబితాను విడుదల చేయనున్నారు. మరో జాబితాలో మరికొంత మంది ఎమ్మెల్యే స్థానాల్లో కొత్త ఇంఛార్జ్‌లు రానున్నారు.
మంత్రుల ఇలకాలో అసంతృప్తులు
ఇద్దరు మంత్రులు నారాయణస్వామి, జయరామ్‌లను ఎంపీ స్థానాలకు ఇంఛార్జ్‌లుగా నియమించారు. జిడి నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని తిరుపతి పార్లమెంట్ ఇంఛార్జ్‌గా నియమించారు. అక్కడ ఉన్న ఎంపీ రెడ్డప్పను జిడి నెల్లూరు ఎమ్మెల్యే స్థానం ఇంఛార్జ్‌గా వేసారు. ఇప్పుడు అక్కడ నారాయణస్వామి అనుచరులు పార్టీ అధిష్టానానికి ఎదురుతిరిగారు. తమకు నారాయణస్వామినే కావాలని అడుగుతున్నారు. ఇతరులు వద్దు నారాయణస్వామి ముద్దు అంటూ ఫ్లెక్సీలు కూడా వేశారు. ఒక వేళ నారాయణస్వామికి తిరిగి టిక్కెట్ ఇవ్వకుంటే తాము పార్టీకి గుడ్ బై చెబుతామని కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు మరో మంత్రి జయరామ్ కూడా అధిష్టానంపై అలకతో ఉన్నారు. ఆయన్ను కర్నూల్ ఎంపీగా పంపించి ఆయన స్థానంలో విరుపాక్షిని ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా వేశారు. అప్పటి నుండి జయరామ్ సైలెంట్ అయి పోయారు. విరూపాక్షి ఆయన ఇంటికి వెళ్లి కలవడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేరు. గత కొద్ది రోజులగా జయరామ్ గాయబ్ అయిపోయారు. ఎవ్వరికీ అందుబాటులో లేరు. వేరే పార్టీల్లో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. మరోవైపు జయరామ్ అనుచరులు మాత్రం విరూపాక్షికి సహకరించేది లేదని తెగేసి చెప్పారు.
ప్రకాశం జిల్లాలో ఎగిసిపడుతున్న అసంతృప్తులు
ప్రకాశం జిల్లాలో ఇంఛార్జ్‌లను మార్చిన ప్రతిచోటా అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అధిష్ఠానంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇంతవరకు సమోధ్య కుదరలేదు. ఒంగోలు ఎంపీ సీటు మాగుంట రాఘవరెడ్డికి ఇవ్వాలని బాలినేని పట్టుబడుతుండగా అందుకు జగన్‌రెడ్డి అంగీకరించడం లేదు. దీంతో ప్రతిష్టంభన నెలకొంది. మరోవైపు కనిగిరి ఎమ్మెల్యే మధుసుధన యాదవ్ పార్టీపై తిరుగుబాటు ప్రకటించారు. కొత్త ఇంఛార్జ్ నారాయణ యాదవ్‌కు సహకరించేది లేదని స్థానిక నాయకత్వం తిరగబడ్డారు. యర్రగొండపాలెంకు కొత్తగా వచ్చిన ఇంఛార్జ్‌కు మంత్రి ఆదిమూలం సురేష్ అనుచరులు సహకరించడం లేదు. మరోవైపు దర్శికి కొత్త ఇంఛార్జ్‌గా వచ్చిన బూచేపల్లి శివప్రాద్‌రెడ్డికి స్థానియ నాయకత్వం ఎదురుతిరిగారు. ఆయనకు మద్దతు ఇచ్చేది లేదని చెప్పేశారు. ఇక మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని మార్చాలని జంకే వెంకటరెడ్డి వర్గం పట్టుబడుతోంది.
పార్ధసారధి మాస్టర్ స్ట్రోక్
ఇన్నాళ్లూ పార్టీకి చేదోడువాదోడుగా ఉన్న తనకు టిక్కెట్ నిరాకరించడంతో పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధి అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఆయనొక్కొడే కాక తనలా అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పోగేస్తున్నారు. తాను పార్టీ మారేప్పుడు తనతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీని తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఆయనతోపాటు తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, మరో ఎమ్మెల్యే ఎలీజా, కనిగిరి ఎమ్మెల్యే మధుసుదన్ యాదవ్, గురజాల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని వెంట తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.
పల్నాడు జిల్లాలోనూ వైసీపీ ఎమ్మెల్యేలపై అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. నర్సారావు పేట సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని మార్చాలని గజ్జెల బ్రహ్మరెడ్డి వర్గం పట్టుబడుతోంది. క్యాంప్ ఆఫీసుకు పిలిపించి మాట్లాడినా ఫలితం కనిపించలేదు. మరోవైపు సత్తెనపల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబును మార్చాలని కూడా స్థానిక నాయకత్వం పట్టుబుడుతోంది. మొత్తంగా వైసీపీ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. మిగిలిన రెండు జాబితాలు వచ్చిన తర్వాత పరిస్థితి మరింత చేజారే అవకాశాలు కన్పిస్తున్నాయి.
నందికొట్కూర్‌లో తిరుగుబాటు
నందికొట్కూర్‌లో ఎమ్మెల్యేగా ఉన్న ఆర్ధర్‌ను కాదని సుధీర్‌ను ఇంఛార్జ్‌గా నియమించారు. ఇప్పుడు ఆర్ధర్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనకు అన్యాయం చేశారని, వైసీపీలో ఎస్సీలకు గౌరవం లేదని, తన నియోకవర్గంలోనూ పెత్తనమంతా బైరెడ్డి సిద్దార్డ్ రెడ్డినే చేశాడని విమర్శలు గుప్పించారు. ఆయన అనుచరులంతా పార్టీని వీడుదామనే ప్రతిపాదనను ఆర్దర్ దగ్గరకు తీసుకొచ్చారు. దీంతో ఆర్ధర్ భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచనలో పడ్డారు. రెండు రోజుల్లో తన కార్యకర్తలతో మీటింగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు తాను నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు.