- ముస్లింల 4 శాతం రిజర్వేషన్ కాపాడతాం
- సర్వజనామోదంగా కూటమి మేనిఫెస్టో..
- హామీల అమలుపై జగన్‌వి పచ్చి అబద్ధాలు
- బటన్ పీఎం కూడా నొక్కుతారు, నీలా చెప్పుకోవట్లేదే?
- రాయచోటి ప్రజాగళంలో చంద్రబాబు ధ్వజం
- బాబు సభకు పోటెత్తిన జన సందోహం
రాయచోటి (చైతన్యరథం): అసమర్థ ముఖ్యమంత్రి పిచ్చి చేష్టలతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్త్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకంపై ఏనాడైనా ఏ ముఖ్యమంత్రి చిత్రమైనా చూశారా? ప్రయివేట్ ఆస్తుల పత్రాలపై జగన్ బొమ్మలు ఎలా వేసుకుంటాడా? భూములు మీవి.. బొమ్మలు జగన్‌వా? అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆస్తి నాదా జగన్‌దా? అని వైసీపీ నాయకులు ఓట్లడగానికి వచ్చినపుడు ప్రశ్నించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ తెచ్చిన లాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రమాదకరమని అంటూ, ఇది వస్తే ప్రజల భూమి ప్రజలది కాకుండా పోతుందన్నారు. ఆస్తి పత్రాల ఒరిజినల్స్ ప్రభుత్వం దగ్గర పెట్టుకుని.. కంప్యూటరు నకలు పత్రాలు ప్రజలకు ఇస్తామని చెప్పడం.. పాలకుడు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు అని మండిపడ్డారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా గురువారం రాయచోటిలో నిర్వహించిన సభకు జనం పోటెత్తారు. పెద్దఎత్తున హాజరైన జనాన్ని ఉద్దేశించి చంద్రబాబు ఉత్సాహంగా మాట్లాడుతూ జగన్ వైఫల్యాలపై దుమ్మెత్తిపోశారు.
ముందు ముద్దులు.. తరువాత గుద్దులు
2019 ఎన్నికలకు ముందు జగన్ పెట్టిన ముద్దులకు ముగ్దులై అధికారం ఇచ్చారు. తరువాత ఏం జరిగింది? అని చంద్రబాబు ప్రజలకు చైతన్యవంతమైన ప్రశ్న వేశారు. జగన్ పాలనలోనే `నిత్యావసరాల ధరలు పెరిగాయి. తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. జె.బ్రాండ్ల మద్యంతో తాను కోట్లు సంపాదించి ప్రజారోగ్యాన్ని దెబ్బతీశాడు. గత మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం తరువాత ఓట్లడుతానన్న జగన్.. ఇప్పుడు ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తానన్నాడు, చేశాడా? పీఆర్సీ, ఇంటీరియం రిలీఫ్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? జంబో డిఎస్సీ వేసి, ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? జర్నలిస్టులు, ఉద్యోగస్తులకు ఇళ్లు కట్టిస్తానన్నాడు, కట్టించాడా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పనుల్లో 50శాతం రిజర్వేషన్లన్నాడు, కల్పించాడా? ఉద్యోగాలొచ్చాయా? రైతులు బావున్నారా? ఇవేమీ లేకుండా మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చానని ఎలా చెబుతాడు? అని చంద్రబాబు ప్రశ్నించారు. జాబు రావాలంటే బాబే రావాలి. జగన్ వస్తే గంజాయి వస్తుంది తప్ప, జాబులు రావని చంద్రబాబు స్పష్టం చేశారు.
పీఎం బటన్ నొక్కినా ఏనాడూ జగన్‌లా ప్రచారం చేసుకోలేదు..
సంక్షేమం అంటే జగన్ దృష్టిలో సంపద సృష్టి కాదని, అప్పులుతెచ్చి బటన్ నొక్కడం అన్నట్టే ఉందని చంద్రబాబు పద్దేవా చేశారు. సకల జనులకు న్యాయం చేసే ఉద్దేశంతో కూటమి తెచ్చి మేనిఫెస్టోకి, దోపిడి ముఠా వైసీపీ మేనిఫెస్టోకీ నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ముఖ్యమంత్రి అంటే పేదల జీవన ప్రమాణాలు పెంచేవాడు. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేవాడు. ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రాభివృద్ధికి పాటుపడేవాడు. బటన్ నొక్కడం వినా, జగన్ వీటిలో ఏమైనా చేశాడా? అని నిలదీశారు. సంక్షేమానికి ప్రధాని కూడా బటన్ నొక్కుతున్నారు, కానీ జగన్‌లా ప్రచారం చెప్పుకోరని అన్నారు.
ఆరోగ్య శ్రీకి అన్నీ బకాయిలే..
ప్రతి ఒక్కరికీ పింఛన్ తెచ్చాం, ఇవ్వబోతున్నాం అని చంద్రబాబు ప్రకటించారు. మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామని, ఇప్పుడిస్తున్న రూ.3వేల పింఛను రూ.4వేలు పెంచామని చంద్రబాబు అన్నారు. పింఛన్ల విషయంలో జగన్ కపటి నాటకాన్ని వెల్లడిస్తూ.. 2028కి రూ.250, 2029కి రూ.250 పెంచుతానని జగన్ చెప్పడం పేదలపై అతనికున్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు. ఏప్రిల్ నుంచే రూ.4వేల పింఛన్ మొదటి తారీఖునే ఇంటి దగ్గరే ఇస్తామని, దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఇస్తామంటూ, కాళ్లు, చేతులు లేకుండా అవస్థలు పడుతున్న వారికి రూ.15వేలు పింఛన్ అందచేస్తామన్నారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశామని చెబుతూ, చంద్రన్న బీమాతో చనిపోతే రూ.5 లక్షలు, ప్రమాదశాత్తూ చనిపోతే రూ.10 లక్షలు ఇస్తామన్నారు. మట్టి ఖర్చులకు డబ్బులు ఇస్తామని, ఆరోగ్య శ్రీ పూర్తిగా జబ్బుపడిరదని అన్నారు. రూ.1500 కోట్లు డబ్బులు కట్టకపోవడంతో పేషెంట్లు చూడమని ఆసుపత్రులు పడకేశాయని, ఆరోగ్య బీమా కింద రూ.25 లక్షలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మండల హెడ్‌క్వార్టర్‌లో జనరిక్ మెడికల్ షాపులుపెట్టి తక్కువ ధరలకు మందులిస్తామని, బీపీ, షుగర్ పేషెంట్లకు మందులు ఇంటికి ఉచితంగా పంపిస్తామని హామీ ఇచ్చారు.
డ్రైవర్ల కోసం సాధికార సంస్థ
బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. రూ.1.5 లక్షల కోట్లు ఐదేళ్లలో వెచ్చించి బీసీల రుణం తీర్చుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. నాయిబ్రాహ్మణులకు 200 యూనిట్ల విద్యుత్ చితంగా ఇస్తామని, చేనేత కార్మికులకు మరమగ్గాలకు 500 యూనిట్లు, హ్యండ్ లూమ్స్‌కి 200యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామన్నారు. కాపు సంక్షేమానికి రూ.15వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు. రాయలసీమలో ఒక్క బలిజకూ సీటు ఇవ్వని వ్యక్తి జగన్ అంటూ, టీడీపీ అందరికీ సీట్లిచ్చి సామాజిక న్యాయం పాటించిందన్నారు. డ్రైవర్ల కోసం సాదికార సంస్థ పట్టి ఆదుకుంటామని, బాడ్జి ఉన్న ఆటో, ట్యాక్స్, హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్స్‌కి ఏడాదికి రూ.15వేలు ఇస్తామన్నారు. ఆటో కొనాలంటే రూ.4 లక్షల వరకు 4 శాతం వడ్డీకి ఇప్పిస్తామని, డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. ఆడబిడ్డలకు నెలకు రూ.1,500, తల్లికి వందనం పేరుతో ఒక్కో బిడ్డకు ఏటా రూ.15,000 చొప్పున ఇస్తామన్నారు. ఉచితంగా గ్యాస్ సిలెండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, రోడ్లన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తామని, చెత్తపన్ను రద్దు చేస్తామని, విషపూరిత మద్యం బ్రాండ్లను రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.